Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday, 14 August 2020

డీజేఎస్ తో ఢీ(PART-27)


డీజేఎస్ తో ఢీ(PART-27)
ముస్లింని కావడం కావచ్చు లేదా నాలో ఉన్న అమితాసక్తి కారణం కావచ్చు.. కారణం ఏదైనా నా జర్నలిజం ప్రయాణంలో హైదరాబాద్ పాతబస్తీ ఒక కీలక అంశంగా కొనసాగింది.. మితృలలో ఎక్కువమంది పాతబస్తీ వాళ్ళే ఉండటంతో పాతబస్తీ రాజకీయ సామాజిక వ్యవహారాల్లో మంచి అవగాహనే ఉండేది. నేను ఏ ఛానల్ లో ఉన్నా పాతబస్తీకి చెందిన వార్తలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవాడిని. అందరిలాగా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే వెళ్లి కవర్ చేసుకుని పోవడం వంటి అంశాలకే పరిమితం కాకుండా సమస్యపై లోతుగా అధ్యయనం చేయడం నాకు అలవాటు.. అయితే ఈ అలవాటే నాకు ప్రాణాలమీదకు తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే.. ఎందుకంటే నా మీద జరిగిన రెండు దాడుల విషయం ఇదివరకే ప్రస్తావించాను.. అవి సిమీ గ్రూపు చేసిన దాడులు.. అయితే మరో ధార్మిక సంస్థతోనూ నాకు వైరం నడిచింది.. అయితే అదృష్టవశాత్తు మూడో దాడి జరగలేదు.. ఇక అసలు విషయానికి వద్దాం...
డీజేఎస్... అంటే దరస్గాహ్ జిహాద్ ఓ షహదత్.. ఈ సంస్థ బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం ఆవిర్భవించింది.. బాబ్రీ పునర్నిర్మాణమే లక్ష్యంగా ముస్లింలను సంఘటిత పరచడమే తమ విధానమని ఈ సంస్థ ప్రకటించుకుంది. షేక్ మహబూబ్ ఆలీ దీని వ్యవస్థాపకులు.. ఆయన ఈ మధ్యనే చనిపోయారు..
మహబూబ్ ఆలీ చేపట్టే కార్యక్రమాలకు నేను ఒక రిపోర్టర్ గా హాజరయ్యేవాడిని.. ఈ రకంగా నేను సిటీ కేబుల్ లో ఉన్నప్పటినుంచే డీజేఎస్ కు పరిచయం. జెమిని లో ఉన్నప్పుడు మహబూబ్ ఆలీ తో సంబంధాలు మరింత బలపడ్డాయి. డిసెంబర్ ఆరున ప్రతి సంవత్సరం డీజేఎస్ పిలుపు మేరకు పాతబస్తీలో సంపూర్ణ బంద్ జరిగేది. డీజేఎస్ ఎప్పుడు ఎలాంటి పిలుపు ఇచ్చినా ప్రజలు భారీ స్థాయిలో స్పందించేవారు. ఒక దశలో ఇది మజ్లిస్ కు పోటీ సంస్థగా అవతరించనుందా అని అనిపించేది. అయితే తమ లక్ష్యం రాజకీయం కాదని మహబూబ్ ఆలీ చెప్పేవారు.. మరి ఇంత మంచి సంబంధాలు ఉన్న డీజేఎస్ తో నాకు ఎందుకు చెడింది..మహబూబ్ ఆలీ నాకు వార్నింగ్ ఎందుకు ఇచ్చారు.. అసలేం జరిగింది...
అసలు విషయం ఏమిటంటే వికారుద్దీన్ తెలుసు కదా.. ప్రతి ఏటా డిసెంబర్ ఆరున నగరంలో ఏదో ఒక చోట పోలీసులపై కాల్పులు జరుపుతూ సంచలనం సృష్టించేవాడు. వరుస కాల్పులతో మోస్ట్ వాంటెడ్ గా మారిన వికారుద్దీన్ డీజేఎస్ సభ్యుడేనని పోలీసుల దర్యాప్తులో తేలింది.. అయితే వికారుద్దీన్ ఒకప్పుడు మా సభ్యుడే అయినా ఇప్పుడు తనతో సంస్థకు సంబంధం లేదని మహబూబ్ ఆలీ స్పష్టం చేశారు.. అయితే మన క్రైమ్ బుర్ర ఊరుకోదు కదా కొంచెం తేడాగానే ఆలోచించించింది.. అసలు డీజేఎస్ టార్గెట్ ఏంటి.. అంతర్గతంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతోంది.. సంస్థలో ఎంతమంది సభ్యులున్నారు.. ఇప్పుడు వారంతా ఏం చేస్తున్నారు అనే దిశగా పరిశోధన ప్రారంభించాను.. కొంత సమాచారం దొరికింది.. దొరికిన సమాచారంతో డైరెక్ట్ మహబూబ్ ఆలీ ముందే కెమెరా పెట్టేసాం.. ఇది జీ లో ఉన్నప్పటి విషయం.. అవును వికారుద్దీన్ మా విద్యార్థియే.. కానీ అతనితో ఇప్పుడు మాకు సంబంధం లేదు.. మేము చట్టానికి లోబడే పని చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. అయితే నగరానికి చెందిన సుమారు రెండు వందల మంది యువకుల ఆచూకీ లేదు వారిలో సగం మంది మీ విద్యార్థులే కదా అని ప్రశ్నిస్తే ఆయన అసహనంగా ఫీల్ అయ్యారు. మేము ఇప్పుడు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వటం లేదనీ ఎవరైనా టెర్రరిస్ట్ గ్రూపుల్లో చేరితే మాకు సంబంధం లేదని ఎదురు వాదించారు.. సరే ఇంటర్వ్యూ ఐపోయింది. పోలీసు కమిషనర్ ప్రసాద రావుతోనూ మాట్లాడి స్టోరీ కంప్లీట్ చేశాను.. ఆ స్టోరీ లో పాకిస్తాన్ లో శిక్షణ పొందుతున్న హైదరాబాదీ యువకులు, వారిలో ఇరవై మందికి పైగా డీజేఎస్ సభ్యులు ఉన్న విషయం ప్రస్తావిస్తూ డీజేఎస్ సంస్థ ముస్లిం యువకులకు యుద్ధ విద్య నేర్పుతున్న దృశ్యాలు ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం చేసాం.. ఈ దృశ్యాలు బయటకు రావడం అదే మొదటిసారి.. స్టోరీ సంచలనమే రేపింది.
పనిలో పనిగా డీజేఎస్ విధానం అహింసాయుతమే అయితే ప్రతి ఏటా డిసెంబర్ ఆరవ తేదీ నిరసన ర్యాలీలో ఏకే 47 వంటి బొమ్మ తుపాకులను ఎందుకు ప్రదర్శిస్తున్నారని స్టోరీలో ప్రశ్నించాం. ఈ స్టోరీ తరువాత పోలీసులనుంచి డీజేఎస్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి.. మహబూబ్ ఆలీకి ఈ పరిణామాలు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ఇప్పటికే రెండు దాడులు జరిగాయి మూడో దాడికోసం ఎందుకు ఆరాటపడుతున్నావ్ అని డైరెక్టుగా నవ్వుతూనే నన్ను బెదిరించారు మహబూబ్ ఆలీ.. మావాడివని అనుకుంటే మాకే వ్యతిరేకంగా రాతలు రాస్తావా ఇప్పటికే ముస్లిం వ్యతిరేకత మూట గట్టుకున్నావ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.. నేను చిరునవ్వుతోనే సమాధానం చెప్పాను ఇది నా డ్యూటీ అని.. తర్వాత స్లీపర్ సెల్స్ పై పోలీసుల వేట తీవ్రతరం అయ్యింది.. డీజేఎస్ పైనా పోలీసు నిఘా పెరిగింది.. నాకూ మహబూబ్ ఆలీకి మధ్య బాగా గ్యాప్ వచ్చింది. కొంత కాలం నేను భయపడిన మాట వాస్తవం మూడో దాడి తప్పదా అని.. అయితే అలాంటిదేమి జరగలేదు.. తర్వాత మహబూబ్ ఆలీ నాకు టైం ఇవ్వడానికి నిరాకరించేవారు.. ఇదే కారణంగా నేను ఆయనను కలవలేకపోయాను.. అయితే మహబూబ్ ఆలీ చాలా మంచి వారు.. నాతో ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ క్యా గౌస్ మియా ఖైరీయత్ అంటూ పలకరించేవారు. ఆ నెగిటివ్ స్టోరీ తర్వాత నేను డీజేఎస్ ఆఫీసులోకి ఎంటర్ కాలేకపోయాను.. అక్కడ అందరూ నన్ను శత్రువులా చూసేవారు..

2 comments:

  1. మహబూబ్ అలీ, పోయి పదేళ్లయిందా? ఒకానొక కాలంలో తరుచూ మల్లేపల్లి వచ్చేవాడు. ముసలాయన అందరినీ నవ్వుతూ పలకరించేవాడు. Nice pleasant man, if you exclude the politics.

    ReplyDelete
  2. అవును సర్.. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవారు

    ReplyDelete