Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 20 March 2022

ఎర్రచుక్కల నీడలో

 

ఎర్రచుక్కల నీడలో


అదిగో ఆ కీకారణ్యంలో

ఏదో పొలికేక వినిపిస్తోంది చూడు

రాజ్యం  ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది ఎందుకో...

తమ ఇజమే శాసనమని పిచ్చిరంగుల జెండాలు పట్టిన ఆ చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి ఎందుకో...

అదిగో చూడు

జనారణ్యంలో పుస్తకం పట్టిన ఆ యువహృదయం

చరిత్రను తిరగదోడుతోంది

పక్కదారి పట్టిన నేటి చరిత్ర అక్షరాలు జారిపడుతున్నాయి ఎందుకో...

అదిగదిగో చూడు పల్లెసీమల్లో

పడుచుపాటలు ఇంకా తూటాలు పేలుస్తూనే ఉన్నాయి

కరుడుగట్టిన ఆ గుండెల్లో ప్రకంపనలు ఎందుకో...

ప్రపంచమా తెలుసుకో

నువ్వెన్ని ఇజాలు రుచి చూసినా

ఎన్ని జెండాలు మోసినా

కమ్యూనిజం చచ్చిపోదు

ఎర్రజెండా అంతరించదు

పుడమిని చీల్చుకుని ఊపిరిపీల్చే మొలకలా

అరుణపతాకం

మళ్ళీ మళ్ళీ ఎగురుతూనే ఉంటుంది

ఎర్ర చుక్కల నీడలో...

Wednesday 9 March 2022

శిఖరంలా నిలిచియున్నా

 

శిఖరంలా నిలిచియున్నా


నరనరానా నయవంచన నింపుకున్న స్నేహం చేసిన మోసాలను చూస్తున్నా...

తట్టు తగిలి కింద పడితే పళ్ళికిలించి నవ్విన లోకాన్ని చూస్తున్నా...

చెదలు పట్టిన మనసులో పుట్టిన వికృత భావాలకు

కుప్పకూలుతున్న

సంస్కారాన్ని చూస్తున్నా...

గెలిచామని భ్రమిస్తూ పాతాళానికి పడిపోయిన

వాడినీ వీడినీ

నిన్నూ చూస్తున్నా

నేను మాత్రం శిఖరంలా నిలిచియున్నా...

Friday 4 March 2022

కథలన్నీ చెరిపేస్తా

కథలన్నీ చెరిపేస్తా


మనసు సంద్రంలో ఎన్ని సునామీలైనా చెలరేగనీ

ఎగిసిపడే అలలపై నడకలు నేర్చుకుంటా...

నా కన్నులు ఎన్ని కథలైనా చెప్పనీ

చిరునవ్వుల మెరుపులతో

ఆ కథలన్నీ చెరిపేస్తా...


Thursday 3 March 2022

మెల్లమెల్లగా కరిగిపో...

 

మెల్లమెల్లగా కరిగిపో...


అసహనమై నువ్వు అటూ ఇటూ కదులుతున్నావేమో

హృదయసీమలో ప్రకంపనలు నమోదవుతున్నాయి..

నా హృదయం నీకు బందీఖానా కాదు

అది నీ అందమైన ఆషియానా...

గుండె గోడలను చీల్చకు

హృదయ మైదానం ధ్వంసం చేయకు..

కాస్త పదిలం ప్రియతమా

నా హృదయం సున్నితం

సడీ చప్పుడు చేయకుండా

మెల్లమెల్లగా కరిగిపో...

నువ్వు చేసే అలజడికి

ప్రకంపనల తీవ్రత కాసింత పెరిగినా నేనే లేకుండా పోతాను...