నేను దొంగనే
ఎవరేమన్నా ఇదే
నిజం
నేను దొంగనే
దొంగతనం నాకు
వెన్నతో పెట్టిన విద్యే
తేలికగానే
దొంగతనం చేస్తాను
అంతే తేలికగా
దొరికిపోతాను
దొరికిపోవటమూ
నాకిష్టమే
బందీఖానా నాకు
దేవాలయమే
ఆ దేవాలయంలోనే
మరలా దొంగతనం
చేస్తాను
నేను మామూలు
దొంగను కాదు
గజదొంగనే
సిరి సంపదలు
దోచుకోవటం నాకు చేతకాదు
ఒకరి టోపీ
మరొకరికి పెట్టడం అసలే రాదు
వజ్రాలు
వైడూర్యాలు చోరీ చేయలేను
మాయలూ మోసాలు
నాకు రానే రావు
కుట్రలు
కుతంత్రాలు నా ఆలోచనకే గిట్టవు
అయినా నేను
దొంగనే
ప్రేమ దొంగని
మనసును
దోచుకుంటా
మనసిస్తే
మమతను దోచుకుంటా
మమతలో
అనురాగాన్ని చోరీ చేస్తా
అనురాగంలో
అనుబంధాన్ని చూసుకుంటా
మమకారం వల
విసిరితే
మనసులోనే
చిక్కుకుంటా
ప్రేమ ఖైదీ లా
మిగిలిపోతా
ఆ ఖైదులోనే
తనువును చాలిస్తా
ఆదరిస్తే మంచి
దొంగలా ఉండిపోతా
అదిలిస్తే
తలవంచి నిష్క్రమిస్తా
దోచుకున్న
జ్ఞాపకాలనే నెమరు వేసుకుంటా
దోచిన
అనుభవాలను
అక్షరాలుగా
మలుచుకుంటా
నేను దొంగనే
కదా
మనస్వినీ
No comments:
Post a Comment