Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday, 27 July 2020

మహానేత అస్తమయం ఆగిన ఓ సంచలనం(PART-19)


మహానేత అస్తమయం
ఆగిన సంచలనం(PART-19)
మీడియాలో బయటి ప్రపంచానికి తెలియని కోణాలు చాలానే ఉంటాయి. కారణాలు చాలానే ఉంటాయి ఇవి బయటికి రాకపోవడానికి. ఒక్కోసారి పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్ లు కూడా వెలుగుకు నోచుకోకుండా ఒకరిద్దరు వ్యక్తుల మధ్యనే నిక్షిప్తమై ఉంటాయి. అవి ఎన్నటికీ బ్రేకింగ్ న్యూస్ గా రూపాంతరం చెందవు. జస్ట్ ఒక జ్ఞాపకంలా స్మృతి పథంలో కదలాడుతూ ఉంటాయి. దీనికి ఒక్కరినో నిందించలేం.. ఆయా పరిస్థితులను బట్టి కొన్ని నిజాలను బయటికి చెప్పుకోలేక దాచుకోవాల్సి ఉంటుంది. తీరా పరిస్థితి దాటిపోయాక మన దగ్గర ఉన్న సమాచారం ఎందుకూ పనికిరాకుండా పోతుందనేది నిజం. అబ్బా... వార్త అప్పుడే బ్రేక్ చేసి ఉంటే ఎంతబాగుండేది అనుకుని బాధ పడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితులను చాలా మంది జర్నలిస్టులు ఫేస్ చేసినవాళ్ళే.. వారిలో నేనూ ఒకడిని.. మేనేజ్ మెంట్ నిరాకరించటం, వారి వాదనకు నేను కన్విన్స్ కావడం వంటి కారణాలతో ఒక మహా న్యూస్ మరుగున పడిపోయింది. ఏం చేయలేం, అప్పటి పరిస్థితి అంతే...అసలు విషయానికి వస్తే అవి నేను జీ 24 గంటలు ఛానల్ లో పని చేసిన రోజులు.. 2009 సెప్టెంబర్ రెండవ తేదీ ఆదివారం... రచ్చబండ కోసం అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ నుండి చిత్తూరు కు హెలికాఫ్టర్ లో బయలు దేరిన రోజు..బయలుదేరిన కొన్ని నిమిషాలకే హెలికాఫ్టర్ కు ఏటీసీ కి మధ్య సంబంధాలు తెగిపోయాయి. సియం హెలికాఫ్టర్ మిస్సయ్యిందనే వార్త ఆంధ్ర ప్రదేశ్ ను కుదిపేసిన క్షణాలవి. దేశం మొత్తం సంచలనం.. ముఖ్యంగా తమ ప్రియతమ నేతకు ఏమయ్యిందో ఆయన ఎలా ఉన్నారో అంటూ తెలుగు నేల విలపిస్తున్న బాధాతప్త ఘడియలవి. గంటలు గడుస్తున్నాయి కానీ హెలికాఫ్టర్ ఆచూకీ దొరకటం లేదు. క్యుములో నింబస్ మేఘాల కారణంగా హెలికాఫ్టర్ అత్యవసరంగా నల్లమల అడవుల్లో ల్యాండ్ అయ్యి ఉంటుందని, ముఖ్యమంత్రి క్షేమంగానే ఉండి ఉంటారని ప్రభుత్వం తరపున రోశయ్య ప్రకటించారు. అందరిలో ఆశలు రేకెత్తాయి. తమ నాయకుడు తిరిగి వస్తాడని. అడవుల్లో వైయస్ బృందం దారి తప్పి ఉంటుందనీ, ఏదో ఒక ఊరుకి క్షేమంగానే చేరుకుంటారని ఆశాభావం వ్యక్తమయింది. తెలుగు మీడియా తో పాటు నేషనల్ మీడియా రంగంలోకి దిగింది. నల్లమల పరిధిలో ఉన్న మా జిల్లా రిపోర్టర్ లు క్షణం క్షణం అప్ డేట్ ఇస్తున్నారు. మా ఛానల్ మొత్తం వైయస్ వార్తల కవరేజీతో నిండిపోయింది.మా బాస్ శైలేష్ రెడ్డి స్వయంగా లైవ్ లోకి వెళ్లి గంటల తరబడి బులెటిన్లు నడిపారు.
ఆఫీసులో నాకు పెద్దగా పనిలేకపోయింది. జస్ట్ పరిణామాలను గమనించి బ్రేకింగులు పెట్టడం డెస్క్ వాళ్ళు అడిగితే లైవ్ ఇవ్వడం వరకే నా పని. సుఖోయ్ యుద్ధ విమానాలు నల్లమలను జల్లెడ పడుతున్నాయి... సమయం గడిచిపోతోంది. అయినా వైయస్ జాడలేదు. నేను కూడా టైం దొరికినప్పుడల్లా అటూ ఇటూ కాల్స్ చేస్తూ సమాచార సేకరణకు ట్రై చేస్తున్నా.. సాయంత్రం మా బాస్ శైలేష్ రెడ్డికి ఒక విషయం చెప్పా అన్నా వై యస్ హెలికాఫ్టర్ క్రాష్ అయ్యింది అందరూ చనిపోయారు. కన్ఫర్మ్ సోర్స్ ఇది బ్రేకింగ్ చేద్దామా అని. మరుక్షణం లోనే ఆయన no అనేశారు. నీకొచ్చిన సమాచారం తప్పు కావచ్చు, తొందరపడితే తీవ్ర ఇబ్బందులు రావచ్చు, మనం వార్తను బ్రేక్ చేయలేం. అధికారికంగా చెప్పే దాకా ఎలాంటి బ్రేకింగ్ వద్దు అని అనేశారు. ఏం చేయలేని పరిస్థితి. బాస్ ఈజ్ ఆల్ వేస్ రైట్ కదా.. నిజానికి వైయస్ మరణ వార్త వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నేను కూడా పరిస్థితిని అర్ధం చేసుకుని విషయమై ఎవరితోనూ డిస్కస్ చేయకుండా మౌనంగా నా పని నేను చేసుకున్నా.. చివరకు అదే జరిగింది. పావురాల గుట్ట లో కూలిన హెలికాఫ్టర్ శకలాలు, మృత దేహాలను సుఖోయ్ యుద్ధ విమానాలు గుర్తించాయి. వైయస్ మరణ వార్త బ్రేకింగ్ ను అందరితోపాటు మేమూ వేసుకున్నాం. ఒకవేళ కొన్ని గంటల ముందే మేము బ్రేకింగ్ వేసి ఉంటే ఏం జరిగేది రిలయన్స్ ఆస్తులపై జరిగినట్టుగానే మా ఆఫీసుపైనా దాడి జరిగేది నో డౌట్.. బట్ ఒక సంచలనం అయితే నమోదు చేసేవాళ్ళం.వైయస్ మరణ వార్తతో మా ఆఫీసులోనూ విషాదం అలుముకుంది. చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకూ బాధగానే అనిపించినా నేను మెంటల్ గా ముందే ప్రిపేర్ అయ్యాను. నిజానికి మీడియా వాళ్లలో చాలామంది ఇది ఊహించారు. నాకూ వైయస్ తో ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. అవి జెమినిలో ఉన్న రోజులు. చెక్ పోస్ట్ రోడ్డులో అప్పుడు వైఎస్ నివాసముండేవారు. ఏదో విషయమై ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అప్పుడు జెమిని తరపున నేను వెళ్ళా. షూట్ అయ్యాక నీ పేరేంటి బాబూ జిల్లా అని అడిగారు, హైద్రాబాద్ సార్ అని చెప్పా, గుడ్ ఇంత చక్కని తెలుగు మాట్లాడుతున్నావ్ ఆంధ్రా అని అనుకున్నాలే చాలా బాగా మాట్లాడుతున్నావ్ అని ప్రశంసించారు. తర్వాత ఆయనను అంత దగ్గరగా ఎప్పుడూ కలుసుకోలేదు.

2 comments:

  1. >> నీ పేరేంటి బాబూ ఏ జిల్లా?
    > హైద్రాబాద్ సార్!
    >> గుడ్ ఇంత చక్కని తెలుగు మాట్లాడుతున్నావ్ ఆంధ్రా అని అనుకున్నాలే, చాలా బాగా మాట్లాడుతున్నావ్
    100% నిజం. మీ తెలుగు చాలా బాగుంది నాకు (బహుశః ఆంధ్రానుండి వచ్చినవాడిని కాబట్టే నేమో‌) సమయం చూసుకొని ఈమాట నేను అందామనుకున్నా. ఎప్పుడొ వైయస్ అనేసారన్నమాట. బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సర్.. నేను పక్కా లోకల్.. పైగా ఓల్డ్ సిటీ నేపథ్యం.. కానీ తెలుగు మీడియం లో చదువుకున్నాను. మా దివంగత అన్నయ్య సీనియర్ జర్నలిస్ట్. ఆయన ప్రభావం నాపై ఉంది. దీనికి తోడు తెలుగు నవలలు ఇతర తెలుగు పుస్తకాలు చదవటం చిన్నప్పటి నుంచి అలవాటు. అలా నా తెలుగు కొద్దిగా మెరుగుపడి ఉంటుంది. మీ స్పందనకు మరోసారి ధన్యవాదములు.. 🙏

      Delete