Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 16 August 2020

ICL గుర్తుందా..(PART-28)


ICL గుర్తుందా..(PART-28)
ఇప్పుడందరికీ IPL మాత్రమే గుర్తుండి ఉంటుంది.. అయితే ఐపీఎల్ కి అమ్మలాంటి ఐసీఎల్ ను అందరూ మరిచిపోయే ఉంటారు.. 20-20 క్రికెట్ లో ఒక సంచలనం ఐసీఎల్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర మానసిక పుత్రికయే ఐసిఎల్.. నా జర్నలిజం కెరీర్ లో ఐసిఎల్ తో కూడా చెప్పుకోదగ్గ సంబంధం ఉంది.. ఒకరకంగా క్రికెట్ అభిమానినైన నేను ఐసిఎల్ ను బాగా ఎంజాయ్ చేశాననే చెప్పాలి. హైదరాబాద్ లో ఐసిఎల్ మ్యాచ్ ల తెరవెనుక నేనూ ఉన్నందుకు గర్వంగానే ఫీలవుతా.
జీ గ్రూపు ఐసీఎల్ ను 2007 లో అట్టహాసంగా ప్రారంభించింది.. క్రికెట్ ప్రపంచంలో ఇది ఒక సంచలనం.. అసలు ఐసీఎల్ ఏంటి, మ్యాచ్ లు ఎలా నిర్వహిస్తారు, ఈ ప్రయోగం విజయవంతం అవుతుతుందా అనే అనుమానాలను బేఖాతరు చేస్తూ కపిల్ దేవ్ నేతృత్వంలో ఐసీఎల్ ను స్టార్ట్ చేసింది జీ గ్రూప్..
హైదరాబాద్ లోనూ ఐసీఎల్ మ్యాచ్ లకు రంగం సిద్ధమయ్యింది. షెడ్యూల్ కూడా ఖరారయ్యింది.. హైదరాబాద్ లో తొలి మ్యాచ్ ఎల్బీ స్టేడియంలో జరగాల్సి ఉంది. మ్యాచ్ కు ఇంకా మూడు రోజులే టైం.. ఇంకా పోలీస్ పర్మిషన్ రాలేదు.. సమీపంలో అసెంబ్లీ ఉన్నందువల్ల పర్మిషన్ కు నిరాకరించారు. ఎందుకంటే పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది.. మా ఆఫీసు పెద్దలు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే తమకేం సమస్య లేదనీ, అది సిటీ పోలీస్ కమిషనర్ పరిధిలోని అంశమని చేతులు దులుపుకుంది.. బంతి నా కోర్టులోకి వచ్చిపడింది.. మా బాస్ గౌస్ చూడు ఆ విషయమేందో అని నాకు అప్పజెప్పేశారు. అంటే క్రైమ్ బ్యూరో చీఫ్ స్థాయిలో ఆఫీసుకు పోలీసులతో ఏ పని ఉన్నా అది మనమే చేసి పెట్టాలన్నమాట..
అప్పుడు నేను పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు. ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వాలనుకుంటే నేరుగా కమిషనర్ కు చెప్పేసి ఇవ్వొచ్చు. అలా చేయకుండా పోలీసుల మీదకు నెట్టేసింది. అంటే పోలీసుల నివేదిక మీదే మ్యాచ్ ఆధారపడి ఉందన్న మాట.. నాకైతే చెమటలు పట్టాయి ఇది సాధ్యమేనా అని.. ముందుగా స్థానిక ఎసిపి క్లియరెన్స్ ఇవ్వాలి, తర్వాత అది డిసిపి ఒకే చేయాలి, ఆ తర్వాత ఆ ఫైలు అడిషనల్ సీపీ చూడాలి, చివరగా దాన్ని సిటీ కమిషనర్ ఒకే చేస్తే పర్మిషన్ వస్తుంది. అప్పుడే స్టేడియంలో మాకు ప్రవేశం.. టైం చాలా తక్కువ ఉంది.. ఏం చేయాలో అర్ధం కాక చెమటలు పట్టాయి.. ఓ ఐపీఎస్ అధికారి మంచి స్నేహశీలి ఆయనతో నా టెన్షన్ పంచుకున్నా.. ఆయన అన్నారు టెన్షన్ పడకు ట్రై చేద్దామని.. ఆయన సహాయంతో ఫైలు చకచకా కదిలింది.. హైదరాబాద్ లో తొలి ఐసీఎల్ మ్యాచ్ కు గ్రీన్ సిగ్నల్ దొరికింది. వాస్తవానికి సిస్టమ్ ప్రకారం ఈజీగానే పర్మిషన్ దొరకాలి కానీ BCCI పెద్దలు పుల్లలు వేయడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. మొత్తానికి మ్యాచ్ జరిగింది.. నేనైతే ఐసీఎల్ ను బాగా ఎంజాయ్ చేసా. జీ న్యూస్ యాక్సెస్ కార్డుతో స్టేడియంలో సందడి చేసా.. అప్పుడే నేను తొలిసారి కపిల్ దేవ్ వంటి ప్రముఖులను ప్రత్యక్షంగా చూడటం.. ఎప్పుడు మ్యాచ్ జరిగినా మనమే అది నిర్వహిస్తున్నట్లు ఫీలింగ్ అనమాట.. దీనికి తోడు నా దగ్గర వందల విఐపి పాసులు ఉండేవి.
అడిగిన వారికి కాదనకుండా ఇచ్చేసేవాడిని. ముఖ్యంగా ఈ పాసుల కారణంగా సిటీ పోలీసుల్లో నాకు బాగా క్రేజ్ ఏర్పడింది. పోలీసులు తమ ఫ్యామిలీ మెంబర్స్ కోసం పాసులు నా దగ్గర తీసుకునేవారు. అందరితోపాటు నేనూ మ్యాచ్ లు చూసినా తెరవెనుక నా పాత్ర వేరే ఉండేది. మ్యాచ్ స్టార్ట్ అయ్యి పూర్తయ్యేలోపల అంటే ప్రేక్షకులు స్టేడియం బయటకు వెళ్ళేదాకా టెన్షన్ ఉండేది. పోలీసులతో టచ్ లో ఉండక తప్పని పరిస్థితి.. చిన్న సమస్య తలెత్తినా పోలీసులతోనే అవసరం గనుక.. అయితే పోలీసులు అద్భుతమైన బందోబస్తుతో ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవడం విశేషం.. నేనైతే ఐసీఎల్ పీరియడ్ లో బాగా ఎంజాయ్ చేసా.. అయితే జీ చరిత్రలో ఐసీఎల్ ఒక విఫల ప్రయోగంగా మిగిపోయింది. BCCI తో విభేదాల కారణంగా ఐసీఎల్ మూసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో పుట్టుకువచ్చిన ఐపీఎల్ ఇప్పుడు BCCI కి కాసుల వర్షం కురిపిస్తోంది..


No comments:

Post a Comment