Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 13 August 2020

వివాదాల కేంద్రం పోలీసులకు దైవం స్వరణ్ జిత్ సేన్.. (PART-26)


వివాదాల కేంద్రం
పోలీసులకు దైవం
స్వరణ్ జిత్ సేన్.. (PART-26)
నా జర్నలిజం యాత్రలో ఐపీఎస్ స్వరణ్ జిత్ సేన్ తో నాకు తీపి చేదు అనుభవాలున్నాయి.. ఆయనతో వైరం నడిచింది... స్నేహమూ కొనసాగింది.. నా కెరీర్ లో ఆయనతో చెప్పుకోదగ్గ ఘట్టాలే ఉన్నాయి.. అత్యంత వివాదాస్పద డీజిపిగా పేరుపొందిన సేన్ తో మొదట్లో నేను ఇబ్బంది పడిన సంఘటనలున్నాయి.. ఆయనతో నేను చేసిన ఎక్స్ క్లూజివ్ స్టోరీలూ ఉన్నాయి.. అన్నిటికంటే ముఖ్యం ఆయన వ్యక్తిత్వం పనితీరు ప్రస్తావించదగ్గ అంశాలే.. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి స్వరణ్ జిత్ సేన్ ను ఇష్టపడి మరీ డీజిపిగా తెచ్చుకున్నారు. కేంద్ర సర్వీసులో ఉన్న ఆయన ను డీజిపిగా నియమించటం పట్ల అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆయన సతీమణిపై శిశు విక్రయాల ఆరోపణలున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కీలక బాధ్యత ఎలా అప్పగిస్తారని పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వైయస్ ఇవన్నీ పట్టించుకోలేదు.. వైయస్ ఏదైతే కోరుకున్నారో అది ఒక డీజిపిగా సేన్ చక్కగా అమలు పరిచారనే చెప్పవచ్చు... ఇవన్నీ పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాం..
డీజిపిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఒకటి రెండు రోజుల్లోనే ఆయన వర్కింగ్ స్టైల్ అందరికీ అర్ధమైపోయింది. బహుశా సియం కోరుకున్నది ఇలాంటి పోలీస్ బాస్ నేనేమో... సేన్ తన ప్రాధాన్యత నక్సలిజం నిర్మూలన అని చెప్పకనే చెప్పారు. ఆయన హయాంలో విచ్చలవిడిగా ఎన్ కౌంటర్లు జరిగాయి.. జిల్లాల్లో పోలీసులు లొంగుబాట్ల కంటే ఎన్ కౌంటర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరుకునేవారు. నక్షలైట్లను పట్టుకుని విచారణ పేరుతో సమయం వృధా చేయడం ఎందుకు అనేలా ఉండేది ఆయన ధోరణి.. రాష్ట్ర హోంమంత్రికి కూడా సమాచారం లేకుండా ఆయన హయాంలో ఎన్ కౌంటర్లు జరిగాయంటే ఎంత పవర్ ఫుల్లో అర్ధం చేసుకోవచ్చు. సేన్ సమయంలో జిల్లాల్లో సాధారణ కానిస్టేబుల్ కూడా ఎన్ కౌంటర్ చేయడానికి అవకాశాలు వెతికే వాడంటే ఆయన కింది స్థాయి సిబ్బందిని ఎలా ప్రోత్సాహించే వాడో ఈజీగానే తెలిసిపోతుంది.. భారీ ఎన్ కౌంటర్లు, పెద్ద ఎత్తున ఆయుధాల డంప్ లు స్వాధీనం చేసుకోవడం సేన్ పీరియడ్ లో మామూలే.. నక్షలైట్లుఆంధ్రప్రదేశ్ లో రాకెట్ లాంచర్లు వాడే సత్తాను సంతరించుకున్నారనే విషయం అప్పుడే అధికారికంగా ధృవపడింది.
ఇక మీడియా విషయానికి వస్తే సేన్ మీడియాను అస్సలు పట్టించుకునే వారు కాదు. ఎక్కడైనా ఎదురుపడితే అడిగే ప్రశ్నలకు వ్యంగ్యంగా సమాధానం చెప్పడం ఆయన స్టైల్.. సార్ కూంబింగ్ భారీ ఎత్తున నడుస్తోంది అని అంటే జస్ట్ కొంబింగ్ చేస్తున్నా అంటూ తల దువ్వుతున్నట్లు మీడియా ముందు సేన్ హావభావాలు ప్రకటించటం అప్పట్లో సంచలనమే..
సరే మన విషయానికి వద్దాం..రాష్ట్ర స్థాయి ప్రాధాన్యత ఉన్న వార్తలు, ముఖ్యంగా నక్సల్ సంబంధిత వార్తలకు పోలీసుల తరపు వివరణ అత్యవసరం.. వారి వెర్షన్ లేనిదే ఆ న్యూస్ అసంపూర్ణంగా ఉండేది. ఇదేకారణంగా మీడియా స్టేట్ క్రైమ్ బ్యూరో చీఫ్ లు డిజిపి తో లేదా అడిషనల్ డిజిపి లేదా పీఆర్వో తో టచ్ లో ఉండాల్సిందే.. సేన్ హయాంలో ఏ ఐపీఎస్ కూడా మీడియాతో మాట్లాడేవారు కాదు.. ఏదైనా డీజిపి కన్ఫర్మ్ చేయాల్సిందే.. ఈయనగారికేమో మీడియా అంటే చులకన భావం.. కొంతమంది సెలెక్టివ్ జర్నలిస్టులతోనే మాట్లాడేవారు. లోకల్ మీడియాను సాధ్యమైనంత దూరం పెట్టేవారు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం నిర్లక్ష్యంగానే ఉండేది. నేను ఇప్పుడు బిజీ తర్వాత మాట్లాడండి అంటూ ఫోన్ కట్ చేసేవారు. ఒకసారి అతి కష్టంగా ఫోన్ లైన్ లో దొరికితే సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అని అడిగా... ఏంటి విషయం ఎందుకు ఇంటర్వ్యూ అంటూ ఆరా తీస్తూనే రేపు షార్ప్ 12 గంటలకు రండి లేటయితే నేను బయటికి వెళ్ళిపోతా అని రఫ్ గా బదులిచ్చారు.. ఆయన చెప్పిన టైం కు పది నిమిషాల ముందే డిజిపి ఆఫీసుకు చేరుకున్నాం నేనూ మా కెమెరామ్యాన్.. లోపలికి కానిస్టేబుల్ తో కార్డు పంపిస్తే టెన్ మినిట్స్ లో పిలుస్తా అని చెప్పి పంపించారు.. పది నిముషాలు గడిచాయి.. ఇరవై నిమిషాలు.. ముప్ఫయ్ నిమిషాలు.. నలభై నిమిషాలు గడిచాయి.. కానీ పిలుపు రాలేదు.. పాపం ఆ కానిస్టేబుల్ కాస్త ధైర్యం చేసి లోపలికి వెళ్లి గుర్తు చేసాడు మేమున్నామని.. అవును తెలుసు కూర్చోమని చెప్పు అని సమాధానం.. పోనీ లోపల ఏమన్నా విజిటర్స్ ఉన్నారా అంటే అదీ లేదు.. నాకు అసహనంగా అనిపించింది.. అవమానంగానూ అనిపించింది.. వెంటనే లేచి బయటికి వచ్చేసాం.. ఆఫీసుకు చేరుకునే సమయంలో డిజిపి ఆఫీసు నుంచి కాల్ సార్ పిలుస్తున్నారని.. ఇప్పుడు నాకు టైం లేదని చెప్పేసి కాల్ కట్ చేసా.. అప్పటి నుంచి నాకు సేన్ పై విపరీతమైన కోపం.. ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేకుండానే కొన్ని వార్తలు ప్లే చేసా.. వాటిలో కొన్ని ఆయన సతీమణి శిశువిక్రయాల కేసుకు సంబంధించినవి.. ఇవన్నీ ఆయనకు చీకాకు కలిగించాయి..వారం రోజులపాటు డిజిపి పీఆర్వో ఆఫీసు నుండి వరుస ఫోన్లు... మొత్తానికి ఒక పది రోజుల తర్వాత స్వరణ్ జిత్ సేన్ ఇంటర్వ్యూ కుదిరింది.. ఏమన్నా ఉంటే అడిగి రాయొచ్చు కదా అని అంటే మీరు మాకు టైం ఎప్పుడిచ్చారు సర్ కనీసం ఫోన్ లో కూడా మాట్లాడరు కదా అని సూటిగా బదులిచ్చేసా.. తర్వాత తరచుగా మాట్లాడుకున్నాం.. ఎప్పుడు అడిగినా టైం ఇచ్చేవారు.. అయన డీజిపి గా రిటైర్ అయిన తర్వాత అయితే మరీ క్లోజ్ అయిపోయారు. అనేక ఎక్స్ క్లూజివ్ స్టోరీలకు మెటీరియల్ ఇస్తూనే మాజీ డీజిపి హోదాలో అనేకసార్లు ఇంటర్యూ ఇచ్చారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు సేన్ ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూ చేసాను. జీ 24 గంటలు లో అనేక ఎక్స్ క్లూజివ్ స్టోరీలకు ఆయన బైట్ ఇచ్చారు.. బలిమెల రిజర్వాయర్ లో పోలీసు బలగాలపై మావోయిస్టుల దాడి, ఇన్సాస్ రైఫిల్స్ అపహరణ, మావోయిస్టులతో వాటర్ వార్ వంటి స్టోరీలు స్వరణ్ జిత్ సేన్ సహకారంతో చేసాను..
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.. ఎప్పుడూ వివాదాల్లో ఉండే సేన్ మంచివారే.. ఎంకౌంటర్లు, కూంబింగ్, డంపుల స్వాధీనంతో ఆయన హీరో అయిపోయారు.. మావోయిస్టుల విషయంలో ఆయన కరకుగా వ్యవహరించారు అందరు డీజీపీల కంటే భిన్నంగా.. అంటే అప్పుడు సియం ఆయన నుంచి అదే కోరుకున్నారు.. కొన్ని సందర్భాలలో ఆయన హోమ్ మంత్రిని కూడా పట్టించుకునేవారు కాదు.. ఏదైనా డైరెక్టు సియం తోనే నడిచేది.. ఇవన్నీ ఆయన డ్యూటీ వ్యవహారాలు.. నా వరకు మాత్రం మొదట ఇబ్బందిగా ఉన్నా తర్వాతి పరిణామాల నేపథ్యంలో మంచి మిత్రుడిగా మారారు.. రంజాన్, బక్రీద్ లకు స్వయంగా ఫోన్ చేసి విషెష్ చెప్పేవారు..నువ్వు నక్సలైట్ సానుభూతిపరుడివి అందుకే వాళ్ల గురించి ఎక్కువగా స్టోరీలు చేస్తుంటావు అని సరదాగా జోక్ చేసేవారు.. ఏది ఏమైనా నా కెరీర్ లో పవర్ ఫుల్ డీజిపి స్వరణ్ జిత్ సేన్ మాత్రమే...

No comments:

Post a Comment