మురిపించిన మనసు
అప్పుడప్పుడూ గతం నా కనులముందు
కనిపిస్తూ ఉంటుంది...
ఒక్కో మెట్టూ అధిగమిస్తూ నేను
విజయశిఖరాలకు చేరుకున్నా
ఏ లోటూ లేకుండా
కోరినవన్నీ అందివచ్చినా
సాధించిన విజయాలకన్నా
నేను కోల్పోయిందే ఎక్కువ...
ఇది కాదు నాజీవితం
ఇది కాదు నా గమనం
ఇది కాదు నా మార్గమని
మనసు నిత్యం పోరుతూనే ఉండేది...
నాకూ కొన్ని భావాలున్నాయి
నాకూ కొన్ని అభిరుచులున్నాయి
నేను రోజూ ఏం చేస్తున్నా
ఎవరిని కలుస్తున్నా
నా కష్టాలు ఏమిటి
నా అనుభూతులు ఏమిటి
అన్నీ ఎవరితోనైనా పంచుకోవాలని
సాంత్వన పొందాలని
ఆరాటపడేది నా మనసు...
అమ్మలక్కల కబుర్లు
వ్యాపారాల పెట్టుబడులు
ఆస్తుల కొనుగోలు
బంధువుల ముచ్చట్లు
అన్నీ యాంత్రికమే అనిపించేవి...
పిల్లలు పువ్వుల్లా నవ్వుతున్నా
ఆ నవ్వుల పువ్వుల్లో
మనసు వికసించినా
ఏదో తెలియని వెలితి వెంటాడుతూనే ఉంది...
నేనూ నా మనసు సోదలు
ఎవరికీ పట్టలేదు
అందరూ ఉన్నా ఎవరూ లేని ఓంటరితనమే
నాకు నేస్తమై నిలిచింది...
అప్పుడు వికసించింది ఓ పుష్పం
గుండెకు తాకిన చల్లని సమీరంలా
ఎడారి బాటలో చల్లని నీటి చెలమలా
మనసారా నవ్వింది హృదయం...
జీవన సంధ్యా సమయంలో అడుగిడిన నాయికకు
పువ్వుల బాటలు పరిచింది మానసం...
వేదన తీరింది
రోదన కరిగింది
మనసారా మాట్లాడుకున్నా
కనులనిండా ఊసులు చెప్పుకున్నా
మనసుకు సాంత్వన ఇచ్చిన మనసు
అన్నీ తానై మారింది
మనసు ఎన్నడూ చూడని ఒదార్పునిచ్చింది...
పరువాల సొగసులే కాదు
నా అభిరుచులకూ పట్టం కట్టింది
నేను మెచ్చిన సాహిత్యం
నాకు నచ్చిన సంగీతం
నాకు తెలిసిన రాజకీయం
నా ఆలోచన
నా అంతరంగం
అన్నీ తానై నాతో ముచ్చటించింది...
తడబడిన అడుగులకు సవరణలు జోడించి
మార్గదర్శిగా నిలిచింది...
మలిసంధ్యలో పలు వేదనలు పలకరించినా
ఆ మనసు మాత్రం నన్ను మురిపిస్తూనే ఉంది
జీవనగమనంలో సవాళ్ళకు కుంగిన మనసు
ఆదరించిన మనసుకు మాత్రం నిత్యం సలాం చేస్తోంది...
మరి చివరిక్షణం దాకా నా మనసు
ఆ మనసుకు దాసోహం కాదా
అన్నీ మరిపించి మురిపించిన మనసు నీవే కదా
మనస్వినీ...
No comments:
Post a Comment