Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 29 January 2021

ఢిల్లీ పెద్దల కోరిక నెరవేరింది...

 

ఢిల్లీ పెద్దల కోరిక నెరవేరింది...



అవును ఇది నిజమే.. ఈరోజు గణతంత్ర దినం సాక్షిగా దేశరాజధానిలో జరిగిన పరిణామాలు ఢిల్లీ పెద్దలకు సంతోషం కలిగించేవే.. చాలామంది నమ్మకున్నా ఇది నిజమే.. రైతుల ఆందోళనలో అసాంఘిక శక్తులున్నాయని తాము చెబుతూ వచ్చింది నిజమే అని వాదించేందుకు ప్రభుత్వ పెద్దలకు ఒక మంచి అవకాశం చిక్కింది. ఆందోళన ఏ రూపంలో ఉండబోతోందో అందరికీ తెలుసు. ఇంటలిజెన్స్ నివేదికలు కూడా ఇదే చెప్పాయి. అటు పోలీసులు ఇటు బిజెపి పెద్దలు పదే పదే ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. మరి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు. ఢిల్లీ సరిహద్దుల్లో నామమాత్రపు సెక్యూరిటీ పెట్టి ఎర్రకోటను ఎందుకు గాలికి వదిలేశారు. ప్రభుత్వం తలుచుకుంటే రైతులు ఢిల్లీలోకి ప్రవేశించేవారా.. ట్రాక్టర్లను యుద్ధట్యాంకులుగా మార్చుకుంటున్నారని ఫోటోలతో సహా వార్తలు వచ్చిన విషయం ప్రభుత్వానికి తెలియనిదా.. అర్బన్ నక్సల్స్, ఖలీస్తానీ ఉగ్రవాదులు, పాకిస్తానీ టెర్రరిస్తులు రైతుల్లో చేరిపోయారని ఏడ్చిన ప్రభుత్వం నివారణ చర్యలు ఎందుకు తీసుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం కోరుకున్నది ఈ తరహా పరిణామలే. ప్రభుత్వ అనుకూల శక్తులే ఈ విధ్వంసకాండకు దిగాయని నేను చెప్పటం లేదు. అలాగని నక్సల్స్ ప్రత్యక్షంగా దిగారని అనడమూ మూర్కత్వమే. ప్రజాగ్రహం హద్దులు దాటితే దాని ముఖచిత్రం తీవ్రవాదమే అనేది చరిత్ర నేర్పిన పాఠం. జరగాల్సింది జరిగింది. ప్రపంచం ముందు దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిణామం ఇది. అయితే ఇది మోదీ సర్కారకు బాగా కలిసివచ్చిన అంశం. అందుకే జరిగేది తెలిసినా మౌనంగా ఉండిపోయింది. రాజకీయ లబ్ధికే ప్రయత్నించింది గానీ నివారణ చర్యలు తీసుకోలేదు. ఫలితంగా రైతులు ఆత్మరక్షణలో పడితే కేంద్రం ఫైచేయి సాధించింది. ఒకవేళ రైతులను అడ్డుకుంటే ప్రతిపక్షాలు బలపడతాయని ప్రభుత్వం భయపడింది. ప్రభుత్వ రాజకీయ స్వార్ధం కారణంగానే దేశం పరువు గంగలో కలిసింది.. అసలు ఇంతదాకా ఎందుకు తెచ్చుకున్నారు. రైతులంటే మరీ ఇంత అలుసా.. రైతులైనా నక్సల్స్ అయినా ఖలీస్తానీలైనా అది ఎవరైనా ప్రజలే. ప్రజల కడుపు మండితే ఢిల్లీ అయినా గల్లీయే అని రుజువయ్యింది. ప్రభుత్వమే ఈ విపరిణామాలకు బాధ్యత వహించక తప్పదు.ఇక మోదీ మీడియాకు రైతులను టెర్రరిస్టులు అంటూ విరుచుకుపడేందుకు మంచి అవకాశం దొరికింది.

Tuesday 26 January 2021

కొత్తపొద్దు

 

కొత్తపొద్దు



నేను నడుస్తున్నాను

నడుస్తూనే ఉంటాను

అవును

నా నడక కొంచెం భిన్నమే

అందరు నడిచేదారిలో నడవను

కొత్త బాటలు వెతుకుతూ ఉంటాను

పూలున్నా ముళ్ళున్నా

నాకు నచ్చిన దిశగా

నడుస్తూనే ఉంటాను

సమూహంలో నేను నడవను

నేనే ఒక సమూహమై నడుస్తాను

నీలో తెగువ ఉందా

నాతో నడిచిరా

కొత్తపొద్దు వీధిలో

వేగుచుక్కలమై

మెరిసిపోదాం

Sunday 24 January 2021

హల్లాబోల్ ఢిల్లీ

 

హల్లాబోల్ ఢిల్లీ



అవి ట్రాక్టర్ లా యుద్ధ ట్యాంకులా!!!

అవును రైతులు యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీని గడగడలాడిస్తున్న అన్నదాతలు ఈసారి ఇరవై ఆరవ తేదీన ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపై యాభైకిలోమీటర్ల పొడుగునా నిర్వహించనున్న ట్రాక్టర్ ర్యాలీకి భారీ యుద్ధసన్నాహాలు చేస్తున్నట్టే ఉంది. వందలాది ట్రాకర్లను యుద్ధ ట్యాంకర్లుగా మార్చేశారు. ట్యాంకర్లు ఎలాంటి బారికేడ్లనైనా తుత్తునియలు చేయగలవు. పోలీసుల లాఠీ చార్జిని ఎదుర్కొనేందుకు వీలుగా బలమైన ఇనుప జాలీల రక్షణ వ్యవస్థ వీటి ప్రత్యేకత. వేలాదిగా తరలివస్తున్న ట్రాక్టర్లలో దాదాపు ఐదువందల వాహనాలను విధంగా తీర్చిదిద్దారు. ర్యాలీలో ట్రాక్టర్లే ముందువరుసలో ఉండబోతున్నాయి. అంటే ర్యాలీ ఔటర్ రోడ్డుకే పరిమితం అవుతుందా? అన్నదాతల ఆక్రోశం ఆగ్రహంగా మారితే ఢిల్లీ పరిస్థితి ఏంటి?

చట్టాలు మంచివా కాదా అని నేను మాట్లాడటం లేదు. ఆందోళన చేస్తున్నవారివెనుక ఎవరున్నారనే చెత్తవాదన చేయను.  అన్నదాతలు చిన్నపిల్లలు కాదు ఎవరో ఆడిస్తే ఆడటానికి. పంజాబీ పులులు ప్రారంభించిన ఉద్యమం అదుపు తప్పితే అది రైతుల తప్పు కాదు. పాలకులే దీనికి బాధ్యత వహించాలి.దేశంలో ఇంత జరుగుతున్నా మోడీమీడియా కు పట్టకపోవటం మరో దారుణం..

Friday 22 January 2021

సందెపొద్దు

 

సందెపొద్దు



నవోదయం కోసం కాదు

నా ఆరాటం

అది ఉందో లేదో తెలియని దైన్యం

కొత్తపొద్దు కానేకాదు

నా లక్ష్యం

ఆ పొద్దుతో నాకు పొత్తు లేదని నా నమ్మకం

అందుకే సాయం సంధ్యను

ప్రేమిస్తున్నా

అస్తమయానికి నచ్చిన రంగులు అద్దుకోవాలని

ఆరాటపడుతున్నా

అవును నేను

అందమైన సందెపొద్దు

సూరీడుని...

Monday 18 January 2021

ఏమయ్యేవాడినో..

 

ఏమయ్యేవాడినో..



అప్పుడప్పుడూ అనిపిస్తుంది...మహమ్మద్ రఫీ.. ముకేశ్.. కిషోర్ కుమార్.. గులాం అలీ.. ఏసుదాస్... పంకజ్ ఉధాస్.. లత.. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం... సుశీల వీరంతా పుట్టకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో... వీరంతా నా మనసును ఓదార్చే నేస్తాలే...

పవిత్రగ్రంధం

 

పవిత్రగ్రంధం



నవ్వించేందుకు నేను జోకర్ని కాదు

ఏడిపించేందుకు నేను శాడిస్టును కాదు

రాళ్లు వేసేందుకు నేను పిచ్చివాడిని కాదు

మెప్పించేందుకు నాదగ్గర లౌక్యమూ లేదు

నాకంటూ ఉన్నవి నా అక్షరాలు మాత్రమే

నా భావాల సిరాలో అక్షరాలను ముంచి

మనసు పుస్తకంలో దాచుకుంటూ ఉంటా

ఎవరికి అర్ధమైనా కాకున్నా

ఎందుకంటే

నా మనసు పుస్తకమే నాకు పవిత్రగ్రంధం..