ఎర్రసైన్యం
కోట వేంపెంట (PART-9)
కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లోని వేంపెంట
గ్రామం గురించి చెప్పుకోకపోతే నా జర్నలిజం ప్రస్థానంలో ఒక మైలురాయిని
మిస్సయినట్టే.. నాలుగు వైపులా కీకారణ్యం మధ్యలో వేంపెంట గ్రామం. అప్పట్లో ఇక్కడ
ఎర్రసైన్యందే రాజ్యం. మావోయిస్టులు చెప్పిందే ఇక్కడ వేదం. ఆకాశాన్ని అంటే అమరవీరుల
స్థూపాలు... విప్లవ గీతాల ఘీంకారాలు.... ప్రజాకోర్టులు... బందూకుల గర్జనలతో
మావోయిస్టుల ఖిల్లాగా విలసిల్లిన నల్లమలలో ఒక చిన్న ప్రాంతమైన వేంపెంట ఎప్పుడూ ఒక
అగ్ని గుండంలా ఉండేది. ఆ ఊరు గురించి చాలా విన్నా.. ఒకసారైనా ఆ ఊరికి వెళ్లి
స్పెషల్ స్టోరీ చేయాలని చాలా సార్లు అనుకున్నా కానీ కుదరలేదు.. ఎర్రసైన్యం కోట
వేంపెంటలో అడుగుపెట్టాలనే నా కోరిక ఇక నెరవేరదేమో అనుకున్నా... దాదాపు ఆ విషయమే
మరిచిపోయా... తేదీ సరిగ్గా గుర్తులేదు కానీ 2005 మార్చినెల అనుకుంటా.. అప్పుడు
నేను జెమినిలో ఉన్నా. తేజా న్యూస్ మాకు రెగ్యులర్ న్యూస్ ఛానెల్. అప్పటికి ఇంకా
జెమిని న్యూస్ ఛానెల్ ఎయిర్ లోకి రాలేదు. ఆరోజు కర్నూలు జిల్లా రిపోర్టర్ ఆఫీసుకు
ఫోన్ చేసి వేంపెంటకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చెప్పాడు. వేంపెంటలో ఎనిమిది మంది
గ్రామస్థులను మావోయిస్టులు ఊచకోత కోశారని.. అప్పట్లో ఇలాంటి వార్తలు చాలా కామన్.
ఏమన్నా ఉంటే జిల్లా రిపోర్టర్ లే కవర్ చేసి పంపిస్తారు. నాకిదే అవకాశమనిపించి
మేనేజ్ మెంట్ కు చెప్పి కర్నూలు కు బయలుదేరా నా టీమ్ తోపాటు.. ఏ రూట్లో వెళ్ళామో
తెలియదు గానీ మధ్యలో మా రిపోర్టర్ ను పికప్ చేసుకున్నాం.హారిబుల్ జర్నీ అది..
చీకటి పడింది, చిన్న గతుకుల రోడ్డు. దట్టమైన చీకటి. కార్ హెడ్ లైట్ల వెలుగు
పడుతున్నంత దూరమే దారి కనిపిస్తోంది మా డ్రైవర్ చాకచక్యంగా మలుపులను దాటిస్తూ
డ్రైవ్ చేస్తున్నాడు. ఏదోలా ఒక ఊరికి చేరుకున్నాం. అక్కడి నుంచి వేంపెంట ఇరవై
కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా రిపోర్టర్ ముందే చెప్పి పెట్టడంతో ఆ ఊర్లో బస చేసాం.
అది ఊరా అడివా తెలియదు గానీ ఒక విశాలమైన బంగాళా లాంటి ఇంట్లో మాకు బస ఏర్పాటు
చేశారు. ఆ ఇంటి యజమాని సినిమాల్లో పెదరాయుడు టైప్ అనమాట. మాకు మంచి ఆతిథ్యం
ఇచ్చారు. మాటలను బట్టి ఆయన మావోయిస్టు సానుభూతిపరుడని అర్థమయ్యింది. వేంపెంటలో మావోయిస్టుల
చర్యను సమర్థిస్తూ మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఆ ఊరంతా అన్నలే ఉంటారు కొంచెం
జాగ్రత్తా అంటూ దాదాపు హెచ్చరించినట్లే మాట్లాడారు. ఉదయం ఏడు గంటలకు అక్కడి నుంచి
బయలుదేరాం. ఎనిమిదింటికల్లా వేంపెంటకు చేరుకున్నాం. ఎంట్రన్స్ లోనే ఒక భారీ
మావోయిస్టుల స్థూపం మాకు స్వాగతం పలికింది. ఊరంతా స్మశాన నిశ్శబ్దంలో ఉంది. మేము
ముందుగా స్పాట్ కు వెళ్ళాలి కాబట్టి ఊరు దాటి ముందుకు వెళ్లిపోయాం. కొంచెం దూరం
వెళ్ళాక వెహికల్ ఆగిపోయింది. ఎందుకంటే స్పాట్ కు వెళ్లాలంటే నడుచుకుంటూనే
వెళ్ళాలి. కాకులు దూరని కారడివి అంటారు కదా అలాంటిదే ఆ ప్రాంతం. ఇక్కడ మనుషులు
కూడా నడుస్తారా అని అనిపించింది. భారీ చెట్లు, ముళ్లపొదలు, రాళ్లు రప్పలూ
దాటుకుంటూ ఎలాగోలా స్పాట్ కు చేరుకున్నాం. అతి పాశవికంగా గొంతుకోసి చంపేసిన
ఎనిమిది శవాలు అక్కడ పడి ఉన్నాయి. శవాలను చూడటానికి గ్రామస్థులు ఎవరూ అక్కడికి
రాకపోవటం ఆశ్చర్యం కలిగించింది. తర్వాత తెలిసింది అక్కడ భూమిలో మందుపాతరలు
ఉన్నాయని. మేము పోలీసులు వెళ్లిన మార్గంలోనే నడిచాం కాబట్టి మాకేం ప్రమాదం
జరగలేదు. ఏ మాత్రం తేడా జరిగినా గాల్లో కలిసిపోయేవాళ్లమని తెలిసి గుండె ఝల్లుమంది.
సరే పోలీసులు శవాలను తరలిస్తున్న దృశ్యాలు షూట్ చేసుకుని ఊర్లోకి వచ్చేసాం.
అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియా పెద్దగా లేకపోవడంతో మేమే మెయిన్ ఛానల్. పోలీసులు
మాకు బాగానే సహకరించేవారు. ఆశ్చర్యం ఏంటంటే ఊర్లో మాతో మాట్లాడటానికి ఎవరూ ముందుకు
రాలేదు. అసలేం జరగలేదన్నట్టే వ్యవహరించారు. ఊరంతా గ్రేహౌండ్స్ బలగాలు నిండిపోయి
ఉన్నా జనం తమకు పట్టనట్టే ఎవరిపనిలో వారు కనిపించారు.చివరకు మృతుల కుటుంబాలు ఉన్న
చోటికి వెళ్ళాం. అక్కడ జనం గుమిగూడి ఉన్నా మౌనంగానే కనిపించారు. ఆడవాళ్ళ రోదనలు
మాత్రం వినిపించాయి.అతికష్టం మీద కొందరిని పలకరించి స్టోరీ కంప్లీట్ చేసుకున్నాం.
సాయంత్రం నాలుగు గంటలకు హోమ్ మంత్రి జానారెడ్డి అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా
ప్రశ్నల పరంపరతో ఆయనకు అసహనం కలిగించాననేది వేరే విషయం. రాత్రి ఎనిమిది గంటలకు
అక్కడి నుంచి హైదరాబాద్ కు బయలుదేరాం. రెండవరోజు తెలిసింది సంఘటనా ప్రాంతంలో
నక్సల్స్ అమర్చిన పదికిపైగా మందుపాతరలు గ్రేహౌండ్స్ బలగాలు వెలికితీశాయని. మేము
పోలీసులు వెళ్లిన మార్గంలోనే వెళ్ళాం గనుక సేఫ్ గా ఉన్నాం. ఏమాత్రం అత్యుత్సాహం
చూపినా గాల్లోకి కలిసిపోయేవాళ్లమని తెలిసి ఒక్కసారిగా వణికిపోయాం. అదే జరిగి ఉంటే
ఈరోజు ఈ కథనం రాసేవాడిని కాదన్నది వేరేవిషయం. మొత్తానికి వేంపెంటను సందర్శించాలనే
కల ఈ విధంగా నెరవేరింది. అసలు వేంపెంటలో ఆరోజు ఏం జరిగిందనే విషయం తెలుసుకోవాలనే
ఆసక్తి ఎవరికైనా ఉంటే యూట్యూబ్ లో Ghousuddin shaik అని క్లిక్ చేసి మొత్తం స్టోరీ
చూడొచ్చు.
No comments:
Post a Comment