కులమతాలకు అతీతం
బాలు స్వరం...
కదిలింది
కరుణరథం
సాగింది
క్షమాయుగం
మనిషి కొరకు దైవమే
కరిగి వెలిగే కాంతిపథం...
ఎలాంటి పరిస్థితిలో ఉన్నా
ఈ పాట వినిపిస్తే అక్కడే ఆగిపోతా.. ఈ పాటంటే అంత ఇష్టం నాకు. ఒక్క క్షణం జీసస్ అంటే
ఏదో తెలియని ఆరాధ్య భావం చిగురిస్తుంది.. ఆర్తి,
ఆరాధన, క్షమాగుణం కలగలిసిన ఈ గీతం క్రైస్తవం ఔన్నత్యాన్ని తెలిపేదే.. ఈ పాట
పాడింది ఒక బ్రాహ్మణుడు, అదే ఎస్ పి బాలుగారు.. అంత ఆరాధనగా తక్కువ పారితోషికంతో ఆయన
ఈ పాట ఎందుకు పాడారు. ఆయన క్రైస్తవుడు కాదు, పాడిన తర్వాత తన జంధ్యం తెంచుకోలేదు, నుదుటన
బొట్టూ చెరుపుకోలేదు... అంతెందుకూ నాకు ఆ పాటంటే ఎందుకు అంత ఇష్టం.. నేను క్రైస్తవుడిని
కాదే.. అది గాన మాధుర్య ప్రభావం.. అలా లాక్కెళ్లి భావంలోకి లీనం చేసేదే బాలు స్వరం..
బాలు ఇస్లామిక్ పాటలు కూడా పాడారు అది మరువగలమా.. శంకరాభరణం భక్తిరసం, సాయిబాబా పై
బాలు కురిపించిన భక్తి భావం ఇవన్నీ నాకిష్టమే..
మరి నేను హిందువును కాదుగా.. మరి బాలు స్వరానికి ఎందుకు కులాలు ప్రాంతాలు అంటగడుతున్నారు..
బ్రాహ్మణ ఆధిపత్య ధోరణికి నేనూ వ్యతిరేకమే కానీ బ్రాహ్మణులకు కాదు. ఒకటి గుర్తుంచుకోండి
పాట ఉన్నంత కాలం మనందరి గొంతుకల్లో బాలు ఉంటాడు కులమతాలకు అతీతంగా...
ఎందుకంటే బాలు స్వరం మన
అందరిదీ.. బాలు స్వరానికి కులం లేదు మతం లేదు...
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః అన్నారు పెద్దలు. గానమాధుర్యాన్ని అత్యంత నిర్మల మనస్కులైన శిశువులు గ్రోలగలరు. మానవలోకపు ఈసునసూయల గోలలు తెలియని పశువులు మధురగానాన్ని ఆస్వాదించగలవు. మనం విషప్పురుగు అని భయంతో తిట్టే పాము కూడా గానమధురిమకు పరవశిస్తుందని ప్రతీతి. మరి సృష్టిలోని జంతుకోటిలో కెల్లా మహోన్నతుణ్ణి అని విర్రవీగే మనిషి జాతిలో మాత్రం పాట కన్నా పాడే వాడి పుట్టుపూర్వోత్తరాలు మతాలు కులగోత్రాలు వగైరా లెక్కలు తేలి కచ్చితంగా మనవాడని తేలితేనే అనందించాలని నిశ్చయించుకొనేంత వివేకం ఉన్న నరపశువుల సంఖ్య హెచ్చు మరి. పాపం పశువులు గానానికి ఆనందించగలవు కాబట్టి వీళ్ళని నరపశువులు అనటం పశుజాతిని అవమానించటం అనిపిస్తుంది.
ReplyDeleteఅక్షరాలా నిజం సార్..
Delete