Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 31 January 2020

శిలనయ్యానా...



శిలనయ్యానా... 


సాగిపోయాను గానీ
వెనుక ఎవరూ లేరు
నా ముందూ ఎవరూ లేరు...
వెనక్కి తిరిగి చూసాను గానీ
వెలుతురు కనిపించలేదు
చీకటి ఛాయలూ కానరాలేదు...
సమరం చేస్తున్నా గానీ
శత్రువులు ఎవరూ లేరు
మిత్రులూ పలకరించలేదు...
విజయాలే సాధించాను గానీ
జయజయ ధ్వానాలు లేవు
పరాజయాల ఆనవాళ్ళూ లేవు...
బాటసారినే గానీ
గమ్యం లేనేలేదు
అడుగుజాడలూ కానరాలేదు...
శిఖరంలా నిలిచాను గానీ
పునాదిరాళ్లు లేవు
శిథిలాల గుర్తులూ లేవు...
నేను మనిషినా శిలాప్రతిమనా
తెలుసుకునేందుకు ఆధారాలూ లేవు...


Wednesday 29 January 2020

నిండు చందమామ



నిండు చందమామ
కరకమలాల పరదాల మాటున దాచి
నిండు జాబిల్లిని
నెలవంకలా చూపుతావెందుకు...
వెండి వెన్నెల సొగసులను
పసిడి సొబగులతో
దాచేస్తావెందుకు..
నిండు పున్నమి వెన్నెలలో ఆడుకోవటమే నాకిష్టమని
నీకు మాత్రం తెలియనిదా
మనస్వినీ...

ప్రతి క్షణం నాదే...


ప్రతి క్షణం నాదే...
తరలిపోతున్న క్షణాన్ని ఆపలేను పలకరించే క్షణాన్ని బంధించ లేను

నాతో ఉన్న క్షణాన్ని ఆస్వాదించకుండా
ఉండనూ లేను
ఎందుకంటే నేను
కాలంతో పోటీ పడను
కాలమే నాతో పరుగులు తీస్తుంది...


Monday 20 January 2020

తప్పనిపోరాటం


తప్పనిపోరాటం

మరణిస్తున్నా ప్రతిరాత్రీ
కన్నులు మూసిన ప్రతిసారీ...
స్వప్నిస్తున్నా ప్రతిరేయి
ఉషస్సున మరలా జన్మించాలని...
మరణిస్తూ జన్మిస్తూనే ఉన్నా
మనసు మాత్రం హెచ్చరిస్తూనే ఉంది
ఏదో ఒకరేయి చీకటి తలుపులు తెరుచుకోవని...
అయినా
మరణిస్తూనే జన్మిస్తున్నా
ఈ పోరాటం తప్పదని...


Tuesday 14 January 2020

ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ...

ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ...

యాభైలోకి అడుగులు పడ్డాయి

సంధ్య పలకరింపులు అప్పుడే స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తోంది..
ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నేను పయనించిన బాటలో పువ్వులు అక్కడక్కడా ఉన్నా ఎక్కువగా ముళ్లే వీడ్కోలు చెబుతున్నాయి..దారిద్య్రం తో నిండిన బాల్యం ఇంకా ఒక పీడకల లా వెంటాడుతూనే ఉంది...అవమానాలను అధిగమిస్తూ కన్నీళ్లను దాచుకుంటూ ఒద్దికగా నడిచి ఒక శిఖరంగా నిలిచినా అంతే పద్ధతిగా ఒక్కో మెట్టు జారుతూ కిందకు పడిపోయా మళ్లీ లేవనంతగా..వేదనలు నిత్యం గాయం చేస్తున్నా మధురిమలనే తలుచుకుంటూ ఒక్కో ఏడాదిని మైలురాయిలా దాటేస్తూ సాగిపోయా.. అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఆలోచిస్తూ ఒకే మార్గంలో నడుస్తూ మరమనుషుల లోకంలో ఒక పనికిరాని మాంసపు ముద్దలా మిగిలిపోయా.. ఇక చాలనిపిస్తోంది యాభయ్యవ వసంతం..
చివరి క్షణాలను కూడా చిరునవ్వుతో ఆహ్వానించాలన్నదే నా చివరికొరిక...

Sunday 5 January 2020

2020



2020
 

సిక్సర్లే కొడతానా

ఫోర్లకే పరిమితమవుతానా

బౌన్సర్లు వేస్తానా

గుగ్లీ చేస్తానా

వికెట్ తీస్తానా

క్యాచ్ పడతానా

మిస్ ఫీల్డ్ అవుతానా

రన్ ఔట్ అవుతానా

మ్యాచ్ గెలుస్తానా

క్లీన్ బౌల్డ్ అవుతానా

ఏమో తెలియదు గానీ


2020ఆడటం మాత్రం పక్కా..