మనసు సరాగాలు
చల్లని మంచు బిందువులు
చెంపను తాకి ఏవో గిలిగింతలు రేపాయి
ఊసులేవో నువ్వు చెబుతున్నట్టుగా...
కనురెప్పలపై తారాడే బిందువుల కదలికలకు
ఏవేవో పులకింతలు కలిగాయి
నీ పెదాలు చిలిపి సంతకాలు చేసినట్టుగా...
అప్రయత్నంగానే కనులువిచ్చుకున్నాయి
విప్పారిన నీ హృదయంలా...
సంభ్రమం
ఆశ్చర్యం
నేనెక్కడున్నానో
తెలియనివైనం నీ ఒడిలో కరిగిపోయినట్టుగా...
అది కలయా
భ్రాంతియా
అందమైన అబద్దమా
సొగసైన నిజమా
అర్థం కాని నా భావమా...
నలువైపులా చూసాను
నేను బతికే ఉన్నాను
అది నేను నిత్యం తిరిగే పరిసరమే
ఎందుకంతగా మారిపోయింది
నవ్వుల చందమామ నీ మోములా...
పక్షుల కువకువలు
వీనులకు మధురంగా తాకుతున్నాయి
చల్లని పిల్లగాలులు
కొంటెగా మనసును మీటుతున్నాయి
నీ జలతారు పలుకుల్లా...
నీలాల గగనంపై విహరించే విహంగం
మృధువుగా సవాలు విసిరింది
కొలనులోని మీనం రమ్మని పిలిచింది
మాతో పోటీ పడగలావా అని
మనసు వికలం కాలేదు
మరింత వికసించింది
నా మనసుతో ఇవన్నీ పోటీపడగలవా అని...
పచ్చని ఆకులు నాట్యం చేస్తున్నాయి
అప్పుడే పుట్టిన మారాకులు
ఏదో కావాలని మారాం చేస్తున్నాయి
నువ్వూ నేనూ చేసుకునే చిలిపి అల్లరిలా...
మామిడి చెట్టుపై సంగీత విభావరిలో
రెచ్చిపోయిన కోయిలమ్మ గానంతో
మరలా కన్నులు విచ్చుకున్నాయి
అవును
నేను ఇంట్లోనే ఉన్నా
అంతరంగ విశ్లేషణలో
ఒక మౌనమునిలా...
మనసు మంజీరమయితే
ప్రకృతి పులకించి మనతో రాదా
మనస్వినీ...
No comments:
Post a Comment