నిశిజీవిని
పూరెమ్మల
ఒడిలో నుంచి రాలిపడే రేణువుల్లా
నా కన్నుల్లో
కలలన్నీ రాలిపోయాయి
ఉప్పెనలా
వచ్చిన అల ఒకటి
కలల ఆనవాళ్ళను
తుడిచేసింది
ఎగసిపడిన
కెరటాలకు
జీవన సౌధం
కొట్టుకుపోయింది
అలల ధాటికి
అది శిథిల నగరమై నిలిచింది
శిలాజాల
నగరిలో
మరమనుషుల
బాటలో
ఎడారిలా
మిగిలిన పూలవనంలో
వాడిపడిన
పూలను చూస్తూ
కరిగిన
స్వప్నం ఆనవాళ్ళను వెతుక్కుంటూ
నిశి జీవినై
నిలిచి ఉన్నా
తెలవారేనని
కన్నులు విప్పితే
వెక్కిరించిన
సంధ్యను చూసి నవ్వుకున్నా
ఉదయంలోనూ సాయం
సంధ్యలోనూ
నేను లేనే
లేనని తెలుసుకున్నా
ఘడియ ఘడియకు
మధ్యలో
ఉనికే లేని
నేను నేనేకాదని సరిపెట్టుకున్నా
పుడమిలో
దిగబడిన అడుగుజాడల్లో
సమాధి అయిన
గతాన్ని అన్వేషిస్తూ
నా కనులకు కలల
యోగమే లేదని
చెమర్చిన
కనురెప్పలను
ఓదార్చుకున్నా
No comments:
Post a Comment