గజనీ గౌస్
బాగా గాధనిద్రలో ఉన్నా
ఏదో చిన్న అలికిడి
రణగొణ ధ్వనిగా మారుతోంది
అది ట్రాఫిక్ సౌండా
లేక మార్కెట్లో అరుపులా తెలియదు గానీ
గందరగోళం ఏదో చెవులను తాకుతోంది
భారంగా కన్నులు తెరిచా...
ఆశ్చర్యం నేను నా బెడ్ పైన లేను
ఎక్కడో చౌరాస్తాలో నిలబడి ఉన్నా...
మాసిన బట్టలు చింపిరి జుట్టు బాగా పెరిగిన గడ్డం
అది నేనే కానీ
నేనెవరో నాకే తెలియటం లేదు
నేనెవరో ఎక్కడున్నానో తెలియక దిక్కులు చూస్తూ
నిలబడి ఉన్నా....
అక్కడ ఓ తోపుడు బండిపై ఒక ముసలాయన మల్లెపూలు అమ్ముతున్నాడు
మెల్లగా అతని దగ్గరికి నడిచా
తాతా ఇది ఏప్రాంతం అని అడిగా
అతను నన్ను కిందా మీదా చూస్తూ ఎవరు బాబూ నువ్వు అని అడిగాడు
అవును నేను ఎవరినీ
నీకేమైనా తెలుసా అని ఎదురుప్రశ్న వేసాను
అతను ఫక్కున నవ్వి
ఎవడో పిచ్చోడు అంటూ
నా చేతిలో పది రూపాయలు పెట్టాడు...
అంటే నేను యాచకుడినా
అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ
కాదేమో అనుకుని ఆ పది రూపాయలు అతని బండి మీద పెట్టేసి ముందుకు కదిలా...
రోడ్డుకు అవతల బస్సు స్టాండ్ అనుకుంటా
ఓ అమ్మాయి బస్సు కోసం వెయిట్ చేస్తోంది
నాకు తెలిసిన వ్యక్తిలా అనిపిస్తే పరీక్షగా చూసా
ఎందుకో గుండె ఉప్పొంగింది
నాకు తెలిసిన మనిషి కనిపించిందని...
రోడ్డుకు ఇవతల నేను
అవతల తను
సందేహం లేదు అది నా కూతురే
గట్టిగా అరిచి పిలుద్దామనుకున్నా
అవునూ ఇంతకీ తన పేరేమిటి
అవును బిడ్డ పేరు తెలియదు నాకు...
ఏమని పిలవాలో తెలియక చూస్తూ నిలబడిపోయా
అంతలోనే బస్సు వచ్చింది
తను బస్సెక్కి వెళ్ళిపోయింది
నేనెవరో తెలుసుకునే
ఒక్క ఆధారమూ వెళ్ళిపోయింది...
ఆలోచిస్తూ రోడ్డుపై నడుస్తున్నా
ఇంతకీ నేనెవరినని
అంతలోనే రాకాసి లారీ ఒకటి చెవులు పగిలేలా హారన్ కొడుతూ నా మీదకు దూసుకు వచ్చింది
లారీ చక్రాల కింద నలిగిపోయిన నేను
నన్ను నేనూ చూస్తూ నిలబడి ఉన్నా
ఎవరో చనిపోయాడనుకుంటూ...
ఎందుకో మెలకువ వచ్చింది
నేను బెడ్డు మీదే ఉన్నా
కొద్దిసేపు ఇక్కడికెలా వచ్చా
అసలు నేనేనా అనుకుంటూ
నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకున్నా
అర్ధరాత్రి నా మనసును గందరగోళం లో
పడేసిన స్వప్నమిది...
No comments:
Post a Comment