మావూరు మా బంధం
చిమ్మ చీకటిని
చీల్చుకుంటూ
ఉదయభానుడు
తొంగి చూసే సమయం
మబ్బు తెరలు
తొలిగి
వెలుగులమ్మ
నడియాడే పసందైన దృశ్యం
నిద్ర మత్తు
వీడక కనురెప్పలు తెరుచుకోక
మళ్ళీ దుప్పటిలోకి
దూరిన వైనం
మేలుకో ఇంకా
నిద్దురెందుకు అంటూ
పక్కింటి
పుంజు గారి మేలుకొలుపు
మామిడాకుల
మాటునుంచి
కోయిలమ్మ సుప్రభాతం
మేమూ
ఉన్నామంటూ పక్షుల బృందగానం
కూయిలమ్మ
కువకువలు
పక్షుల
కిలకిలారావాలు
మధుర సంగీతమై
సవ్వడి చేయటంతో
మెల్లగా
కన్నులు తెరిచాను నేను
మా ఇంట్లో
నిత్యం
ఇదే నాకు
శుభోదయం
సాయం సంధ్య
వేళలో
చల్లని
పిల్లగాలులను ఆస్వాదిస్తూ
ఇంటి ముందు
కూర్చుంటే
ఏం మామా
బాగున్నావా
అల్లుడా తిన్నావా
ఆత్మీయ
పిలుపుల ఆలింగనం
నాకెవరూ ఏమీ
కారు
నా మతం కాని
మతం
అయినా అందరూ
నా వాళ్ళే
రక్త
సంబంధాన్ని మరిపించి
ఆత్మీయ
బంధాన్ని విరబూసి
వెలకట్టలేని
అభిమానాన్ని కురిపించే
ఈ మట్టి
మనుషులందరూ
నాకు బంధువులే
ఆ పలకరింపులు
మా అందరికి ప్రాణవాయువులే
అవును ఇది మా
వూరు
నా బాల్యం
గడిచిన పసందైన ఆవాసం
నగరీకరణ
మార్పుల ప్రభావం అంతో ఇంతో పడినా
మట్టి వాసన
వీడని అందమైన గ్రామం
అపార్ట్ మెంట్
జీవితాలతో
యాంత్రిక
జీవనం గడిపే డబ్బు మనుషుల
డాబూ దర్పం
కానరాని ప్రాంతం
మనసు నిండా
పలకరింపులు
గుండె నిండా
అభిమానాలు
కులమతాలు
పట్టని బంధుత్వాలు
ఇవే మావూరి
జీవన సౌరభాలు
జీవన బాటలో
అడుగులు అటూ ఇటూ
పడినా
మావూరిని మరువలేదు నా మనసు
కడ ఊపిరి దాకా
ఇక్కడే
కొనసాగుతుంది
నా బతుకు
నీలి
కాన్వాసుపై కదిలే బొమ్మల్లా
గగన వీధిలో
విహరించే
పక్షులను
చూస్తూ
కదిలే
మేఘాల్లో
మనసుకు నచ్చిన
ఆకృతులను గుర్తిస్తూ
సాయంకాలం అలా గడిచిపోతూ ఉంటే
నిజంగా మావూరు
ఎంతో అందమైన
ప్రదేశమే కదా
No comments:
Post a Comment