చీకటివెలుగులు
అవి నవ్వులా
నింగి తారల తళుకులా...
అవి విషాద వీచికల
వైరాగ్యపు జల్లులా...
ఏమైతేనేమి
కురిస్తే కురవనీ
కన్నీటి వానలు
జారితే జారనీ
ప్రమోదాల మెరుపులు...
అవి వెండి వెన్నెలను మింగిన
కరి చీకటి తెరలా
అవి చీకటి పోరులో
అలసి సొలసిన వెన్నెల అలలా...
ఎలాగైతేనేమి
కమ్ముకొనీ అంధకారం
ఈ పుడమిని
ఓడించనీ చంద్రకిరణాలు
ఈ చీకటిని...
చీకటివెలుగుల పోరాటంలో
జాబిలిని కాను నేను
ఆశ నిరాశల ఆరాటంలో వెలుగులను కమ్ముకునే
గ్రహణాన్ని కానేకాను...
చీకటిని ఓడించక
వెన్నెలను గెలవలేక
మౌనమై నిలిచిన
ఒక వ్యర్ధ పదార్థాన్నే
నేను
మనస్వినీ...
No comments:
Post a Comment