Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 12 March 2020

నాలో నేను కొత్తగా...


నాలో నేను కొత్తగా...
నా అక్షరాలలో మాధుర్యాన్ని వెతకొద్దు
ఇప్పుడవి నిప్పురవ్వలై మండుతున్నాయి...
తేనెలొలికే పదాలకై ఆశించొద్దు
పెదాలు తూటాలుగా పేలుతున్నాయి...
కన్నుల వెన్నెలకై ఎదురుచూడొద్దు
భగభగ మంటల సెగలు తాకుతున్నాయి...
మంచితనాన్ని నాలో శోధించొద్దు
రాక్షస గుణాలు కనిపిస్తున్నాయి...
ఎందుకంటే
నన్ను నేను తిరస్కరిస్తూ
నాలో నన్ను కొత్తగా
ఆహ్వానిస్తున్నాను...


ఏదీ ఆ ధైర్యం?


ఏదీ ఆ ధైర్యం?

జీవితంలో ఎన్నో చూసాను
భయానక పరిస్థితులను ఎదుర్కొన్నాను
మతకలహాలు చూసాను
సజీవ దహమైన వారి ఆర్తనాదాలు విన్నాను
పోలీసు కాల్పుల్లో నేలకొరిగిన వారి ముఖాల్లో చావు కళ గమనించాను
జంటపేలుళ్ళ మారణహోమానికి సాక్షిగా నిలిచాను
వృత్తి రిత్యా సంచలనాలు చేశాను
ముష్కరులు నాపైనే
దాడులకు దిగినా
కాల్పులు జరిపినా
శిఖరమై నిలిచాను
ఎప్పుడూ అధైర్య పడలేదు
కుంగిపోలేదు
పంథా మార్చుకోలేదు
ఇప్పుడేమయ్యింది నాకు
చిగురుటాకు సవ్వడికే
కలవరపడుతున్నా
చిన్న వేదనకే కుంగిపోతున్నా
ఏమయ్యింది నాకు
నాటి మనో నిబ్బరం ఏది? 


అవశేషం


అవశేషం

వైఫల్యం
నిత్యం ఏదో ఒక రూపంలో
పలకరిస్తూ వెక్కిరిస్తున్న వేళ
పెదాలపై కానరాని చిన్న నవ్వు ఏదో కదలాడుతూ ఉంటే
అది దేనికి సంకేతం
నిర్వేదమా
నిస్తేజమా
అయోమయమా
అర్థం తెలియని
పలాయనవాదమా
ఏమో అది మనసుకే
అంతుచిక్కని
అవశేషమేమో...