Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday, 11 July 2020

ఎన్ కౌంటర్ అయ్యేవాడిని...(PART-3)


ఎన్ కౌంటర్ అయ్యేవాడిని...(PART-3)
ఈనాడులో ఉన్న రోజులు. ఏజి యూనివర్సిటీ డేట్ లైన్ తో కంట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నా ఒక రిపోర్టర్ గా కంటే యూనివర్సిటీలో ఒక భాగంగా మారిపోయా.. సరే అసలు విషయానికి వద్దాం.. నక్సలైట్ల హవా కొనసాగుతున్న రోజులవి. క్యాంపస్ లో రాడికల్స్ రాజ్యమే నడిచేది. అప్పుడప్పుడే డే స్కాలర్స్ రూపంలో ఎబివిపి అడుగుపెడుతున్న సమయం. కానీ రాడికల్స్ ఏది చెబితే అదే వేదం. రాడికల్ యూనియన్ నాయకులతో నాకు మంచి సంబంధాలే ఉండేవి. ఏదో ఒక విషయం మీద నిత్యం ఉద్యమాలు జరిగేవి. సహజంగా మనదీ వాపపక్ష భావజాలం కావడంతో రాడికల్స్ కు సంబంధించిన ప్రతిదీ వార్తగా రాసేవాడిని. అయితే యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చారి గారికి రాడికల్స్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఆయన నాకు మంచి స్నేహితుడే. చారిసాబ్ ఎందుకు స్టూడెంట్స్ తో పెట్టుకుంటావు అని చాలాసార్లు వారించినా పిల్లకుంకలు ఏం చేస్తారు గౌస్ భాయ్ అని అంటూ ఉండేవాడు. ఒకరోజు రాడికల్స్ నుంచి నాకు ఒక ప్రెస్ నోట్ వచ్చింది. చారి కోసం తుపాకులు ఎదురు చూస్తున్నాయ్ అని దాని సారాంశం. యాజిటీస్ గా వార్త రాసేసాను. మా సిటీ డెస్కులో ఇంచార్జ్ గా ఏలూరి రఘు గారు ఉన్న సమయమది. ఆయనా వామపక్ష భావజాలం ఉన్నవారే. ఆ వార్తను ఉన్నదున్నట్టే ప్రింటింగ్ కి పంపించారు. సరే వార్త ప్రింట్ అయ్యింది. ఇటు చారి గారూ అటు రాజేంద్రనగర్ పోలీసులు నాపై కారాలు మిరియాలు నూరటం మొదలుపెట్టారు. ఏదోలా సర్ది చెప్పుకున్నా. అయితే ఆ వార్త వచ్చిన నెల రోజుల్లోపే నల్లకుంటలోని తన ఇంటికి సమీపంలో చారిగారిని నక్సల్స్ కాల్చి చంపేశారు. అప్పుడు మొదలయ్యాయి నాకు కష్టాలు. ఇదిలా ఉండగానే చారి హత్యకేసును సంబంధించి బి హాస్టల్ నుంచి ఇరవైమంది విద్యార్థులను రాజేంద్రనగర్ పోలీసులు అర్ధరాత్రి పట్టుకుపోయారు. కానీ అధికారికంగా మాకేం తెలియదు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఆ విద్యార్థులు ఎక్కడున్నారు పోలీసులు వారిని ఎలా చిత్ర హింసలు పెడుతున్నారు అనే పక్కా సమాచారం అందింది నాకు. మనం ఊరుకోముగా "విద్యార్థుల నరాల్లోకి విద్యుత్ షాక్ " అంటూ వార్త రాసేసాను. ఈనాడు సిటీ ఎడిషన్ లో బ్యానర్ ఐటంగా వచ్చింది ఆ వార్త. దీంతో పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పుడే రాజేంద్రనగర్ పోలీసులనుంచి నాకు బెదిరింపులు మొదలయ్యాయి. జర్నలిస్టు రసూల్ లాగానే గౌస్ ను కూడా ఎంకౌంటర్ చేయాలి అంటూ డిసిషన్ కు వచ్చేసారు. అయితే అప్పట్లో మా అన్నయ్య సీనియర్ జర్నలిస్ట్ ఫక్రుద్దీన్ ఈనాడులో రాజేంద్రనగర్ రిపోర్టర్ గా చేస్తున్నారు. ఆయనకు ఒక ఎస్సై ద్వారా విషయం తెలిసింది. తెలిసిన వేంటనే ఆయన ఇంటికి హుటాహుటిన వచ్చి నాకు ఫుల్లు క్లాస్ తీసుకున్నాడు. ఆ వెంటనే చిన్నపిల్లాడిలా ఏడ్చాడు నిన్ను చంపేస్తారురా అంటూ. ఒక పది రోజులు అన్న ఆజ్ఞ మేరకు ఇంటినుంచి బయటకు వెళ్ళలేదు. ఆఫీసులో కూడా జాగ్రత అంటూ భరోసా ఇచ్చారు. తర్వాత అన్న ఏం చేసాడో తెలియదు ఎవరిని బతిమాలుకున్నాడో తెలియదు. పోలీసులు శాంతించారు. కొద్ది రోజుల్లోనే నన్ను ఎన్ కౌంటర్ చేస్తా అని పంతం పట్టిన డిఎస్పీ ట్రాన్స్ ఫర్ అయ్యారు. మనం యధావిధిగా మళ్ళీ రంగంలోకి దిగాం. మరో విషయం ప్రజా యుద్ధ నౌక గద్దర్ తో నాకు తొలి పరిచయం ఏజి యూనివర్సిటీలోనే...
(యూనివర్సిటీ పరిపాలనాభవనం ఎదుట పిక్)

2 comments:

  1. >> సహజంగా మనదీ వాపపక్ష భావజాలం కావడంతో రాడికల్స్‌కు సంబంధించిన ప్రతిదీ వార్తగా రాసేవాడిని...
    ప్రతివిషయమూ వార్త ఎందుకవుతుందీ, ప్రజాప్రయోజనమూ ప్రజావసరమూ వంటివి పరిశీలించి కేవలం వార్తగా పనుకొచ్చేవే వ్రాయవలసింది. అదీ‌ కాక కొన్ని వార్తల వలె అనిపించేవి ప్రమాదకరమైన సంగతులతో‌ కూడి ఉన్నప్పుడు అధికారులకు తెలియజేయటం‌ పౌరబాధ్యత కదా, జర్మలిష్టు ఐనంత మాత్రాన ఆబాధ్యత మారిపోదే. సరే, ఈ‌అత్యుత్సాహం ఎలా గొంతుమీదకు తెచ్చిందో‌ మీరే చెప్పారు కదా!

    ReplyDelete
  2. నా దృష్టిలో వార్త సమాజంలో జరిగే సంఘటనలకు అద్దం వంటిదే. ఒక మర్డర్ జరిగితే అది చెడు కాబట్టి రాయకుండా ఉండలేం కదా. యూనివర్సిటీలో రాడికల్స్ మీటింగ్ అయినా శాస్త్రవేత్తల సెమినార్ అన్నా నాకు వార్తే. అందుకే అలా రాసుకుంటూ పోయాను. మీ స్పందనకు ధన్యవాదములు.

    ReplyDelete