ఏమని రాయను మనస్వినీ
ఏమని రాసుకొను
ఏమని వివరించను
ఎలా అవిష్కరించను
నీ అంతరంగాన్ని...
నేను గ్రహించానా లేదా
తెలుసుకున్నానా
తెలుసుకోలేదా
ఏమని తెలపను
నా భావాలని...
గుండెనిండా ఆశలతో
బలమైన ఆకాంక్షలతో
నీవు నిర్మించిన
ఆశలసౌధం
పునాది దశలోనే బీటలు
వారిందని ఆక్రోశించనా....
మనసు వద్దని
సొదపెడుతున్నా
అంతరంగం వద్దని
వారిస్తున్నా
శిలాశాసనాలు రాసుకున్న
నీవు
సరియైన దిశలోనే
పయనిస్తున్నావని
ప్రశంసలు
కురిపించనా...
మనసును గుదిబండలా
మార్చి
ఆశలను బాధగానే
విసిరేసి
భావాలను కన్నీళ్ళతో
కడిగేసి
నీవు తీసుకున్న
నిర్ణయాలను
ప్రశ్నించజాలనా...
బృందావనం కోరిన మనసు
వికలమయ్యింది
అనురాగశిఖరం
కూలిపోయింది
అయినా నీలో మమతల వర్షం
కురుస్తూనే ఉంది
అనుబంధాల దీపం
వెలుగుతూనే ఉంది
నీ చర్యలను
తెలుసుకోలేనా...
ఒకరు చేసిన ద్రోహానికి
మనసు వికలమైనా
మారని మమతకు తార్కాణమై
నిలిచిన
ఔన్నత్యాన్ని ఎలా కొలవగలను...
మాటలకు అందని భావాలు
అక్షరకుసుమాలై
వికసించని వేదనలు
ఎలా రాసుకొను
కొన్ని భావాలకు
అక్షరరూపం
మహాకవులకే అసాధ్యం
మనస్వినీ...
No comments:
Post a Comment