నేను జీవిస్తూనే ఉంటా
పుడమి గర్భము చీల్చి
కొత్త మొలకగా బయటికి రాలేను
నింగినుంచి రాలే తారకల్లో
నేను కనిపించను
మోడువారిన మానులో
మారాకును కాలేను
చల్లని చందమామ నవ్వులో
చిరునవ్వునై పలకరించలేను
వేగుచుక్క వెలుగులో
తొలిపోద్దునై నవ్వలేను
చిరుగాలి సవ్వడిలో
సన్నని రాగమై వినిపించలేను
భువిని విడిచి నేను
దివివైపు అడుగులువేసినా
అందరూ ఉంటారు
అన్నీ ఇక్కడే ఉంటాయి
ఎందరో వస్తారు
నాలాంటి వాళ్ళూ వస్తారు
నాకన్నా మంచివాళ్ళూ వస్తారు
నేను రాను మరలా
గుర్తుకు రాను మరలా
అయినా నేను ఇక్కడే ఉంటాను
నా దేహం లేకున్నా
ప్రభవించిన నా అక్షరంలో
నేను నవ్వులు చిందిస్తూనే ఉంటాను
మనస్విని అక్షరాలను తడుముతున్న
ప్రతి హృదిలో నేను కనిపిస్తూనే ఉంటాను
నా అక్షరకుసుమాలను ఆస్వాదించే
ప్రతి మనసులో ఓ నదిలా
ప్రవహిస్తూనే ఉంటాను
ఒకసారి నవ్వుతూ
మరోసారి కన్నీరు చిందిస్తూ
విజయపుష్పాలను పంచి ఇస్తూ
స్వప్నాలను కన్నీటితో కడిగేస్తూ
నా అక్షరం రూపంలో నేను నిత్యం
జీవిస్తూనే ఉంటాను
మనస్వినీ
No comments:
Post a Comment