Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday, 10 August 2020

జైల్లో బంతులాట(PART-23)


జైల్లో బంతులాట(PART-23)
అది హైదరాబాద్ పై ఉగ్రవాద నీలినీడలు కమ్ముకున్న సమయం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టెర్రరిస్టు దాడులు జరిగినా దాని మూలాలు నగరంలో బయటపడుతున్న తరుణం.. పోలీసులకు కంటిమీద కునుకు లేదు. పాతబస్తీతో సహా సిటీలో పలు చోట్ల తరచుగా తనిఖీలు జరుగుతున్నాయి.. అనేకమంది స్లీపర్ సెల్స్ పోలీసులకు చిక్కారు.. చాలామంది ఉగ్రవాద ముఠాల సానుభూతి పరులు చంచల్ గూడా జైలులో ఉన్నారు.. ఇది అప్పట్లో హైదరాబాద్ లో మామూలే కదా దీంట్లో విశేషమేముంది అనుకోకండి, అసలు స్టోరీ ఇక్కడే ఉంది కొంచెం వెయిట్ చేయండి.. అప్పుడు జీ తెలుగు న్యూస్ ప్రత్యేకంగా జీ 24 గంటలు ఛానల్ గా అవతరించిన తొలినాళ్ళు అవి..చంచల్ గూడా జైలులో సేద తీరుతున్న నేరస్థులు లోపల నుంచే బయట కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు పసిగట్టారు. ముఖ్యంగా నగరానికి చెందిన తీవ్రవాద సానుభూతిపరులకు జైలు నుండి స్పష్టమైన ఆదేశాలు అందుతున్నట్లు గుర్తించారు. అయితే కట్టుదిట్టమైన జైలునుంచి బయటకు సమాచారం ఎలా అందుతున్నదనే విషయం సస్పెన్స్ గా మారింది. ములాఖాత్ దగ్గర కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసి ప్రతి కదలికను గమనించినా ఫలితం లేకుండా పోయింది. అనుమానం ఉన్న జైలు సిబ్బంది డ్యూటీలు కూడా మార్చేశారు. అయినా జైలులోని నేరగాళ్లు తమ మిత్రులతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నట్లు కొన్ని క్రైమ్ సంఘటనలు బయటపెట్టాయి. అసలు ఇక్కడ లోగుట్టు ఏమిటి నిందితులకు ఎవరు సహకారం అందిస్తున్నారనే విషయంపై స్పెషల్ ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఈ విషయమై జైలు అధికారుల ఇంటర్యూ తీసుకున్నాను. అసలు జైలు లోనుంచి చిన్న సమాచారం కూడా బయటికి వెళ్ళటం లేదని అధికారులు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసారు. ములాఖత్ దృశ్యాలను షూట్ చేసుకున్నాం. జైలు లోపలి పరిసరాలు కవర్ చేసాం.. ఎక్కడా అనుమానిత విషయాలు బయటపడలేదు.. ఎలాగబ్బా జైలు సేఫ్ అని పాజిటివ్ స్టోరీ చేయకతప్పదా అని నిరాశపడ్డాను. షూట్ అయ్యాక బయటికి వచ్చేసాం.. జైలు పక్కనే ఉన్న ఒక ఇరానీ హోటల్ దగ్గర కార్ ఆపి చాయ్ ఆర్డర్ ఇచ్చి సిగరెట్ వెలిగించుకున్నా.. అంతలోనే అటుగా ఖాలెద్ కారులో వెళుతూ నన్ను చూసి ఆగాడు.. ఖాలెద్ అంటే MBT అధినేత చాంద్రాయణ గుట్ట శాసన సభ్యుడు అమానుల్లాఖాన్ కొడుకు. నాకు మంచి మిత్రుడుకూడా...క్యా గౌస్ భాయ్ క్యా బాత్ హై అంటూ పలకరించాడు.. తనతో మాట్లాడుతూ జైలు సైడ్ వాల్ సమీపంలో నడుస్తున్నాను.. అప్పుడు నా కాలికి ఒక మెత్తటి వస్తువు తగిలింది..
కొద్ది సేపు అలా మాట్లాడి తిరిగి వచ్చి ఆఫీసుకు వెళ్లిపోయాం.. నేను మాత్రం ఆ వస్తువు గురించే ఆలోచిస్తున్నా.. రెండవ రోజు ఉదయమే మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్లి కార్లోనే కూర్చున్నాం.. ఏమి ఫలితం లేదు.. అక్కడే ఉన్న ఒక ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఒక పని పురమాయించి వెళ్ళిపోయాను. అతను నాకు పక్కా ఫంకా టైప్ అనమాట. అతను చెప్పిన పని కంప్లీట్ చేసాడు.లక్కీగా మూడవరోజే ఆపరేషన్ కంప్లీట్ అయ్యింది...తరువాతి రోజు మళ్ళీ జైల్ దగ్గరికొచ్చి పరిసరాలు, సమీప కాలనీలు షూట్ చేసి ఒక P2C చేసుకుని వెళ్లిపోయా..
అదే రోజు సాయంత్రం మా స్టోరీ ప్లే అయ్యింది.. అది ఒక సంచలనమే అని చెప్పొచ్చు. స్టోరీ సారాంశం ఏంటంటే జైల్లో బంతులాట.. అవును లోపలున్న ఖైదీలు రబ్బరు బంతుల్లో చీటీలు పెట్టి బయటకు విసురుతున్నారు.. ఆ బంతులు ఒక నిర్ణీత సమయంలోనే బయటకు విసురుతారు. ఆ సమయంలో అక్కడ ఆ బాల్ తీసుకోడానికి రెడీగా ఉంటారు వాళ్ళ అనుచరులు. ఇదే విధంగా లోపలికి కూడా బంతులు విసురుతారు. రబ్బరు బంతులకు కొంచెం రంద్రం చేసి అందులో చీటీ పెడతారన్నమాట. మా మిత్రుడు ఒక రోజంతా కూర్చుని ఇలా విసురుతున్న బంతుల దృశ్యాలు షూట్ చేయగలిగాడు.. ఈ స్టోరీ అద్భుతంగా క్లిక్ అయ్యింది.. జీ హిందీ న్యూస్ లో కూడా కంటిన్యూ గా నడిచింది.. ఆ రోజు జైలు దగ్గర నా కాలికి తగిలింది కూడా ఇలా రంద్రం చేసిన రబ్బరు బంతే.. ఈ స్టోరీతో జైళ్ల శాఖ ఉలిక్కిపడింది.. వెంటనే నివారణ చర్యలు చేపట్టింది.. అలాంటిదేమి లేదు పిల్లలు బాల్స్ విసిరారని అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఈ స్టోరీలో కొసమెరుపు..

2 comments:

  1. గౌస్ గారూ, త్రిష బాత్ రూమ్ వీడియో జీ టీవీలో వచ్చింది కదా. అది మీరు చేసిందేనా, అది ఎలా జరిగింది అనే విషయాలు వీలైతే తెలుపగలరు.

    ReplyDelete
    Replies
    1. సారీ అండీ నాకు దాంతో ఎలాంటి సంబంధం లేదు..

      Delete