అమృతధార అమ్మ
ప్రతి కదలికలో నువ్వున్నావు
ప్రతి ఘడియలో నువ్వే ఉన్నావు
కంటి చూపుల వెలుగులో
ప్రాణం నిలిపే శ్వాసలో
నిత్యమై నిఖిలమై నువ్వే ఉన్నావు
చెల్లిగా అన్నకు పంచే అనురాగంలో
అమ్మగా నువ్వే ఉన్నావు
చెలియగా ప్రియవల్లభుడికి
చేరువయ్యే మమకారంలో తల్లిగానే కనిపించావు
బుడిబుడి నడకల చిన్నారికి
నడక నేర్పే వయసులో మమకారమై నిలిచావు
కన్నబిడ్డల భవితను తీర్చిదిద్దే ఓర్పులో దేవతలా మారావు
బిడ్డల బోసినవ్వులో
మెరుపుచుక్కవై మెరిసావు
రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోతే
విలవిలలాడే మనసులో త్యాగమయివై కుమిలావు
ఎక్కడ లేవని నువ్వు
ప్రతి అణువులోనూ నువ్వే ఉన్నావు
అమృతమంతా కలబోసిన ఆ దేవుడు
నిన్నే సృష్టించాడేమో
అందుకే తీపి చేదుల లోకంలో
తీయ్యదనాలే కురిపించావు
ఆడతనం కాదు ఆమ్మతనం గురించి చెప్పుకోవాలి
ఎందుకంటే ప్రతిమగువా అమ్మే
చెల్లిగా
చెలియగా
ఆలిగా
అమ్మగా
ప్రతి దశలోనూ ఆడది అమ్మే
నీకోసం ఒక దినోత్సవం ఎందుకు
అనుక్షణం నువ్వు
అందరి గుండెల్లో కురిసే అమృతధారవే కదా అమ్మా
అమ్మా నీకు వందనాలు
No comments:
Post a Comment