డిసెంబర్
6 నా జీవితాన్ని మార్చేసింది.. (PART-2)
సిటీకేబుల్ ఛానెల్ లో పని చేస్తున్నప్పుడు ఆడుతూ
పాడుతూ గడిపేవాడిని. జూపార్కులో పక్షులు జంతువులు చివరికి సీతాకోకచిలుకలు ఒకటేంటి
అన్ని వన్యప్రాణులపై స్టోరీలు చేస్తూ ప్రకృతి ఒడిలో సేదతీరే వాడిని. అవికాకుండా
సిటీలో జీవనవైవిధ్యం హస్తకళలు వంటి సాఫ్ట్ స్టోరీలు చేసేవాడిని. హాయిగా గడిచేది
జీవితం. నా టైం బాగాలేకనో ఏమో సిటీలో జరగబోయే ఒక పెద్ద ఉపద్రవం గురించి ముందుగానే
సమాచారం అందింది నాకు. అప్పట్లో మా బాస్ రవిప్రకాశ్ కు నా ఇన్ఫర్మేషన్ మీద బాగా
గురి. అంతే ఆ సంచలనం గురించి లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అవసరమైన చోట కెమెరాలు
సిద్ధం చేశారు. ఆరోజు శుక్రవారం. మక్కా మసీదులో మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం అల్లరి
మూకలు రెచ్చిపోయాయి. చార్మినార్ వద్ద కత్తిపోట్లు యధేచ్చగా జరిగాయి. పక్కనే ఉన్న
బస్ స్టేషన్లో ఇరవై బస్సులు తగులబెట్టారు. ప్రతి గల్లీలో అల్లరి మూకల దాడులను
ప్రత్యక్ష ప్రసారం చేసింది సిటీకేబుల్ మాత్రమే.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే
సిటీకేబుల్ విజువల్స్ కారణంగా సుమారు నలభై మంది నిందితులు పోలీసులకు చిక్కారు. ఇదే
నా కొంపముంచింది. సిటీ కేబుల్ కు ముందస్తు సమాచారం ఎలా వచ్చిందనే విషయం
చర్చనీయాంశం అయ్యింది. ఏదోలా మన పేరు లీక్ అయ్యింది. కొంతమంది మైండ్ లో మన బొమ్మ
ఫిక్స్ అయ్యింది. 1999 డిసెంబర్ ఆరు. బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా బ్లాక్ డే
జరుగుతోంది. సిటీ కేబుల్ తరపున నేను నా కెమెరామెన్ తేజ చార్మినార్ వద్ద డ్యూటీ
చేస్తున్నాం. సిమి గ్రూపుకు చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు దారుషిఫా
మసీదులో జరుగుతున్న సమావేశాన్ని కవర్ చేసేందుకు వెళ్ళాం. అక్కడ కొందరు మా తేజ
హిందువు అని అభ్యంతరం వ్యక్తం చేయడంతో నేనే కెమెరా తీసుకుని లోపలికి వెళ్లాను.
ఇదంతా ముందస్తు ప్లాన్ అని నేను ఊహించలేకపోయాను. లోపలికి వెళ్ళగానే దాదాపు
యాభైమంది నాపై దాడి చేసారు. నా కెమెరాతో నా తలపై బలంగా కొట్టడంతో కళ్ళు బైర్లు
కమ్మి కింద పడిపోయాను. నా కెమెరా ముక్కలు ముక్కలు అయ్యిందని మాత్రమే తెలుసు. ఎవరు
కొడుతున్నారో ఎందుకు కొడుతున్నారో తెలియదు. అదే మసీదులో ఉన్న మా పెద్దన్నయ్య
సీనియర్ జర్నలిస్ట్ ఫక్రుద్దీన్ మరికొందరు జర్నలిస్టుల కారణంగా ప్రాణాలతో
బయటపడ్డా. అంతే మరుసటి రోజునుంచి పేపర్లు క్రైమ్ రిపోర్టర్ గౌసుద్దీన్ పై దాడి
అంటూ కథనాలు రాసాయి. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత నా పై జరిగిన కాల్పులు నన్ను
సంపూర్ణంగా క్రైమ్ రిపోర్టర్ అని ముద్రవేసాయి. ఇంగ్లిష్ పేపర్లు కూడా నన్ను క్రైమ్
రిపోర్టర్ అనే రాసాయి. ఇంకేముంది హాయిగా ఆడుతూ పాడుతూ పక్షులపై జంతువులపై స్టోరీలు
చేసుకునే నన్ను సమాజం క్రైమ్ రిపోర్టర్ గా మార్చేసింది. అప్పటినుంచి నేను ఏ ఛానల్ లో
పని చేసినా క్రైమ్ విభాగంలోనే...
>> సిటీలో జరగబోయే ఒక పెద్ద ఉపద్రవం గురించి ముందుగానే సమాచారం అందింది నాకు....
ReplyDeleteమరి మీ వంతు బాధ్యతగా ఒక ఉపద్రవాన్ని నివారించటానికి మీరేమి ప్రయత్నం చేసారు? లేదా ఏమీ ప్రయత్నం చేయలేదా?
>> ప్రతి గల్లీలో అల్లరి మూకల దాడులను ప్రత్యక్ష ప్రసారం చేసింది సిటీకేబుల్ మాత్రమే....
ఇలా గ్రాఫిక్‌గా హింసను ప్రత్యక్షప్రసారం చేయటం మంచిదా? హర్షించదగ్గదేనా? మంచి జర్నలిజమేనా? సమాజశ్రేయస్సుకు ఇది భంగకరం అని అనుకుంటాను నేను.
>> కొన్ని నెలల తర్వాత నా పై జరిగిన కాల్పులు నన్ను సంపూర్ణంగా క్రైమ్ రిపోర్టర్ అని ముద్రవేసాయి...
అవునండీ అలా ముద్రలు పడతాయి. ఒక్కోక్కసారి అవి మంచి చేసినా సాధారణంగా ఇబ్బంది పెడతాయి. అటువంటి ముద్రను మీరు నిరసించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? లేదా ఆ ముద్రను తప్పక మౌనంగా అంగీకరించారా లేదా దాన్ని ఒక మం అవకాశంగా భావించారా?
శ్యామలీయం గారూ మీకు వచ్చిన సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. నేను బాధ్యత మరువలేదు. ఈ విషయాన్ని వివరంగా మరో పోస్టులో చెబుతా. మీ స్పందనకు ధన్యవాదములు.
Deleteశ్యామలీయం గారూ మీకు వచ్చిన సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. నేను బాధ్యత మరువలేదు. ఈ విషయాన్ని వివరంగా మరో పోస్టులో చెబుతా. మీ స్పందనకు ధన్యవాదములు.
ReplyDelete