కథావస్తువు నీవే
అవును నా అక్షరం నీ చుట్టూనే
తిరుగుతుంది
నా ప్రతిభావం నీ కోసమే
పుట్టుకువస్తుంది
ముభావమైన నా మానసం
నిన్ను చూస్తేనే భావాల మొలకలు వేస్తుంది
రూపమే లేని అక్షరాలు
నీ నామంతోనే రూపాంతరం చెందుతాయి
నా ప్రణయం నీవే
నా ఆవేశం నీవే
నా వేదన నీవే
నా రోదన నీవే
నా కవితలు నిన్నే స్మరిస్తాయి
నా అక్షరాలు నిన్నే పలకరిస్తాయి
ఒక అక్షరం
మరో అక్షరాన్ని పెనవేస్తూ
మలి అక్షరం
మరో అక్షరాన్ని ముద్దాడుతూ
నీ మెడకు హారంగా
నీ పాదాలకు మువ్వలుగా
నీ ఉనికికి వలయంగా
ఎప్పుడూ నీతోనే ఉంటాయి
జీవితమే నీవైనప్పుడు
నా కథానాయికవే నీవైనప్పుడు
నాకు నీవు
కథావస్తువు కాకుండా ఎలా ఉంటావు
మనస్వినీ
No comments:
Post a Comment