మోసపోతూనే ఉంటా...
రామ మందిరం కడుతున్నారా
నాకేం ఒరిగిందని...
నాడు బాబ్రీ మసీదును
కూల్చారు
నా ఎండు డొక్క నిండిందా...
మసీదు కింద మందిరముందన్నారు
నాకేం తెలుసు
అక్కడ రామ మందిరమే ఉందో దానికింద బౌద్ధ మందిరమే ఉందో
చరిత్ర నాకెందుకు
నాకు తెలిసింది ఆకలే...
మసీదును కూల్చండి
మందిరం కట్టండి
నాకేం సంబంధం
నాకు నాలుగు మెతుకులపైనే ఆరాటం...
నమాజు కోసం బాబ్రీ కి వెళ్ళలేదు
రాముడి కోసం అయోధ్యకు వెళ్ళను
నాలుగు గింజల కోసం
మండుటెండలో ఎక్కడికైనా
వెళతా...
మసీదు కోసం గొంతు చించుకున్న వాడికి నా ఓటు కావాలి
మందిరమంటూ రాజకీయమాడినోడికీ
నా ఓటే కావాలి
నా ఆకలి కేకలు ఎవడికీ వద్దు...
మందిరాలు కడతారు
విగ్రహాలు నిలుపుతారు
చరిత్ర ఆనవాళ్లు కూల్చి
కొత్త కట్టడాలతో చరిత్ర రాయాలని అనుకుంటారు
దగాపడుతున్న నా చరిత్ర
ఆనవాళ్లు ఆకలి మంటల్లో
కాలిపోతున్నా పట్టించుకోరు...
ఇప్పుడు నా మాటలు వినిపించవు
నా ఆర్తనాదాలు ఎవరి చెవులనూ తాకవు
నా ఆకలి మంటలు ఏ కళ్ళకూ కనిపించవు
అయినా వస్తారు నా చెంతకే ఓటు పేరుతో మోసానికి..
మరో మార్గం లేదు ఎవడినో ఒకడిని గెలిపిస్తూనే ఉంటా
ప్రతీసారిలా మోసపోతూనే...
ఎందుకంటే నేను
దగాపడిన భారతమాతని
మోసపోతూనే ఉంటా
చేసేదేమీ లేక...
No comments:
Post a Comment