ఆ బాల్యం
నాకెక్కడిది..?
యే దౌలత్ భీ లేలో
షోహరత్ భీ లేలో
భలే ఛీన్ లో ముజ్ సే మేరీ జవానీ
మగర్ ముజ్ కో లౌటాదే
బచ్ పన్ కా సావన్
వో కాగజ్ కి కష్తీ
వో బారిష్ కా పానీ
జగ్ జిత్ సింగ్ గళం నుండి
జాలువారుతున్న
గజల్ వీనులకు విందు చేస్తుంటే
ఎంత కాదనుకున్నా
నా మనసు బాల్యం వైపు పరుగులు తీస్తుంది
బాల్యం తలపుల్లోకి వస్తే
ఒక్కసారి బాల్యం తలుపులు తెరిస్తే
ఎవరి మనసైనా
పులకించక మానదు
నాటి ఆటలు పాటలు
పసందైన గిల్లికజ్జాలు
వాననీటిలో కాగితం పడవల సయ్యాటలు
ఎంత అందమైన దృశ్యం
మరపురాని బాల్యం
మరి నా మనసుకు ఏమయ్యింది
బాల్యం మదిలోకి రాగానే
కళ్ళు ఎందుకు చెమర్చుతున్నాయి
మనసు ఎందుకు బాధగా మూలుగుతోంది
నాకూ అందరిలాగానే బాల్యం ఉంది
ఆటలూ ఉన్నాయి
పాటలూ ఉన్నాయి
కాగితం పడవలూ ఉన్నాయి
ఈ మధురిమలకు మించిన వేదనలూ ఉన్నాయి
కన్నీటి రోదనలూ ఉన్నాయి
అవును
అందరిలా గడిచిపోలేదు నా బాల్యం
తప్పటడుగులనుంచే
ముళ్ళబాటలు ఎదురయ్యాయి
నాకు బాగా గురుతు
నా చిన్ననాటి సంగతులు
కేరింతల చిన్నతనంలోనే
నాన్న పోయారు
అన్నమీదే భారమంతా
ఆరోజులు ఇంకా కళ్ళముందు తాజాగానే
ఉన్నాయి
నాలుగు కిలోమీటర్ల దూరంలో మా పాఠశాల
నడుచుకుంటూనే వెళ్ళాలి
కాలి నడక తప్ప మరో మార్గం లేదు
కాళ్ళకు ప్లాస్టిక్ చెప్పులు
నడుస్తూ ఉంటే ప్లాస్టిక్ చెప్పులకు
మెత్తని నా పాదాలు కందిపోయి
పుళ్ళుగా మారిపోయాయి
రుధిరం స్రవిస్తున్నా నడక తప్పదు
స్కూల్ కి వెళ్లక తప్పదు
ప్రభుత్వప్రాయోజిత మధ్యాహ్న భోజనమే
ఇరవై నాలుగు గంటలకు సరిపడే ఆహారం
నాన్న లేరనే మిత్రుల సానుభూతి
గుండెకు ముల్లులా తగిలేది
అలా పది తరగతులు పూర్తి చేసుకున్నా
ఇక భారం కావద్దు ఎవరికీ అనుకున్నా
పగలంతా చదువులు
చీకటిపడితే బిస్కెట్ ఫ్యాక్టరీలో
కొలువు
వచ్చిన ఆదాయంలో
కొంత చదువుకి
మరికొంత ఇంటికి
ఇలా చదువుతూనే అనేక పనులు
బిస్కెట్ ఫ్యాక్టరీ
కెమికల్ ఫ్యాక్టరీ
ఎలక్ట్రిక్ మోటార్ రిపేరింగ్
ఆటో డ్రైవర్ అవతారం
ఇలా అన్నింటిలో చెయ్యి పెట్టా
నా బాల్యాన్ని పూర్తిగా కోల్పోయా
అవును
అందుకే బాల్యం గురుతుకు వస్తే
కళ్ళు జలజలా స్రవిస్తాయి
మనస్వినీ
No comments:
Post a Comment