Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 30 October 2017

సత్యమా నువ్వు అసత్యమా

సత్యమా నువ్వు అసత్యమా

వద్దువద్దంటూ మెదడు పంపుతున్న సంకేతాలను
మనసెందుకో బేఖాతరు చేస్తున్నది
పరుగులు తీయమాకు పడిపోతావని
చేస్తున్న హెచ్చరికలను పట్టించుకోబోనని మారాం చేస్తున్నది
పదిమందిలో ఉన్నా
ఏకాంతమే నాదయినా
నీ గురించే పలవరిస్తున్నది
నీ చిన్న పలకరింపునే మరలా మరలా కోరుతున్నది
ఎవరు నీవు ఎలా ఉంటావు నీవు
మెదడుకూ మనసుకు జగడం పెట్టావు
కరిగిన నా అమావాస్యలో
చల్లని వెన్నెల పలకరింపువా
కదలికలు కోల్పోయిన మనసు కొలనులో
విరిసిన పద్మానివా
మసకబారిన మనోచంద్రికను అలరించే
కమ్మని కలువబాలవా
మయూరనర్తనమై మైమరిపించి
రమ్మని పిలిచి కన్నుగీటే నెమలి కన్నువా
ప్రకృతి కన్యకే వయ్యారాలు నేర్పే
సరససామ్రాజ్ఞి అభిసారికవా
సత్యమా నువ్వు అసత్యమా
కనులకే తెలియని దృశ్యమా
మనసుతోటలో ఉదయించిన ఇంద్రధనుస్సు వర్ణమా
మెదడును జయించే అందమైన గెలుపువా
మనసును మాయచేసే మధురమైన స్వప్నానివా

Tuesday 24 October 2017

ఇది చాలా హాటు గురూ

ఇది చాలా హాటు గురూ 

పొగలు కక్కుతున్న సెగలు
కైపెక్కించే కవ్వింతలు
కనులముందు పడకగది సన్నివేశాలు
వేగం అందుకుంటున్న హృదయస్పందనలు
మనసును పిండివేసే వేదనలు
అంతకు మించిన ఓదార్పులు
పగ తీర్చుకుంటానంటూ ఆవేశాలు
నీకు నేనుంటా అంటూ భరోసాలు
ఒకటి కాదు రెండు కాదు
వందలకొద్దీ సందేశాలు
బాబోయ్ ఇవన్నీ ఇన్ బాక్సు సిత్రాలు
పబ్లిక్ పోస్టులో అన్నయ్యా అంటూ గారాలు
ఇన్ బాక్సులో రావయ్యా అంటూ మారాలు
వాల్ మీద పెదరాయుడి దర్పం
ఇన్ బాక్సులో కాల్ గర్ల్స్ సేటు అవతారం
దేవుళ్ళ బొమ్మలతో ముసలోడి పూజలు
ఇన్ బాక్సులో బూతుబొమ్మలతో సరసాలు
నేను చాలా మంచోడిని అంటూ పోస్టులు
మీ ఇంటికి రమ్మంటారా అంటూఇన్ బాక్సు రాయబారాలు
వెలయాళి అమ్మళ్ళ కవ్వింతల చాటింగ్ లు
పరువున్న మగువలకు తప్పని అగచాట్లు  
ఫేస్ బుక్ పోస్టులు పక్కన పెడితే
ఈ ఇన్ బాక్సు చాలా హాటు గురూ

{ఈ పోస్టు మంచివారికోసం మాత్రం కాదు }

Monday 23 October 2017

ప్రియతమవా

ప్రియతమవా

ప్రియతమ అని నిన్ను పిలవనా
సజనీ అని సంబోధించి సరదాపడిపోనా
నేస్తమని అంటూ సరిపెట్టుకోనా  
 వయ్యారీ నిన్ను ఏమని పిలవను
గడుసరీ నిన్నెలా చూడను
ముద్దుముద్దు మాటలతో మురిపిస్తావు
చిలిపిసరదాలతో కవ్విస్తావు
నీ వసంతమంతా నాదేనని నమ్మబలుకుతావు
దేవుడిచ్చిన కానుకనేనంటూ ఆశలెన్నో రేపుతావు
ఉడికిన వయస్సులో ఆకలి రగిలి
పరువాల విందు చేయమంటే
భయమంటూ తప్పించుకుంటావు
ఔనంటే కాదంటూ కాదంటే ఔనంటూ
మనసుతో దోబూచులాడుతావు
రగిలిన తమకం పడగ విప్పితే
ఆంక్షలెన్నో పెడుతూ చిరునవ్వులు చిందిస్తావు
ఎగిసే తనువు మంటలపై నీళ్ళు చల్లుతూ
తుర్రుమని మాయమవుతావు
నిట్టూర్చిన మనసును మరలా కదిలిస్తావు
గాయాలపై మమతల లేపనం అద్దుతావు
ఏదో తెలియని భరోసాలా మెరిసిపోతావు
ఏమని అనుకోను నిన్ను
ఏమని పిలవను నిన్ను
ప్రియతమవా
నేస్తానివా
కరిగిపోయే అందమైన కలవా

Sunday 22 October 2017

అంతరంగ సమరం

అంతరంగ సమరం

ఎందుకు నా మనసు నీ వైపు చూస్తోంది
ఎందుకు నా అంతరంగంలో అలజడి రేగుతోంది
నీవెవరో తెలియదు నాకు
ఎందుకు నువ్వు నాలోనే ఉన్నావనిపిస్తోంది
మనసు పుస్తకం పుటలపై ఇంకా
రక్తపు చారికల తడి ఆరనే లేదు
ఎందుకు కొత్త భావాల మొలకలు
రెక్కలు విప్పుతున్నాయి
విడిచివెళ్లిన జ్ఞాపకాలు ఇంకా మంటలు రేపుతున్నా
ఎందుకు కొత్త పలకరింపు పన్నీరు చల్లుతోంది
నా కనుపాపలపై ఇంకా నీ ముద్ర పడనే లేదు
ఎందుకు మనసులో నీ రూపం కదలాడుతోంది
వలదని మెదడు వారిస్తున్నా
ఎందుకు నీ పకరింపు వ్యసనంలా మారింది
బీటలు వారిన పుడమి
తొలకరి చినుకుకై ఆర్తిగా చూసినట్లు
మోడువారిన వనంలో మారాకు నవ్వినట్లు
మబ్బులు కమ్మిన మనసుకు
చందమామ వెన్నెల హస్తం చాచినట్లు
ఎందుకు నాపై అమృతవర్షం కురిపిస్తున్నావు
హెచ్చరికలు చేసే మెదడుమాటకు కట్టుబడనా
మంచుముద్దలా కరుగుతున్న మనసుకు దాసోహం పలకనా
 అంతరంగమైదానంలో
ఎందుకు నాతో నేనే సమరం చేస్తున్నా 

Tuesday 17 October 2017

రగులుతూనే ఉండనీ

రగులుతూనే ఉండనీ 

తడియారని కన్నులలో
కళ్ళు పెట్టి చూడకు
కరుగుతున్న కలలవరదలో
నువ్వూ కొట్టుకుపోతావు
చితిమంటల చిటపటరాగం
వినిపించే మనసుపై పన్నీరు చల్లకు
పొగలు కక్కే నివురులో
మేఘమై కరిగిపోతావు
బీటలు వారిన పుడమిలాంటి
హృదయసీమలో వలపు మొక్కలు నాటకు
పచ్చదనాల నీ వసంతం వాడిపోతుంది
విరిసే నా పెదాలపై
ప్రణయకెంపులు వెతకకు
తెలియని చీకటి కథలకు
అవి ముఖద్వారాలని తెలుసుకుంటావు
కానరాని అగ్నిపర్వతమే నేను
నన్ను నాలోనే రగిలిపోనీ 

Wednesday 11 October 2017

పరవశమంతా నువ్వే

పరవశమంతా నువ్వే
 
తుంటరి చిరుగాలి సవ్వడిని   
గమనించలేదు నేను  
మేఘములై కమ్ముకున్న
నీ కురులలోనే దాగియున్నా నేను
చలి వెన్నెల జాబిలికి పొంగిపోలేదు నేను
నీ అరమోడ్పు కనుల సోయగాలకే
బంధీని అయ్యాను నేను   
చలువ చందన పరిమళము
తాకలేదు నన్ను  
సన్నజాజుల గుభాళింపూ
మైమరిపించలేదు నన్ను
నా ఊపిరిని తడిమిన
నీ శ్వాస మత్తులో మునిగిపోయాను నేను
గులాబీల అందాలకు
మురిసిపోలేదు నేను
నీ పెదాల కెంపులో
కరిగిపోయాను నేను
పరిసరాలను చూడలేదు నేను
నీ పరువాలకు బానిసనే నేను
పరవశమంతా నీలో దాచుకుని
ప్రకృతి కాంతపై నిందలెందుకు

Tuesday 10 October 2017

క్షిపణి

క్షిపణి

వద్దని వారించినా వినలేకపోయావు
గుండెపై వరుస క్షిపణులు సంధించావు
మనసు గుడిని కుప్పకూల్చావు
ఇప్పుడు చూడు
మనోదేవాలయంలో నీ రూపం
ముక్కలైపోయింది
నా మనసే మరణిస్తే
ఆ మనసులో కొలువైఉన్న
నువ్వూ చస్తావని
తెలుసుకోలేకపోయావు

Thursday 5 October 2017

మనసా కవ్వించకే

మనసా కవ్వించకే


నిదురించిన మనసును
మెత్తగా తడుముతావు
చిరుసందేశమై
మెల్లగా తట్టి లేపుతావు
మరణించిన భావాలకు
కొత్త ఊపిరులు పోస్తావు
వాడిన కుసుమాలకు
పరిమళాలు పూస్తావు
ఎండమావిలోనూ
నవవసంతమై పలకరిస్తావు
నవస్వప్నానికి తెరలేచే లోగా
మంచుముత్యమై కరిగిపోతావు
మనసును నిదురించనీయక
కవ్వింపులతో దోబూచులాడతావు
కవ్వించకే మనసా
నిదురపోనీ నా మనసుని 

Sunday 1 October 2017

రాలిపడకతప్పదు మనసా

రాలిపడకతప్పదు మనసా

మెరిసే రంగులో తెలియని మార్పు
ఏదో కానవస్తుంది
బిగిసిన పరువాలలో మెల్లగా సడలింపు
మొదలవుతుంది
శాసించే తీయని స్వరంలో
తెలియని అపశ్రుతి మొదలవుతుంది
నీలిమేఘాల శిరోజాలు
చీలికలు పీలికలవుతాయి
గులాబీ మధురిమల పెదాల రేకులు
రసరహితమై వాడిపోతాయి
మీనములై గిలిగింతలు రేపిన నయనాలు
నిర్జీవములై కాంతిహీనమైపోతాయి  
దర్పణం చూస్తే జారిపోయిన దర్పం
వెక్కిరిస్తుంది
తారకవని కొనియాడిన మనుషులు
దరిదాపుల్లో కానరారు
అప్పుడు మనసు తలపుల్లో
కదలాడుతుంది నువ్వు వీడివెళ్ళిన మనసు
తిరిగి చూస్తే ఆ మనసు
అనంతవాయువుల్లో విలీనమై
మూగగానే పలకరిస్తుంది
మనసు మయూరమైనా
తుళ్ళిపడే మంజీరమైనా
రాలిపడక తప్పుదు మనసా