ఇది నిజం కాదు
దివిలోని
స్వర్గసీమ భువిని చేరిందా
తెల్లని
కాన్వాసుపై రమ్యమైన దృశ్యం గీసినట్టు...
ఏమిటిది
స్వర్గమేనా
భువిపై దైవం
చిత్రించిన దృశ్యకావ్యమా...
మదిని
మురిపించే పూదోటలు
నువ్వానేనా
అనిపించే గులబీబాలల సోయగాలు...
బంతులు
చామంతులు
మనసును
ముద్దాడే మరుమల్లెలు
మకరందం కోసం
రసధుని పాడే భ్రమరనాదాలు...
అడుగుతీసి
అడుగుపెడితే
మఖ్ మల్
వస్త్రంలా పాదాలను ముద్దాడే
పచ్చికబయళ్ళు...
ఇదేమిటీ!
ఓహో అందమైన
కొలనులో
అందానికే
వన్నెలు తెచ్చే పద్మకుసుమాలు
ఎంత
ముద్దొస్తున్నాయి కలువభామలు...
ఇది బృందావనమా
కాశ్మీర అందమా
అటుచూస్తే
పాలధారలా జారుతున్న
హిమ పుష్పాలు
ఎంతమనోహర
విహారము...
అలసటే
అనిపించకున్నా
పుష్పికల మధ్య
ఆసీనుడినయ్యాను...
అటుగా
వచ్చింది ఓ అందమైన సీతాకోకచిలుక
నా భుజంపై
వాలి చెవిలో ఎదో చెప్పబోయింది...
అంతలోనే
రెక్కల సవ్వడితో
ఆనందభైరవి
పాడుకుంటూ
మరో భుజంపై
వచ్చివాలింది తెల్లని కపోతం
తన కువకువలో
ఏదో సందేశం...
అలిగిన
సీతాకోక చిలుక నేను చెప్పను పో అంటూ
వయ్యారంగా ఎగిరిపోయింది...
రంగులకొలికి
సీతాకోక చిలుక అలుకను చూసిన
కొలనులోని
మీనాలు ఎగిరెగిరి పడుతూ
ఆనందతాండవంతో
ఏదో చెప్పాయి...
చిటారుకొమ్మల్లో
దాగి ఉన్న చిలుకమ్మలూ
ఏదో
పాడుకుంటున్నాయి నన్ను చూసి...
అంతలోనే ఓ
కోయిలమ్మ కన్ను గీటి
కూయంటూ
మాయమయ్యింది...
సీతాకోక చిలుక
రాయబారంలో నీ ఉనికి తెలుసుకున్నా
కపోతం సందేశంలో
నీ హృదయస్పందనలు వెతుక్కున్నా...
మీనాల
సయ్యాటలో నీ పరువాలను చూసుకున్నా
చిలుకమ్మ
పాటలో నీ పలుకులే వింటున్నా
కన్నుగీటిన
కోయిలమ్మలో నీ కొంటెతనం నెమరు వేసుకున్నా...
చూసావా
మనస్వినీ
ఊహాసుందరివి నీవు...
నీ ఊహల్లో
నేనెన్ని కలలను నింపుకున్నా
ఆ కలల
వెలుగులనే
అక్షరాలుగా
రాసుకుంటున్నా...
నిజంగా నీవు
ఎంత అందమైన
స్వప్నానివి...
కనులముందు
నడియాడే వాస్తవం కన్నా
ఊహలు ఎంత
బావుంటాయి
మనస్వినీ...
No comments:
Post a Comment