షూట్
చేసేద్దామనుకున్నా.. (PART-22)
అవును ఆరోజు షూట్ చేసి పారేద్దామని అనుకున్నా... తప్పనిసరి
పరిస్థితిలో అలా ఆలోచించా... నన్ను నేను కాపాడుకోడానికి నాకు అంతకన్నా వేరే మార్గం
కనిపించలేదు. ఏదైతే అదవుతుంది.. ముందుగా కాల్చి పారేసి పోలీస్ స్టేషన్ కి వెళదామని
డిసైడ్ అయ్యా... అయితే అనూహ్యంగా కథ సుఖాంతం కావడంతో ఒక సంచలనం చరిత్రలో నమోదు
కాకుండా చీకట్లో మగ్గిపోయింది... ఇంతకూ ఏం జరిగింది? కాల్పులదాకా వెళ్లిన సంఘటన
ఏంటి? అని ఆలోచిస్తున్నారా... అయితే చదవండి క్లుప్తంగానే చెబుతా...
అవి తెలంగాణా ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న రోజులు... నేను జీ 24
గంటలలో క్రైమ్ బ్యూరో చీఫ్ గా ఉన్నా... ఆరోజు ఏడు గంటలకే డ్యూటీ ముగించుకుని ఏదో
పార్టీ ఉంటే ప్రెస్ క్లబ్ కు వెళ్ళా.. రాత్రి పదిన్నర వరకు అక్కడే ఉన్నా.. చిన్నగా
వర్షం మొదలైంది.. ఇక వెళ్దాం అనుకుని అందరికి వీడ్కోలు చెప్పి కారు స్టార్ట్
చేసా.. అప్పట్లో నాకు i10 కార్ ఉండేది.. ట్రాఫిక్ పెద్దగా లేదు.. పది నిమిషాల్లో
సరోజినీ హాస్పిటల్ కు చేరుకొని అక్కడ పీవీ ఎక్స్ ప్రెస్ బ్రిడ్జి ఎక్కా..అక్కడే ఒక
చిన్న పొరపాటు జరిగింది. నా కారు బ్రిడ్జి పైకి ఎంటర్ అవుతున్న సమయంలో పక్కనుంచే
ఒక ఇన్నోవా దూసుకువచ్చింది. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు నాపై అరుస్తున్నట్టు
అనిపించింది. అంటే నేను పొరపాటున వారి కారుకు రాంగ్ సైడ్ లో కటింగ్ ఇచ్చానేమో
అనుకుని చేతులు ఊపుతూ సారీ చెప్పా.. ఆ కారు కొంచెం వేగం పుంజుకుని ముందుకు
దూసుకుపోయింది. ఓకే నో ప్రాబ్లమ్ అనుకుంటూ నాకిష్టమైన జగ్ జీత్ సింగ్ గజల్స్ వింటూ
స్లోగా డ్రైవ్ చేస్తున్నా.. కొద్ది దూరం వెళ్ళగానే ఆ కారు మళ్ళీ కనిపించింది నా
కారుకు దగ్గరగా.. వాళ్ళు కావాలనే స్లోగా వెళుతూ నాకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం
చేస్తున్నారు. బ్రిడ్జి పై ట్రాఫిక్ అంతగా లేదు.. అది కర్నూలు జిల్లా
రిజిస్ట్రేషన్ కారు, నా కారు ముందూ వెనుకా అద్దాలపై తెలంగాణ స్ట్రిక్కర్లు
అతికించి ఉన్నాయి కేసీఆర్ బొమ్మతో.. (అప్పట్లో కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు, తెరాసకు
అప్పటికి రాజకీయ పార్టీల అవలక్షణాలు అబ్బలేదు). ఆ స్టిక్కర్ చూసి వాళ్ళు
రెచ్చిపోయారనుకుంటా.. నా కారును ముందుకు పోనీయకుండా, కనీసం సైడ్ కూడా
తీసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా కటింగ్స్ ఇస్తూ స్లోగా ముందుకు సాగుతున్నారు. ఆ
కార్లో నలుగురున్నారు.. ఒక్కొక్కరు ఇప్పటి సంజయ్ దత్ లాగా పొడవుగా భయం గొలిపేలా
ఉన్నారు. తెల్ల చొక్కాలు ఏదో రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళలా కనిపిస్తున్నారు.
నేనేమో ఒక్కడినే బక్క ప్రాణం.. ఒక్కడి చేయి పడితే ఇక మళ్ళీ లేవను. పైగా ట్రాఫిక్
కూడా లేడు.. సరే ఏదైతే అది అవుతుందని స్లోగా వారి కారు వెనుకే నా కారు ను డ్రైవ్
చేస్తున్నా.. వాళ్ళు సడన్ బ్రేక్స్ వేస్తూ భయపెడుతున్నారు, నా కారు వాళ్ళ కారును
ఢీ కొడుతుందేమో అన్న భయం వేసింది..అలా ఇబ్బందికరంగా దాదాపు తొమ్మిది కిలో మీటర్ల
దూరం వరకు ప్రయాణం సాగింది. ఇంకెంత అరకిలోమీటర్ దూరం వెళితే నేను దిగాల్సిన
ఆరాంఘర్ ఎగ్జిట్ వస్తుంది.. అయితే వాళ్ళు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు.. ఎగ్జిట్ కు
ముందు కార్ అడ్డంగా ఆపేసి కిందికి దిగారు. నేను సడెన్ బ్రేక్ వేసి కార్ ఆపాను.
నాలో భయం మొదలైంది. నలుగురు ఒక్కో చేయి వేస్తే నేను కుప్పకూలడం ఖాయం. నాకేం అర్ధం
కాలేదు. కిందికి దిగకతప్పదు. అప్రయత్నంగానే నా చేయి సైడ్ సీటు పైకి వెళ్ళింది.
సైడ్ సీటు మీద ఎప్పుడూ నా రివాల్వర్ ఉంటుంది. చేతిలోకి తీసుకున్నా.. క్షణంలో లక్ష
ఆలోచనలు.. ఇప్పుడేం జరుగుతుంది వాళ్ళు నాపైకి దాడికి దిగుతారా.. నేను గన్
ఉపయోగించక తప్పదా.. ఒక వేళ కాల్పులకు దిగాల్సి వస్తే పోలీసులకు ఏం చెప్పాలి.
ఆత్మరక్షణకు కాల్పులు జరిపే హక్కు నాకు ఉంది.. అయినా ఏదో సంశయం.. గట్టిగా
నిర్ణయించుకున్నా పరిస్థితి ఏమాత్రం అదుపుతప్పినా షూట్ చేద్దామని.. ధైర్యం కూడదీసుకుని
చేతిలో గన్ పట్టుకుని కిందకు దిగా... సన్నని వాన చినుకులు.. లైట్ల వెలుగులో నల్లగా
మెరుస్తూ నా రివాల్వర్ వారి కంటపడింది. వాళ్ళు అక్కడే ఆగిపోయారు.. ఇది వారికి
ఊహించని పరిణామం. ఒక అడుగు వెనక్కి తగ్గారు. నేను అక్కడే నిలబడి ఉన్నా అన్నింటికి
సిద్ధపడి.. ఒక నిమిషం రెండు వైపులా నిశబ్ధం.. వారిలో ఒకతను రెండు అడుగులు ముందుకు
వేసి అన్నా తప్పు మా డ్రైవర్ గాడిదే.. సారీ చెప్పాలనే కార్ ఆపాం ఏమనుకోకు అని
వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే క్షణాల్లో ఆ కారు అక్కడి నుంచి దూసుకుపోయింది. మరుసటి
రోజు ఈ సంఘటన ఆఫీసులో చెప్పుకుని బాగా నవ్వుకున్నాం గానీ ఆరోజు నేను నిజంగానే
టెన్షన్ పడ్డాను. ఒకవేళ కాల్పులు జరపాల్సిన పరిస్థితులు ఎదురైతే... ఆ ఆలోచన వస్తే
ఇప్పటికీ కొంచెం టెన్షన్ అనిపిస్తుంది.. ఈ పోస్టులో ఫోటో మాత్రం నేను జీ తెలుగులో
అక్రమ ఆయుధాలపై స్టోరీ చేసినప్పటిది గమనించగలరు...
మీ దగ్గర గన్ లేకపోయి ఉంటె ? వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మర్డర్ చేసి ఉండేవాళ్ళు . నిజం చెప్పాలంటే మన దేశం , ఆఫ్రికా లాంటి కొన్ని దేశాలు కన్నా అధ్వాన్నం . మనం చూసేవి పై పై మెరుగులు మాత్రమే . గన్ ఉంటె కానీ వాళ్ళు భయపడలేదు . అవిలేని సామాన్యుడు పరిస్థితి ?? వంగి వంగి దండాలు పెట్టుకుంటూ బ్రతకాలి . అలంటి గూండా వెధవల్ని దేవుడిని చేసి వాళ్ళ జీవిత చరిత్రలు రాసే రచయతలు ఇంకెంత వెధవలో ??
ReplyDeleteనిజమే మీరు చెప్పేది ఇప్పుడు గూండాలే దేవుళ్ళు.. ఆ రోజు నిజంగా నా దగ్గర గన్ లేకపోతే... ఊహించడమే కష్టం.. థాంక్స్ అండీ
Deleteవాళ్ళేదో దౌర్జన్యం చేసి మీకు బుధ్ధి చెప్పాలని ప్రయత్నించారు. కాని మీ చేతిలోని ఆయుధం వాళ్ళకే బుధ్ధి చెప్పింది.
ReplyDeleteఒకవేళ తప్పు నాదే అయితే అంత దారుణంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందంటారా సార్...
ReplyDeleteలేదని శాంతంగా ఆలోచించగా లిఖించిన పరిణితి కల వారికే తెలుస్తుంది. అపరిపక్వబుధ్ధులే దౌర్జన్యాలకు దిగుతారు. అటువంటి వారికి వారి భాషలో చెప్పితే తప్ప అర్ధం కాకపోవచ్చు తరచుగా.
Deleteఅవును సర్ నేను డ్రైవింగ్ లో మిస్టేక్ చేసి ఉంటా.. అంత మాత్రానికే వాళ్ళు అలా చేయాల్సింది కాదు. ఒకవేళ వాళ్ళు దాడికి దిగి ఉంటే నేను ఖచ్చితంగా ఎనిమిది బుల్లెట్లు వాడేసేవాడిని. చివరి నిమిషంలో వారు సమయస్ఫూర్తి చూపడం వల్ల ప్రమాదం తప్పింది.
Deleteమీ స్పందనకు ధన్యవాదములు సర్..