మైదానంలో
అడవి చుక్కలు...(PART-7)
కనుచూపు మేరలో ఎటుచూసినా ఎర్ర జెండాల రెపరెపలు..
ఇసుకవేస్తే రాలనంత జనం.. నలువైపులా విప్లవగీతాల హోరు.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ గళం
నుండి గర్జించే విప్లవ గీతాలు... ఏం పిల్లడో ఎల్దామొస్తావా అంటూ వంగపండు గజ్జెల
ఘీంకారాలు... లారీలలో ట్రాక్టర్లలో మినీ వ్యాన్లలో ఎడ్లబండ్లలో తరలివస్తున్న జనం..
ఎర్రజెండాలు చేతబట్టి విప్లవ నినాదాలు చేస్తూ కాలినడకన తరలివస్తున్న వేలాది మంది..
యువకులున్నారు, పిల్లలున్నారు, వృద్ధులున్నారు, మహిళలున్నారు అందరిలో ఏదో తెలియని
ఉత్సాహం అంతకు మించి ఉద్వేగం. విప్లవ నినాదాలు ఇస్తూ ముందుకుసాగుతున్నారు
కొందరు... గజ్జెకట్టి నాట్యం చేస్తూ ప్రజాగీతాలు ఆలపిస్తూ నడుస్తున్నారు కొందరు..
మాసిన బట్టలతో కొందరు, గోచీ మాత్రమే కట్టిన కొందరు, చెప్పులు కూడా లేకుండా కొందరు
చెట్లు పుట్టలు దాటుకుంటూ తరలివస్తున్నారు ఒక మహా ఘట్టానికి సజీవ సాక్ష్యాలుగా
నిలిచి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని ఒక ప్రవాహమై ముందుకు సాగుతున్నారు..
రోడ్డు మీద నిలిచి చూస్తున్న నాకు గుండె ఉప్పొంగింది.. ఏదో తెలియని ఉద్విగ్నత
మనసును కమ్మేసింది. ఒక అద్భుతమైన చరిత్ర పేజీలో ఒక అక్షరంగానైనా నిలుస్తున్నందుకు
గర్వంగా ఫీలవుతూ జన సందోహంతో ఒకడిగా ముందుకు సాగుతున్నా..
2004... గుత్తికొండ గ్రామం.. గుత్తికొండ మాత్రమే
కాదు దాని పరిసర ప్రాంతాలు పూర్తిగా ఎరుపెక్కాయి.. వైయస్ ప్రభుత్వం నక్సలైట్లకు
మధ్య శాంతి చర్చలకు తెరలేసిన తొలిఘట్టమది.. చర్చలకు వీలుగా మూడునెలలపాటు ఇరువైపులా
కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. సేఫ్ పాసేజికి వీలు కలగటంతో ఆరోజు పీపుల్స్
వార్ అగ్రనేత దాదాపు పదిహేను సంవత్సరాల అనంతరం తొలిసారి జనం ముందుకు వస్తున్నారు.
ఇందులో భాగంగా ఆయన ముందుగా జనంతో కలిసి తమ ఎజెండా ఖరారు చేసుకోవాలని
నిర్ణయించుకున్నారు. దీనికి అనుగుణంగా గుత్తికొండ బిలం దగ్గర పీపుల్స్ వార్ భారీ
బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ఆర్కే మొదటిసారి కనిపించనున్నారన్న విషయం తెలిసి
జనం భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. జెమిని టివి తరపున ఆ చారిత్రక ఘట్టాన్ని
కవర్ చేసేందుకు నేను నా టీమ్ తో కలిసి గుత్తికొండకు చేరుకున్నా.. హైదరాబాద్ నుండి
ఒకరోజు ముందే అక్కడికి చేరుకున్నాం. మరుసటి రోజు సాయంత్రం ఆర్కే గుత్తికొండకు
వస్తారు. అక్కడ పీపుల్స్ వార్ సానుభూతిపరుడు ఒకాయన తన ఇంట్లో మాకు బస ఏర్పాటు
చేశారు. రాత్రి భోజనం చేసి మామూలుగానే పడుకున్నాం.. ఊరంతా మాతోపాటే ప్రశాంతంగా
నిద్దురోయింది..
ఉదయం లేవగానే బయటంతా ఏదో హడావిడి.. ఏంటా అని
బయటికి వచ్చి చూస్తే గుత్తికొండ పరిసరాలు ఎర్ర నక్షత్రాలతో గర్జిస్తున్నాయి.
సాధారణంగా ఏదైనా రాజకీయపార్టీ బహిరంగ సభకు జనాన్ని సమీకరించాలంటే ఎంత కష్టమో
తెలిసిందే. కానీ ఈ సభ సాయంత్రం ఉన్నా ఉదయం నుంచే జనం స్వచ్చందంగా తరలిరావటం చూస్తే
ఆశ్చర్యం వేసింది. సాయంత్రం గుత్తికొండ బిలం దగ్గర అమరవీరుల స్థూపం సాక్షిగా సభ
మొదలయ్యింది. అప్పటికే ఆర్కే దోర్నాల నుంచి గుత్తికొండకు బయలుదేరినట్లు సమాచారం.
తమ ప్రియతమ విప్లవనాయకుడిని కనులార చూసేందుకు జనం ఊపిరి బిగబట్టి కూర్చున్నారు. ఆ
అడవిప్రాంతమంతా జనంతో నిండిపోయింది. బందోబస్తు పేరుతో అక్కడక్కడా పోలీసులున్నా
వారితో పెద్దగా పనిలేకుండా పోయింది. నక్సల్స్ దళాలే బందోబస్తు నిర్వహించుకున్నాయి.
చీకటి పడుతున్న సమయంలో ఆర్కే తన అంగరక్షకులతో కలిసి వేదికకు చేరుకోగానే ఒక్కసారిగా
వాతావరణం మారిపోయింది. ఆయన జనానికి అభివాదం చేయగానే విప్లవానినాదాలు
నింగినంటుకున్నాయి. చాలా మంది ఆర్కేని చూసి ఉద్విగ్నతకు గురై కన్నీళ్లు
పెట్టుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ తాము చర్చలకు
ఎందుకు దిగివచ్చామో వివరిస్తూ తమ ఎజెండాను ముందుకు పెట్టారు. వేదికపై ఆర్కే ఉన్నంత
సేపు తెలియని ఉద్విగ్న వాతావరణం కొనసాగింది. ఆ సభ ముగించుకుని అదే రాత్రి
హైద్రాబాద్ బయలు దేరి వచ్చేసాం. తర్వాత పీపుల్స్ వార్, జనశక్తి నేతలు హైదరాబాద్ కు
చేరుకోవడం, వారు ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో బస చేయటం, మర్రి చెన్నారెడ్డి మానవవనరుల
కేంద్రంలో ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడం, చర్చలు విఫలమై నక్సల్స్ నేతలు సేఫ్
పాసేజి ఒప్పందంలో భాగంగా నల్లమల అడవుల్లోకి వెళ్లిపోవడం వరకు నేను స్వయంగా న్యూస్
కవరేజిలో ఉన్నా.. గుత్తికొండ సభకు నేను అటవీమార్గంలో నడుస్తున్న సమయంలో తనను తాను
పశువుల కాపరిగా పరిచయం చేసుకున్న యువకుడొకరు నాదగ్గర విజిటింగ్ కార్డు అడిగి మరీ
తీసుకున్నాడు. ఆ కథ ఏంటో వీలయితే తర్వాత ఎప్పుడైనా చెబుతా.. శాంతి చర్చలు నక్సల్స్
చేసిన చారిత్రక తప్పిదమా... వైయస్ ప్రభుత్వం ఆడిన కుటిల నాటకమా వంటి విషయాల జోలికి
నేను వెళ్ళను. అయితే చర్చల తర్వాతే నక్సల్స్ తమ సురక్షిత స్థావరమైన నల్లమలను
కోల్పోయారన్నది నిర్వివాదాంశం.. ఏది ఏమైనా ఒక చారిత్రక ఘట్టంలో భాగమైన నేను
గుత్తికొండ అనుభవాలను గర్వంగానే భావిస్తా...
>> శాంతి చర్చలు నక్సల్స్ చేసిన చారిత్రక తప్పిదమా... వైయస్ ప్రభుత్వం ఆడిన కుటిల నాటకమా...
ReplyDeleteచారిత్రకతప్పిదాలూ కుటిలనాటకాలూ ఇరుపక్షాలకూ సహజమైనవే.
నిజమేనండీ...
ReplyDelete