సనమ్
నేనే
షబ్నమ్
నేనే(PART-6)
ఈనాడులో ఉండగా నాకు విపరీతంగా ప్రేమలేఖలు
వచ్చేవి. అబ్బో అని అనుకుంటున్నారా... ఇక్కడ కూడ విషయముందండి బాబూ.. ఏ అబ్బాయికైనా
కాస్త అందంగా ఉంటే చాలు లవ్ లెటర్లు కామనే కానీ నాకు అబ్బాయిల నుండే ప్రేమలేఖలు
వచ్చేవి. నిజంగానే అబ్బాయిలు నాకు ప్రేమలేఖలు రాసేవాళ్ళు.. నాతో ఊహల తీరాల్లో
విహరించేవారు.. ఏదో తేడాగా ఉందే అని అనుకుంటున్నారా... తేడా గీడా ఏమీలేదు
అబ్బాయిలు లవ్ లెటర్లు రాసింది నిజం.. వీరికి పోటీగా అమ్మాయిలనుండీ ఇలాంటి లెటర్లు
వచ్చేవి కానీ సంఖ్య తక్కువే.. ఈ లవ్ లెటర్ల గోల ఏందబ్బా అని తలపట్టుకోకండి ఇక అసలు
విషయానికి వస్తాను. అప్పట్లో ఈనాడులో సిటీ ఎడిషన్ సెంటర్ స్ప్రెడ్ పేజీలో ప్రతి
గురువారం బ్యూటీ ఆండ్ ఫ్యాషన్ టైటిల్స్ తో రెండు పేజీల స్పెషల్ వచ్చేది. మారుతున్న
ఫ్యాషన్ పోకడలపై ఇందులో కథనాలు వచ్చేవి. అప్పట్లో నా కొలీగ్ తమ్ముడు లాంటి వాడు
పోకిరీ నవీన్ కుమార్ ఈ కథనాలకు ఇంచార్జి. ఇప్పుడాయన పోలీస్ డిపార్ట్మెంట్ లో
పనిచేస్తున్నాడు. అయితే పని ఒత్తిడి కారణంగా నవీన్ బ్యూటీ ఆండ్ ఫ్యాషన్ సిరీస్
కొనసాగించలేకపోయాడు. అప్పుడు మా సిటీ డెస్క్ ఇంచార్జి రఘుబాబు ఆ బాధ్యతను నాకు
అప్పజెప్పారు. ఒకే.. నాకు అంతగా అవగాహన లేని సబ్జెక్ట్.. అయినా సరే దీన్ని ఒక
సవాలుగా తీసుకున్నా. ప్రతి గురువారం వచ్చే స్పెషల్ కోసం రెండు రోజుల ముందే
ఆర్టికల్స్ ఇచ్చేసేవాడిని. అయితే ఈ స్పెషల్ పేజీలను నేను నా పేరుతో కాకుండా మారు
పేర్లతో రాసేవాడిని. అమ్మాయిలకు సంబంధించిన ఆర్టికల్స్ షబ్నమ్ పేరుతో అబ్బాయిల
ఫ్యాషన్ విషయాలు సనమ్ పేరుతో రాసేవాడిని. ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త మార్పులు,
సౌందర్యసాధనాలు, డ్రెస్సులు డిజైన్లు, లిప్ స్టిక్ తో పాటు మగువలు ధరించే బ్రాలలో
ఆధునిక మార్పులు ఇలా ఒకటేంటి అన్ని రకాల కథనాలు విత్ ఫొటోస్ తో ఆర్టికల్స్
రాసేవాడిని. అప్పుడప్పుడే ఫ్యాషన్ ప్రపంచంలో సత్తా చాటుతున్న అమ్మాయిల ఫోటోలు
వాడుతూ పేజీని అలంకరించేవాడిని. అప్పట్లో ఈ పేజీలో అమ్మాయిల ఫోటో పడిందంటే అదో గొప్పవిషయంగా
భావించేవారు. తర్వాతి కాలంలో టాప్ మోడల్స్ గా ఎదిగిన అనేక మంది అమ్మాయిలు అప్పట్లో
తమ ఫోటోలు పట్టుకుని నా దగ్గరకు వచ్చేవారు. మా చార్మినార్ జోన్ కార్యాలయానికి
ఎవరైనా అమ్మాయి వచ్చిందంటే గౌస్ భాయ్ కోసమే అని డిసైడ్ అయ్యేవాళ్ళు. ఇలా బ్యూటీ
ఆండ్ ఫ్యాషన్ పేజీకోసం ప్రతిగురువారం పాఠకులు ఉత్సుకతో ఎదురుచూసేవారు.
డ్రీమ్ గర్ల్ షబ్నమ్
అయితే నేను షబ్నమ్ గా బాగా పాపులర్ అయిపోయా.
చాలామంది అబ్బాయిలు ఈనాడు హెడ్ ఆఫీసుకు షబ్నమ్ కోసం లెటర్స్ రాసేవారు. ఒకసారైనా నీ
ఫోటో కూడ వేయొచ్చుగా పేపర్లో అని ఒకరు... ఫలానా డ్రెస్సు నీకూ బాగుంటుందేమో అది
వేసుకుని ఫోటో పెట్టు అని మరొకరు... నీ రాతలే ఇంత బాగుంటే నువ్వెంత బాగుంటావో అని
ఇంకొకరు.. చాలా మందైతే గాఢంగా ప్రేమించేస్తున్నామని గుండె బద్దలు కొట్టుకునేవారు.
అయితే సనమ్ కూ లవ్ లెటర్లు వచ్చేవి కానీ తక్కువే.. నెలకోసారి జీతం డబ్బులకోసం హెడ్
ఆఫీసుకు వెళితే ముందుగా ఈ ప్రేమలేఖలే నా చేతిలో పెట్టేవారు. నేను ఓపికగా చదివి
అక్కడే డస్ట్ బిన్ లో వాటిని పడేసి వచ్చేవాడిని.. అయితే ఈ అనుభవం నాకు లవర్ బాయ్
ఇమేజి తెచ్చిపెట్టింది. చాలా మంది ఫేమస్ బ్యూటీషియన్స్, మోడల్స్ తో నాకు అప్పుడే
పరిచయం. ఫ్యాషన్ షోస్ కు కూడా బాగా అటెండ్ అయ్యేవాడిని.. అయితే నేను ఈనాడును
వదిలేసిన తర్వాత బ్యూటీ ఆండ్ ఫ్యాషన్ పేజీలు కూడా ఎందుకనో కనుమరుగైపోయాయి..
కాకపొతే బ్యూటీ ఆండ్ ఫ్యాషన్ కారణంగా దాదాపు రెండు సంవత్సరాలు రంగుల ప్రపంచంలో
విహరించాను. అయితే సనమ్ నేనే షబ్నమ్ నేనే అన్న విషయం మా కొలీగ్స్ కు తప్ప బయటి
ప్రపంచానికి తెలియదు ఇప్పటివరకూ...
No comments:
Post a Comment