అదేదో సినిమాలో
శృతి హాసన్ లా(PART-21)
.
ఒక సినిమాలో శ్రుతిహాసన్ అంతర్గతంగా ఎలా భయపడుతుందో గుర్తుంది
కదా.. లోపల కెవ్వుమని అరుస్తూ బయటకు మాత్రం గంభీరంగా కనిపిస్తుంది. అద్భుతమైన
సబ్జెక్టు ఇది.. ఒక్కోసారి నిజ జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. లోపల
గుండెలు పగిలిపోయే భయం ఉన్నా పైకి మాత్రం గంభీరంగా ఉన్నట్టు నటించాల్సి వస్తుంది.
ఇలాంటి గడ్డు పరిస్థితి నా జర్నలిజం కెరీర్ లో ఒకసారి ఎదురయ్యింది.. ఆరోజు ఎంత
భయపడ్డానంటే ఇక బతుకు మీద ఆశలు వదులుకోవాల్సిందే అనుకునేంతగా...
అవి నేను జీ తెలుగు న్యూస్ విభాగంలో పని చేస్తున్న రోజులు..
పరిమితమైన బులెటిన్స్ తో జీ తెలుగు బాగా పాపులర్ అయిన సమయం.. నేను క్రైమ్
చూస్తున్నా బులెటిన్స్ తక్కువ కావటంతో క్రైం వార్తలకు పరిమితి ఉండేది. అందుకే నేను
టైమ్ ఉన్నప్పుడు సాఫ్ట్ స్టోరీస్ కూడా చేస్తుండేవాడిని.. ఆరోజు ఏవియేషన్ లో
ఉద్యోగావకాశాలు అనే సబ్జెక్టు తో స్టోరీ చేయడానికి హయాత్ నగర్ లోని ఫ్లై టెక్
ఏవియేషన్ అకాడమీకి వెళ్ళా నా టీమ్ తో.. విమానయాన రంగంలో ఔత్సాహిక యువతకు అక్కడ
శిక్షణ ఇచ్చే విధానాన్ని షూట్ చేసాం. అక్కడి స్టూడెంట్స్ తో మాట్లాడటంతోపాటు
పైలెట్ శిక్షణలో ఆధునిక సాంకేతిక పద్దతులపై డిటైల్డ్ స్టోరీ చేసాం.. అనేక చిన్ని
చిన్ని ట్రైనీ విమానాలు గాల్లోకి చక్కర్లు కొడుతుంటే ముచ్చట పడుతూ షూట్
చేస్తున్నాం. పేరు గుర్తులేదు కానీ ఆ అకాడమీ డైరెక్టర్ ఒకరు ఫ్లై చేస్తావా అని
నన్ను అడిగారు, ఓ యస్ అన్నా.. అంతే ఓ బుజ్జి విమానం ఎక్కించారు పక్కనే లేడీ పైలట్
క్యాఫ్టన్ మమత.. తను అడిగారు ఆర్ యూ ఓకే అని.. మనకేం భయం అప్పటికే ఒకటి రెండు
సార్లు విమానం ఎక్కిన అనుభవం ఉంది బస్సుల్లాంటి పెద్ద విమానాలే ఎక్కాను కార్ అంత
ఉంది దీనికి భయపడతానా అని మనసులో అనుకున్నా.. విమానం కదలటానికి గ్రీన్ సిగ్నల్
దొరికింది. ఒక్క కుదుపుతో ఇంజన్ స్టార్ట్ అయ్యింది.. విమానం చిన్నది కావటంతో
కార్లో కూర్చున్నట్టే అనిపించింది. విమానం మెల్లగా కదులుతోంది.. మీరు రెడీనా గౌస్
గారు అని అడిగారు మమత. యెస్ అన్నా... ఒక్క క్షణంలో పరిస్థితి మారిపోయింది.. ఎన్నడూ
చూడనంత వేగంతో రన్ వే పై పరుగులు తీస్తోంది పిట్టలాంటి విమానం. ఎదురుగా
కనిపిస్తున్న రన్ వే ఆనవాళ్లు కనురెప్పలు మూసేంతలో మాయమవుతున్నాయి.. నాకేదో భయం
పట్టుకుంది ఆ దృశ్యం చూసి..నేను విమానంలో లేను నా దేహమే అంత వేగంగా దూసుకుపోతోంది
అనే భ్రమ కలిగింది. అయినా పక్కన ఉన్నది లేడీ, మనం ఎంతమాత్రం తగ్గొద్దు అనే ఇగోతో
ధైర్యంగా ఉన్నట్టు కనిపించా...ఒక్కసారిగా విమానం పైకి లేచింది.. అంతే ప్రాణాలు
పోయినంత పనైంది.. అయినా నా మేల్ ఇగో నన్ను హెచ్చరించింది.. ధైర్యంగా ఉన్నట్టే
నటించా.. కొంత పైకి ఎగిరాక కొంచం రిలాక్స్ అనిపించింది. హైదరాబాద్ శివారు అందాలు
విహంగ వీక్షణం చేస్తూ రిలాక్స్ అవుతున్నా.. అప్పుడడిగారు క్యాప్టెన్ భయపడ్డారు కదూ
అని .. నో భయమా ఎంజాయ్ చేస్తున్నా అని జవాబిచ్చా.. అంతే మరుక్షణమే విమానం పల్టీ
కొట్టినట్టు అనిపించింది... ఒక పెద్ద కుదుపు... కిందకి కూలిపోతున్నామేమో అని భయపడి
లోలోపలే ఆర్తనాదాలు చేసా.. అయితే అది నన్ను భయపెట్టడానికి చేసిన చిన్న ప్రయత్నం
అని అర్ధం అయ్యింది. ఆ ప్రయత్నం చిన్నదే కానీ నాకు జీవితంలో మరిచిపోలేని భయానక
అనుభవమది.. అయినా సరే బయటకు మాత్రం భయం కనిపించనీయకుండా గాంభీర్యం నటించా..
అరగంటలో తిరిగి వచ్చేసాం.. కిందకు దిగాక క్యాప్టెన్ మమత కొంటెగా నవ్వుతూ షేక్
హ్యాండిచ్చి వెళ్లిపోయారు.. హమ్మయ్య బతికిపోయా అని ఊపిరి పీల్చుకున్నా.. ఒక్కటి
మాత్రం నిజం నేను చాలా భయపడ్డా... కానీ తన ముందు బయట పడలేదు.. అరిచినా ఆర్తనాదాలు
చేసినా లోలోపలే అదేదో సినిమాలో శృతి హాసన్ లా...
No comments:
Post a Comment