ఏం
పిల్లడో ఎల్దమొస్తవా...(PART-17)
ఏం పిల్లడో ఎల్దమొస్తావా.. ఒకటేంటి ఆ గళం నుంచి
తుపాకీ తూటాలుగా దూసుకొచ్చే వందలాది గీతాలు జనం గుండెలను కదిలించిన విషయం అందరికీ
తెలిసిందే.. అందరిలో నేనూ.. నాకూ ఆ గీతాలంటే చాలా ప్రాణం. ముఖ్యంగా పక్కా
పల్లెటూరి రైతు వేషంలో వంగపండు ఆడుతూ పాడుతూ ఉంటే విప్లవ భావాలు ఎగసి గుండె
ఉప్పొంగేది.. ఒకవైపు గద్దర్ మరోవైపు ఉత్తరాంధ్ర గద్దర్ వంగపండు వీరిద్దరంటే నాకు
చాలా అభిమానం. గద్దర్ ను ఆప్పుడప్పుడు కలిసేవాడిని కానీ వంగపండును కలవడం అప్పట్లో
ఒక కల.. వంగపండు ఎక్కువగా అజ్ఞాతంలో ఉండటం కూడా ఒక కారణం.. అప్పుడప్పుడు ఎక్కడో
గ్రామీణ ప్రాంతాల్లో విలేకరులు వంగపండును ఇంటర్వ్యూ చేయడం మినహాయిస్తే ఆయన జనానికి
కనిపించడం అరుదే.. గద్దర్ భారీ బహిరంగ సభల్లో ప్రదర్శన ఇస్తే వంగపండు ఇంటింటికీ
వెళ్లి గజ్జెకట్టి పాటలు పాడటం ద్వారా విప్లవభావాలు రగిలించేవారు. అయితే వంగపండును
ఒకసారైనా కలవాలని ఆయనను ఇంటర్వ్యూ చేయాలని నాకు ఒక అందమైన కల..
అయితే తీవ్ర నిర్బంధంలో నా కల నెరవేరింది. అది
కూడా జెమినిలో ఉన్నప్పుడే.. మావోయిస్టులపై నిర్బంధం కొనసాగుతున్న సమయం. ప్రభుత్వం
తరపున తీవ్ర అణచివేత కొనసాగుతోంది. మావోయిస్టుపార్టీతోపాటు రాడికల్ యూనియన్,
జననాట్య మండలి వంటి అన్ని అనుబంధ సంస్థలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన ప్రతికూల
వాతావరణం అది.. ఆ సమయంలో పల్నాడు ప్రాంతానికి చెందిన మావోయిస్టు నేత
నర్సింహారెడ్డి కి సంబంధించిన ఒక లింక్ దొరకడంతో ఆయన్ను ఇంటర్యూ చేయాలని ట్రై
చేసా.. అతి కష్టంగా హైద్రాబాద్ విజయవాడ రోడ్డు పై రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో
ఆయనను ఇంటర్యూ చేసా.. రోడ్డు పక్కన ఓపెన్ ఏరియాలో.. అటుగా వెళ్లేవారు ఏదో రియల్
ఎస్టేట్ వెంచర్ కు సంబంధించిన షూట్ అనుకునేలా కవరింగ్ అనమాట.. నర్సింహా రెడ్డితో
మాటల సందర్భంలో తెలిసింది వంగపండు హైదరాబాద్ లోనే ఉన్నారని..
ఎలాగైనా వంగపండును కలవాలి అని డిసైడ్
అయ్యా..నాకు తెలిసిన లింక్స్ అన్ని కదిపా ఎలాగైనా వంగపండును ట్రేస్ చేయాలని...
చివరకు లింక్ దొరికింది.. అంబర్ పేట్ లోని ఒక చిన్న గదిలో వంగపండును కలిసాను.. ఆయన
సాదరంగా ఆహ్వానించారు.. విషయం చెప్పి కన్విన్స్ చేసాను. ఆయన ఓకే అన్నాకనే దూరంగా
ఉన్న మా కెమేరామ్యాన్ కు ఫోన్ చేసి పిలిపించుకున్నా.. అప్పుడు ఆ చిన్న గదిలో
వంగపండు మాకోసం గజ్జెకట్టి ఆడారు పాడారు.. అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు
ఇచ్చారు. జెమిని టివి లో వంగపండు కథనం సంచలనమే రేపింది. అవును మరి నిషేధం సమయంలో
వంగపండు ఇంటర్యూ సంచలనమే కదా.. ఇప్పుడంటే వంగపండు జన జీవన స్రవంతిలో ఉన్నారు.
ఎవరికీ పడితే వారికి ఇంటర్యూ ఇస్తున్నారు. అప్పట్లో ఆయన పల్లెల్లో మెరుపులా మెరిసి
మాయమైపోయేవారు. అప్పట్లో దాడులు ప్రతిదాడులు, కూంబింగులు, ఎన్ కౌంటర్ లు జోరుగా
సాగుతున్న కాలంలో నా అభిమాన విప్లవ కళాకారుడిని కలిసి ఇంటర్యూ చేయడం నేను ఒక
అదృష్టంగానే భావిస్తాను. అయితే తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం అని నినదిస్తూ
గజ్జెకట్టిన వంగపండు ఇప్పుడు మారిపోయారు. ఇప్పుడు ఆయన నా దృష్టిలో ఒక లొంగిపోయిన
విప్లవ కళాకారుడు మాత్రమే..
నా చిన్నప్పుడు నక్సలైట్ అంటే హీరో కన్నా ఎక్కువ వర్షిప్ ఉండేది , అదేంటో ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళు లగెత్తుకుని వచేస్తారేమో అనే పిచ్చి భ్రమ లో ఉండేవాడిని . గమ్యం సినిమా లో అల్లరి నరేష్ చెప్పినట్టు , మరీ అంత కాదు కానీ కొంచెం అలానే .
ReplyDeleteతరువాత అర్ధం అయింది , ఇదంతా ఒక పిచ్చి అని , డబ్బు సంపాదించుకునే మార్గం అని మా ఊళ్ళో కాంట్రాక్టర్ లని బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంటారని తెలిసిన తరువాత . గిరిజనులు కి కూడా దూరం అయిపోతున్నారు డబ్బు పిచ్చి లో పడి . పాత నక్సలైట్ లు బయటకి రాలేరు , కొత్త నక్సలైట్ లు , 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి , ప్రభుత్వానికి లొంగిపోయి , భూమి తీసుకుని సెటిల్ అయిపోతున్నారు .
కొంతవరకు మీరు చెప్పింది నిజమే.. చాలా మంది వ్యక్తిగత కారణాలతో నక్సలిజం లోకి చేరారు. కానీ సిద్ధాంతాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.
Delete