నన్నే చదువుతోంది
కేరింతలు నేర్పిన తొలిపేజీ
తప్పటడుగులు వేసిన మలిపెజీ
ఒక్కో పేజీ ఒక్కో అనుభవం
ఒక పేజీ కన్నీరుగా పుష్పిస్తే
మరో పేజీ వేదనగా ఉబికివచ్చింది
అయినా పేజీలు తిరగవేస్తూనే ఉన్నా
జీవితమనే పుస్తకాన్ని
నిత్యం చదువుతూనే ఉన్నా
తొలి అధ్యాయం
బోసినవ్వులు దాటి
యవ్వన ప్రాయం చేరినా
మిగిలింది కష్టాలు కన్నీళ్ళే
ఒకపెజీలో మొక్కవోని ధైర్యం
ఎక్కడలేని విశ్వాసం
పేజీలు మారుతూనే ఉన్నాయి
కొన్నిపెజీలు భావరహితమై
నిస్సారంగా కనిపిస్తే
మరికొన్ని పేజీలు ఉద్విగ్నతను రేపాయి
విజయయాత్రను తలపించిన పలు పేజీలు
వైభవశిఖరాన్ని నిలిపాయి
రాతల్లో ఏదో తెలియని వెలితి
ఇంకా ఏదో చదవాల్సి ఉందనే అనుభూతి
మలి అధ్యాయంలో
రాతల గుభాళింపులు
ముద్దాడుతున్న అక్షరాలు
మలుపులు తిరిగిన రాతల్లో
వేదనలు పంచన చేరినా
ముళ్ళబాటలు పలకరించినా
కోల్పోయినది సాధించిన గర్వం
పుస్తకం ఇంకా మిగిలే ఉంది
అదే పట్టుదలతో చదువుతూనే ఉన్నా
ప్రతిపేజీలో లీనమయ్యా
ప్రతి అక్షరంతో ప్రభావితమయ్యా
అలా పేజీలు తిరగవేస్తూనే ఉన్నా
అర్ధభాగం దాటిన పేజీలు
ఇప్పుడు నన్నే శాసిస్తున్నాయి
అవును
ఇప్పుడు జీవితమనే పుస్తకం
నన్నే చదువుతోంది
మనస్వినీ
No comments:
Post a Comment