కొత్తపెళ్లి కొడుకునే
గ్రీష్మ తాపంలో అల్లాడుతున్న మల్లియను
రెండు మంచు బిందువులు ముద్దాడితే
అది కొత్తగానే ఉంటుంది
బీటలు వారిన పుడమిపై
వానచినుకులు కురిస్తే
ఆ మట్టివాసన కొత్తగానే ఉంటుంది
ఎండమావులు మాయమై
నీటి చెలమలు ఊరితే
ఆ అనుభవం కొత్తగానే ఉంటుంది
అవును
నాకూ కొత్తగానే ఉంది
మూడు వసంతాల కాలం దాటినా
ప్రతిదినం నాకు కొత్తగానే ఉంది
అనుబంధమే తెలిసిన మనసుకు
అనుభవం నిత్యనూతనమైతే
ఆ అనుభూతి కొత్తగానే ఉంటుంది
ప్రణయపుష్పాలు వికసించి
దరిచేరిన చెలియ
మనస్విని అని తెలిసి
మనసు కొత్త రెక్కలు విప్పితే
ప్రతి భావమూ కొత్తగానే ఉంటుంది
మనసులో మనసుగా
అడుగులో జాడగా
బంధమై నిలిచిన జవరాలు
అన్ని ఆలోచనల్లో తానై నిలిస్తే
అంతరంగంలో మొలకలు వేసే భావాలకు
తానే మూలమై విలసిల్లితే
చివుర్లు తొడిగిన అనురాగం
నాకెప్పుడూ కొత్తేకదా
దశనూ దిశనూ ప్రభావితం చేస్తూ
అంతరంగనావకు చుక్కానిలా నిలిచి
నా అభిరుచులకు దర్పణం పడుతూ
నట్టింట నడియాడే నిన్ను చూస్తుంటే
నేనెప్పుడూ
కొత్తపెళ్లి కొడుకునే కదా
మనస్వినీ
No comments:
Post a Comment