నాతోనే ఉన్నావ్
నాకు తెలుసు నువ్వు నాతోనే ఉన్నావని
అన్ని ఘడియలలో నా వెంటే ఉన్నావనీ
నాకు తెలుసు నువ్వు నిత్యం నాతోనే నడుస్తావని
నా నీడకన్నా నువ్వే నాకు చేరువగా ఉన్నావని
నీడ క్షణంపాటు మాయమైనా
నువ్వు నా వెనుకో ముందో ఉన్నావని
మెరిసే మెరుపుల మాటున విధ్యుత్ లతలు
యమపాశాలై పొంచి ఉన్నాయని
ఒంటి తీగపై నడిచే పాదాల కింద
నోరు తెరిచిన లోయలున్నాయని
నాకు బాగా తెలుసు నేను నీకు చిక్కక తప్పదని
మిన్ను విరగాల్సిన పని లేదని
పాదాలకు తడబాటు అవసరమే లేదని
మౌనంగా నీకు తలవంచక తప్పదని
నాకు తెలుసు
మరణమా నువ్వు నిత్యం
నాతోనే నడుస్తున్నావని
నాకు సాంత్వన ఇచ్చేది నువ్వేనని
No comments:
Post a Comment