Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 12 July 2020

ఒకవైపు ఆర్కే మరోవైపు టైగర్ (PART-4)


ఒకవైపు ఆర్కే
మరోవైపు టైగర్ (PART-4)

జర్నలిజం లో మనం ఎంత తోపులమైనా.. మనకు వచ్చే సమాచారం ఎంత పక్కాగా ఉన్నా మన పోటీదారులు మనకంటే బలంగా ఉంటే మనం ఏటికి ఎదురీదాల్సిందే.. మనమిచ్చే న్యూస్ ఎంత వాస్తవమైనా అది తప్పు అని పోటీదారులు ప్రచారం చేస్తారు. అప్పుడు మనం పని చేస్తున్న సంస్థ మనకు అండగా లేకపోతే మన ప్రయత్నం వృధాగా పోతుంది... ఇలాంటి సంఘటన ఒకటి నా కెరీర్ లో జరిగింది.. అవి నేను జెమినిలో క్రైమ్ బ్యూరో చీఫ్ గా పని చేస్తున్న రోజులు.. తేదీ సరిగ్గా గుర్తులేదుగానీ ఆరోజు జూబ్లీహిల్స్ లో ఒక పులి హల్ చల్ చేసింది. అప్పటి డిసిపి సంజయ్ ఆ పులిని కాల్చి చంపారు. ఇక అసలు విషయానికి వస్తే ఆ రోజు ఒక ఐపీఎస్ అధికారి అప్పాయింట్ మెంట్ ఉండటంతో ఉదయం తొమ్మిదిగంటలకే ఆఫీసుకు వచ్చాను. పదిగంటలకల్లా ఆ ఆఫిసర్ ని కలవాలి. అంతలోనే ఫోన్... జూబ్లీహిల్స్ లోని ఒక సంపన్నుడి ఇంట్లో పులి దూరిందని. నిజానికైతే అక్కడికి నేనే వెళ్ళాలి ఇప్పుడెలా అక్కడ ఆ ఆఫీసరు వెయిట్ చేస్తారు అని ఆలోచనలో పడ్డాను... అంతలోనే మా లైఫ్ స్టైల్ రిపోర్టర్ చందన కనిపించింది. ఆమెకు విషయం చెప్పగానే మరేం పర్వాలేదు నేను వెళ్తా సార్ అని వెళ్ళిపోయింది కూడా.... అన్ని చానల్స్ లో లైవ్ లు బ్రేకింగులతో హడావిడిగా ఉంది. నిజానికి ఆ పులి కవరేజిలో నేనుండాలి. అయినా ఆ ఐపీఎస్ ను కలవాలనే డిసైడ్ అయ్యా.. అక్కడ ఆ అధికారితో మాట్లాడుతూ ఉన్న సమయంలోనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. అంతే ఒక్కసారిగా ఊపిరి వేగం పెరిగింది. ఎందుకంటే పులివార్త కంటే ఈ ఆఫీసర్ తో మీటింగ్ కంటే నాకు ఆ మెసేజ్ చాలా ముఖ్యం. సార్ మళ్ళీ కలుస్తా అని బయటికి వచ్చా. అక్కడినుంచే మా ఆఫీసుకు ఫోన్ చేసి విషయం చెప్పాను. వాళ్ళు వెంటనే మా md కిరణ్ గారికి ఫోన్ చేయడం ఆయన నాకు కాల్ చేయడమూ క్షణాల్లో జరిగిపోయాయి. నేను ఇచ్చిన సమాచారం మా సంస్థ పూర్తిగా నమ్మింది. అంతే అన్ని టీవీల్లో పులి బ్రేకింగ్ వార్తలు నడుస్తుంటే జెమినిలో అందుకు పూర్తి భిన్నమైన బ్రేకింగ్ న్యూస్ మైదలైంది. నల్లమల అడవుల్లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ను పోలీసు బలగాలు చుట్టుముట్టాయని బ్రేకింగ్..అప్పుడు జెమిని డెస్కులో మిత్రుడు యాజులు ఉండేవారు ఇప్పుడు సాక్షిలో ఉన్నారు ఆయనే నా బ్రేకింగ్ పాయింట్స్ ని మెరుగుపరిచేవారు. ఒక జెమినిలో తప్ప ఈ బ్రేకింగ్ ఎక్కడా రావట్లేదు. అప్పట్లో నక్సల్స్ వార్తలంటే టివి 9 లో వచ్చినవే నిజం. అప్పుడు టివి 9 లో ప్రస్తుత mla క్రాంతికిరణ్ క్రైమ్ చూస్తున్నాడు. నాకు మంచి మిత్రుడే కానీ న్యూస్ పరంగా పోటీ ఉండేది. జెమినిలో వస్తున్న బ్రేకింగ్ తప్పు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అసలు రామకృష్ణ నల్లమలలో లేనేలేడని tv9బ్రేకింగ్ నడిపింది. మా ఛానల్ లో పనిచేస్తున్న అజిత కూడ నక్సల్స్ సంబంధించిన వార్తలు కవర్ చేస్తుండేది. తను కూడా అల్లాంటిదేమీ లేదని నా సమాచారాన్ని కొట్టిపారేసింది. అయినా జెమినిలో బ్రేకింగ్ న్యూస్ ఆగలేదు. ఇలా టైం గడుస్తుండగా విప్లవకవి వరవర రావు రంగంలోకి దిగారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రామకృష్ణ కు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అప్పుడర్ధమయ్యింది అందరికీ నల్లమల లో ఏదో జరుగుతోందని.. అంతే అన్ని చానల్స్ అదే బ్రేకింగ్ నడిపించాయి. కొన్ని గంటలపాటు టెన్షన్ నడిచింది మీడియాలో రామకృష్ణ గురించి. నన్ను తప్పు అన్నవాళ్ళే నేను చెప్పిన బ్రేకింగ్ న్యూస్ నాకంటే బాగా నడిపారు.అయితే ఆ సంఘటన నుంచి ఆర్కే తప్పించుకున్నారు. తప్పించుకున్నారు అనడం కంటే తప్పించారు అనడమే కరెక్టేమో. అన్ అఫీషియల్ న్యూస్ ఏమిటంటే ఇది జరుగుతున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ లో ఉన్నారు. జెమినిలో బ్రేకింగ్ విషయం ఆయన దృష్టికి రావడంతో ఆయనే స్వయంగా పోలీసు బలగాలను వెనక్కి రావాలని ఆదేశించారని అప్పుడు టాక్. అంటే ప్రముఖుల ఎన్ కౌంటర్లు గానీ అరెస్టులు గానీ రాజకీయ ప్రేరేపితమేనని అర్ధం చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే కాల్చేస్తారు రాజకీయ అవసరాలుంటే వదిలేస్తారు. ఇప్పుడూ ఇదే కదా జరుగుతోంది. సరే అసలు విషయానికి వస్తే మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన వార్త ఏంటో తెలుసా... నల్లమలలో భారీ కూంబింగ్.. తృటిలో తప్పించుకున్న ఆర్కే..
ఇలా ఉంటుంది మీడియాలో బలమైన పోటీదారులతో ఇబ్బంది. మా మేనేజ్ మెంట్ నన్ను నమ్మింది కాబట్టే పోటీలో నిలబడ్డా.. లేకపోతే ఆ బ్రేకింగ్ న్యూస్ కాస్త ఆలస్యంగానైనా పోటీ చానల్స్ కు తెలిసేది కదా..
అప్పుడు మనం చేసేదేమీ లేక గుంపులో గోవిందయ్యలా మిగిలిపోవాల్సి వచ్చేది.

No comments:

Post a Comment