Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday, 22 July 2020

క్షణం క్షణం భయం భయం(PART-16)


క్షణం క్షణం భయం భయం(PART-16)


నా జర్నలిజం కెరీర్ లో నేను బాగా భయాందోళనలకు గురైన సమయం అది.. అనుక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏ నిమిషం మా వంతు వస్తుందో తెలియక ప్రతిక్షణం చస్తూ బతికిన ఘడియలవి.. కళ్ళముందే దాడులు... ప్రాణభయంతో పోలీసుల పరుగులు.. యధేచ్చగా వాహనాల విధ్వంసం... బిక్కుబిక్కుమంటూ గడిపిన రోజది... హైదరాబాద్ పాతబస్తీలో కత్తిపోట్లు కాల్పులు చూసినా చలించని నేను ఆరోజు రాయలసీమలో నాతో ఉన్నవారిని ఎలా కాపాడుకోవాలో తెలియక వణికిపోయాను..
అయితే ఇది కూడా నా కెరీర్ లో అత్యంత కీలక ఘట్టమే.. ఓ రక్తచరిత్రకు సాక్షిగా నిలిచిన కీలక పరిణామం ఇది.. అదే పరిటాల రవీంద్ర మర్డర్..
రక్తచరిత్రలో అదో సంచలనం....
2005 జనవరి 24.. అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో ఒక సమావేశానికి హాజరైన పరిటాల రవి పై డబుల్ షూటర్ మొద్దు సీను గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో పరిటాల రవి అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. జెమిని ఆఫీసులో అప్పుడే లంచ్ పూర్తి చేసుకుని స్మోకింగ్ జోన్ లో ప్రశాంతంగా దమ్ముకొడుతున్న నాకు మా అనంతపురం రిపోర్టర్ నుంచి ఫోన్ వచ్చింది. సార్ పరిటాలను చంపేశారు ఇక్కడంతా టెన్షన్ గా ఉందని.. సరే జాగ్రత్త.. ఏవీ మిస్ కాకుండా షూట్ చేయండి నేను వచ్చేస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసాను. అప్పటికే మా వాళ్ళు న్యూస్ రెడీ చేసి టెలికాస్ట్ కు ఇచ్చేసారు. నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను బ్యాగు సర్దుకోవాలిగా.. ఐదు గంటలకు క్వాలిస్ వెహికల్ ఇంటికి వచ్చింది, మాటీమ్ తో అనంతపురం బయలుదేరా..తెల్లవారు జామున అనంతపురం చేరుకున్నాం. అక్కడే మా రిపోర్టర్ కు చెందిన ఆఫీసు వంటి గదిలో ఫ్రెష్ అయ్యాం.. ఉదయం ఆరుగంటలు.. అప్పటికే ఫుల్ ఆకలి.. అనంతపురం మొత్తం బంద్ వాతావరణం. ఎక్కడా టిఫిన్ సెంటర్లు కూడా లేవు. అనంతపురం గల్లీలు అన్నీ చక్కర్లు కొడితే ఓ మూలన రూపాయి దోశ బండి కనిపించింది. వెంటనే ఓ ఆరు దోశలు తినేసా.. మా టీమ్ కూడా మంచి ఆకలిమీద ఉందేమో పదేసి దోశలు తినేసింది. చిన్నసైజులో కారం కారంగా ఉన్న ఆ దోశలు ఆ టైంలో మాకు చికెన్ బిర్యానీతో సమానం. అక్కడినుంచి పరిటాల ఇంటికి వెళ్లాం.. అక్కడి నుంచి మొదలయ్యింది టెన్షన్ మాకు. అక్కడ కనీసం కెమెరా బయటికి తీయడానికి కూడా భయం వేసింది అంత టెన్షన్ ఉంది అక్కడ. కార్ లోనుంచే అక్కడి వాతావరణం షూట్ చేసుకున్నాం.. అక్కడినుంచి హత్య జరిగిన ప్రాంతం టీడీపీ ఆఫీసుకు చేరుకున్నాం.. అక్కడ కూడా పరిటాల అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే పోలీసులు చాలామందే ఉండటంతో అక్కడ ఒక మాక్ లైవ్ షూట్ చేసుకున్నాం.. అప్పటివరకు షూట్ చేసింది అంతా హైద్రాబాద్ ఆఫీసుకు పంపించి కొంత రిలాక్స్ అయ్యాం. ఇక అసలు ఘట్టం పరిటాల అంత్యక్రియలు. పరిటాల మృతదేహాన్ని ఆయన స్వస్థలమైన వెంకటాపురంకు తరలించారు. మేమూ బయలుదేరాం. వెంకటాపురం రోడ్డుకు చేరుకున్నామో లేదో భారీ ఉద్రిక్తవాతావరణం మమ్మల్ని పలకరించింది.
దారిపొడుగునా వేలాది జనం.. పరిటాల అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అతి కష్టాంగా వెంకటాపురం శివార్లకు చేరుకున్నాం. ఇక ముందుకు కదిలేది లేదు. అప్పటికే అక్కడ యుద్ధ వాతావరణం. తమ ప్రియతమ నేత హత్యను జీర్ణించుకోలేని వేలాది మంది పరిటాల అభిమానులు మీడియాపై పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఎటు చూసినా గందరగోళం. నాకు సీన్ అర్ధమయ్యింది ఏం జరగబోతుందని.. మా డ్రైవర్ కు సైగ చేసా, అతనికి విషయం అర్ధం అయ్యింది. వెంటనే వెహికల్ గ్లాసులపై ఉన్న ప్రెస్, జెమిని స్టిక్కర్లు తీసేసాడు. కెమెరాలు, కెమెరా స్టాండ్ కనపడకుండా సీట్ల కింద దాచేసాం.. స్లోగా వెహికల్ మూవ్ అవుతోంది.. మా వెహికల్ ముందు మరో మీడియా వెహికల్ ఉంది. రెండు వాహనాలు స్లోగా ముందుకు సాగుతున్నాయి. అంతలోనే ఒక మూక దూసుకు వచ్చి మా ఎదురుగా ఉన్న వెహికల్ పై విరుచుకుపడింది. కార్లో ఉన్నవాళ్ళని బయటికి లాగి ఇష్టం వచ్చినట్లు కొట్టి కెమెరాలు పగులకొట్టారు. వాహనాన్ని తుక్కుతుక్కు చేసారు. ఇదంతా మా కళ్ళముందే జరుగుతోంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కారులోనుంచి కిందికి దిగినా దాడి తప్పదు. ఏదైతే కానీ అంటూ మేము కిందకు దిగలేదు.అయితే అప్పుడే అటుగా ఇద్దరు కానిస్టేబుల్స్ వస్తూ కనిపించారు. అంతే ఆ గుంపు దృష్టి పోలీసులపై పడింది. మా కళ్ళముందే ఆ పోలీసులను అతి దారుణంగా పరిగెత్తించి మరీ కొట్టారు. మేము కార్లోనే ఉండిపోయాం. వెంకటాపురంలో అన్ని చోట్ల విధ్వంసం కొనసాగింది. పోలీసులు సంఘటనా స్థలం నుంచి పారిపోయారని చెప్పవచ్చు. మేము మాత్రం కార్ దిగే సాహసం చేయలేకపోయాం.. ఏం చేయాలో తెలియని భయానక పరిస్థితి గంటకు పైగానే కార్లో ఉండిపోయాం. ఈ పరిస్థితిలో మాకు ఆశాకిరణంలా గద్దర్ కనిపించారు. ఆయన వెనుక చాలామంది జనం ఉన్నారు. ఆయన మా కారు దగ్గరికి సమీపించగానే కిందికి దిగేసాం.. గద్దర్ ను పలకరించి ఆయనతోపాటే పరిటాల సమాధి ప్రాంతానికి చేరుకున్నాం సురక్షితంగా.. అప్పటికే అక్కడ కొందరు మీడియా వారు ఉన్నారు. మేము కూడా అన్నీ షూట్ చేసుకుని వెంటనే అనంతపురం చేరుకున్నాం. అక్కడే ఉంటే ఏం జరుగుతుందోనని భయం మరి..అయితే పరిటాల అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలో స్వయంగా ఉన్న అనుభవంతో చెబుతున్నా.. అది ఒక ఫ్యాక్షనిస్టు నేత అంత్యక్రియల కార్యక్రమంలా అనిపించలేదు నాకు. ఒక నక్సలైట్ నాయకుడి అంతిమకార్యక్రమంలా అనిపించింది.. మరో విషయం ఏమంటే నేను జీవితంలో ఒకేసారి పరిటాల రవీంద్రను కలుసుకున్నాను. ఒకరోజు సాయంత్రం జూబ్లీహిల్స్ లోని పరిటాల ఇంటిదగ్గర ఏదో గొడవ జరుగుతోందనే సమాచారం వస్తే అక్కడికి వెళ్ళాం. తీరా చూస్తే అక్కడేమీ లేదు. అయితే అప్పటికే మా వెహికల్ పరిటాల ఇంటి గేటువరకు వెళ్ళింది. అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్న పరిటాల మమ్మల్ని లోపలికి పిలిపించి ఏం తమ్ముడూ ఎవరు మీరు ఎందుకు వచ్చారు అంటూ సౌమ్యంగానే అడిగారు. నన్ను నేను పరిచయం చేసుకుని విషయం చెప్పాను. సరే టీ తాగి వెళ్ళండి అంటూ పరిటాల లోపలికి వెళ్లిపోయారు. ఆయనను చూసి ఈయనేనా అంత ఫేమస్ ఫ్యాక్షనిస్ట్ అని అనిపించింది. చాలా సింపుల్ గా ఫ్రెండ్లీ నేచర్ తో కనిపించారు. నా జర్నలిజం కెరీర్ లో పరిటాలతో పరిచయం కొన్ని నిమిషాలే అయినా ఆయన మర్డర్ తర్వాతి అనుభవం మాత్రం జీవితాంతం గుర్తుండేదే...

No comments:

Post a Comment