దరి చేరని మనసులు
మనసు చుట్టూ భయం
మబ్బులు కమ్ముకున్నాయి
పుడమి చుట్టూ తెల్లని
మేఘాలు అల్లుకున్నట్లు
మనోసంద్రం ఇంకిపోయింది
కడలి కెరటాలు వెనక్కి
మరలినట్లు
ఏదో తెలియని భయం
కమ్ముకుంది మనసును
ఏదో తెలియని నిస్తేజం
ఆవరించింది మదిని
మంతనమాడిన మనసు
మూగనోము పట్టింది
పులకరించిన మనసు
వాడిన పువ్వును
తలపిస్తోంది
కలలు కరిగిన కన్నులు
కలుసుకోలేకపోతున్నాయి
వెన్నెల నెలవులు
నయనాలు
ఎండమావులుగా
మారుతున్నాయి
ఆవిరవుతున్న వెన్నెలలో
గుడ్డి దీపాలే
అవుతున్నాయి
మనసు పాటలు పాడిన
పెదాలు
శృతి లయలనే మరిచిపోయాయి
నువ్వూ నేనూ అని
పలకరించిన మనసులు
లేని గౌరవాన్ని
సంతరించుకున్నాయి
దూరమైనా దగ్గర కాలేని
మనసులు
చేరువైనా దూరాలనే కొలుస్తున్నాయి
దరి చేరే ఆరాటం తరిగిన
మనసులు
పంచన చేరేందుకు
భేషజాల ముసుగును
కప్పుకున్నాయి
అది దూరమో చేరువో
తెలియక
భయం మబ్బులు
కన్నీటి వానగా
కురుస్తున్నాయి
No comments:
Post a Comment