సాంత్వన పుష్పం
ఎక్కడో జారిపోయింది
లేదు లేదు జారవిడుచుకున్నా నేనే
ఎవరూ చోరీ చేయలేదు
దోపిడీకి గురికాలేదు
ఎక్కడో జారవిడుచుకున్నా
అది దొరకదని తెలుసు
ఇక తిరిగి రాదనీ తెలుసు
అందుకే శోధించను దాన్ని
వెతికే ప్రయత్నం చెయ్యను దాన్ని
ఎక్కడ పడేసుకున్నానో తెలియదు
ఎక్కడ ఉందది
ఎక్కడ ఉండిపోయింది
తీతువు పిట్ట ఆక్రందనలో
దాగిఉందా
మర్రి ఊడల ఊయలలో ఉందా
చల్లని సమాధిపై మొలచిన మొక్కకు
పూసిందా
ఎవరో తొక్కుతున్న కీచురాయి
మూలుగులో ఉందా
ఎర్రగా మండుతున్న చితిమంటలలో
కాలుతోందా
ఎక్కడ జారవిడుచుకున్నా
ఎక్కడ పడేసుకున్నా
ఇంక వెతకను దాన్ని
నేను కోల్పోయిన సాంత్వన పుష్పం
నన్నే వెతుక్కుంటూ
నన్ను తనలో ఐక్యం చేసుకుంటుందని
తెలుసు
మనస్వినీ
No comments:
Post a Comment