విజయం వెనుక
కొంచెం ఉద్విగ్నం
కొంచెం సంభ్రమం
ఇంకొంచెం ఆశ్చర్యం
పెదాలపై సన్నని చిరునవ్వు
ఏదో తెలియని విజయగర్వం
అంతలోనే కనులలో
అంతర్లీనంగా తెరలు
అవును అవి కన్నీటి తెరలే
వేకువజామునే నీవందించిన బహుమానం
నీ మనసు పుస్తకంలో ఉదయించిన భావం
నీవు లిఖించిన అక్షరం
నీవు విరచించిన మధురసంతకం
నీ రాతల్లో అనేకసార్లు ఆవేశాన్నే చవిచూశాను
నీ మాటల్లో ఎన్నో సార్లు తూటాలను తిన్నాను
అప్పుడప్పుడూ నీవు నన్ను కొనియాడినా
ప్రేమతో పరవశింపజేసినా
రగిలిన ఆవేశంలో నా మనసు మూగగానే రోధించేది
ఈ ఉదయం నీ మానసంలో ఉదయించిన భావకిరణం
నా మనసుకు అద్దం పట్టింది
నాపై నీవు చెప్పిన భాష్యం
నీవు కురిపించిన అభిమానం
నీవు ఇచ్చిన వివరణం
అక్కడక్కడా కొంచెం అధికప్రేమ కురిసినా
అనురాగం కదలాడినా
నా విజయాలకు
నా భావాలకు
నా దశకు దిశకు
అన్ని గమనాలకు
ఇప్పుడు నీవే అడుగుజాడయనేది
ఎవరూ కాదనలేని సత్యం
అర్థం చేసుకునే తోడుంటేనే
ఏ మగాడికైనా విజయం
మరి ఆ విజయం నిజంగా నాకు దక్కితే
ఆ విజయం వెనుక నీవు లేవా
మనస్వినీ
No comments:
Post a Comment