Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday, 21 July 2020

బై బై ఈనాడు (PART-14)


బై బై
ఈనాడు (PART-14)
నాకు జర్నలిజంలో ఓనమాలు నేర్పింది ఈనాడే.. ఇక్కడే నేను జర్నలిజానికి బాటలు వేసుకున్నాను.. అద్భుతమైన సంఘటనలు ఎన్నో గొప్ప అనుభవాలు ప్రముఖుల పరిచయాలు ఇక్కడే మొదలయ్యాయి. క్రైమ్ అనిల్, జగన్, వెంకటాచారి, మల్లికార్జున్,నాగరాజు,దూద్ బౌలీ రమేష్, నవీన్ కుమార్, త్రిశీర్ బాబు... ఇలా అందరం ఎంతో స్నేహంగా కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్ళం. అప్పుడు మా అన్న ఫక్రుద్దీన్ మాకు పెద్ద దిక్కు. అయితే ఇక్కడ మేమంతా కంట్రీ బ్యూటర్లం. రాసిన వార్త అచ్చయితే సెంటీమీటర్ కు అరవైపైసల చొప్పున నెలకు పారితోషికం ఇచ్చేవాళ్ళు. అప్పట్లో వెయ్యి రూపాయలు లైన్ అక్కౌంట్ వస్తే అదే గొప్ప. అయితే మేము మాకు నిర్దేశించిన ఏరియా పరిధిలోనే వార్తలు రాయాలి. సిటీ స్థాయి వార్తలేమన్నా రాస్తే పెద్ద చిక్కు వచ్చిపడేది. హెడ్ ఆఫీసులో కూర్చునే బ్యూరో పెద్దలకు కోపం వచ్చేది. నేను రాసే యూనివర్సిటీ వార్తలు రాష్ట్రవ్యాప్తంగా అవసరమయ్యే వార్తలు గనుక సమస్య ఉండేది కాదు. కానీ అప్పుడు నేను ఓల్డ్ సిటీలోని జహానుమా డేట్ లైన్ తో కూడా వార్తలు రాసేవాడిని. ఎంతసేపూ మురికి కాలువలు రోడ్లు బాగాలేవు అంటూ వార్తలు రాసేవాడినన్నమాట. కానీ ఎంతసేపు బావిలో కప్పలా ఉంటాం. అప్పుడప్పుడు మజ్లిస్ అంతర్గత విషయాలు, సాలార్ సలావుద్దీన్ ఒవైసీకి సంబంధించిన వార్తలు రాసేవాడిని.ఈ వార్తలు సిటీ ఎడిషన్ మొదటి పేజీలో వచ్చేవి. దీంతో మా బాస్ సిటీ నర్సింహారావు గారికి కోపం వచ్చేది. ఎందుకంటే అప్పట్లో మజ్లిస్ పార్టీ వార్తలు అంటే నర్సింహా రావు గారే రాయాలి... ఫలితంగా నెలకు ఒక సారైనా ఆయన ఫోన్ చేసి నన్ను తిట్టేవారు. ఇక కర్ఫ్యూ సమయంలో నేను రాసేవార్తలకు బ్యూరో ఇచ్చిన వార్తలకు కూడా తేడా ఉండేది. అప్పుడూ సమస్యలే. ఏమన్నా ఉంటే నాకు చెప్పు గౌస్ తొందరపడి రాసి పంపకు అంటూ మా క్రైమ్ ఇంచార్జి గోవింద్ రెడ్డి స్మూత్ గా చెప్పేవారు. అయితే డెస్కు వాళ్ళు ఎప్పుడూ మా పక్షమే. ముఖ్యంగా రఘుబాబు గారు, విష్ణు గారు... వినయ్ కుమార్ అని ఒకతను డెస్క్ లో ఉండేవాడు చాలా కంత్రీ.. సరే ఇదిలా ఉంటే ఈటీవీ ఛానల్ లాంచ్ అయ్యింది. దానికోసం కూడా మేమే స్టోరీలు చేయాలి. మాకు వి హెచ్ ఎస్ క్యాసెట్లు ఇచ్చి స్టోరీస్ చేసి పంపమనేవారు. స్టోరీ టెలికాస్ట్ అయితే వందరూపాయలు మా ఖాతాలో పడేవి. నాకు అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉంది కదా రెగ్యులర్ స్టోరీస్ చేసి పంపించేవాడిని..మా మిత్రుడు Kygiriraj GiriraJ
ఎక్కువగా స్టోరీస్ షూట్ చేసి ఇచ్చేవాడు. ఇది మేనేజ్ మెంట్ కు బాగా నచ్చింది. ఇదిలా ఉండగా దిల్ షుక్ నగర జోన్ ఆఫీసులో మా అందరికీ ఒక ముఖ్య సమావేశం ఏర్పాటు చేసింది మేనేజ్ మెంట్.. ఆ సమావేశంలో నన్ను ఈటీవీ అన్నదాత కార్యక్రమానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా తీసుకుంటున్నట్టు ప్రకటించారు.. మా సిటీ స్ట్రింగర్స్ ఫుల్ హ్యాపీ..అందరూ దావత్ కావాలంటూ హంగామా చేసారు... అలా రోజులు గడిచాయి కానీ నేను ప్రమోషన్ కు నోచుకోలేదు. తర్వాత తెలిసింది ఏమిటంటే నేను ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడిని కాదనే ఒకే ఒక్క కారణంతో నాకు బదులు వేరేవారికి అక్కడ పోస్టింగ్ ఇచ్చారంట. అప్పుడు బాధ కలిగింది.. అప్పుడే డిసైడ్ అయ్యా ఇక ఈనాడును వదిలేయాలని.. ఇంతలోనే ఒకరోజు మా జోన్ ఇంచార్జ్ వినయ్ కుమార్ తో గొడవ.. ఇక్కడ మా మిత్రుడు మ్యాడం మధుసూదన్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన గతం లో నాతోపాటు ఈనాడులో చేసినవ్యక్తే.. వినయ్ తో గొడవ జరిగినరోజే మధు ఫోన్ చేశారు. ఇలా జరిగింది అన్నా అని చెప్పా.. ఆయన వెంటనే మరేం పరవాలేదు ఇప్పుడే మా ఆఫీసుకు వచ్చెయ్ అన్నారు. నేను వెంటనే అక్కడికి వెళ్ళా.. అదే సిటీ కేబుల్ ఆఫీస్. మధు రవి ప్రకాష్ గారిని పరిచయం చేయడం, నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ఒక గంటలో జరిగిపోయాయి. ఇలా నేను మధు కారణంగా ఎలక్ట్రానిక్ మీడియాలో తొలి అడుగులు వేసాను...

4 comments:

  1. ప్రాంతాల వివక్షత వలెనే మీకు ప్రమోషన్ రానట్టయితే , మీరు ఈనాడు పేరు కూడా ఎత్తాల్సిన అవసరం లేదు . అందులో చేసినందుకు సిగ్గుపడుతున్నాను అని బ్యానర్ పెట్టి రాసేయండి . నాది ఆంధ్రానే , కానీ ఈ వివక్షత దారుణం. మా కజిన్ ఈనాడు లో పనిచేసేవాడు , ఆల్మోస్ట్ ఇంక బ్రాంచ్ హెడ్ అవుతాడు అనుకునేలోపు , ఎవరో హైదరాబాద్ నుండి మానేజ్మెంట్ మనిషి వచ్చి జాయిన్ అయ్యాడు . జీతం తక్కువ , చాకిరీ ఎక్కువ , అందులో ఈ వివక్ష . మరుసటి రోజే రాజీనామా చేసేసాడు , మూడు కంపెనీ లు తరువాత సెంట్రల్ govt జాబ్ తెచ్చుకుని సెటిల్ అయిపోయాడు . కర్మ వాళ్ళని వెంటాడుతుంది .

    ReplyDelete
    Replies
    1. నేనలా అనుకోలేను. ఎందుకంటే నేను జర్నలిజం తొలి అడుగులు వేసింది ఈనాడు నుంచే. అక్కడ వివక్షత తీవ్రంగా ఉన్న మాట నిజమే. అంత మాత్రాన నా కెరీర్ నుంచి ఈనాడును డిలీట్ చేయలేను కదా. మంచిని మంచిగా చెడును చెడుగానే చెప్పుకుందాం. వివక్షత పాటిస్తున్నవారు సిగ్గుపడాలిగానీ మనకెందుకు సిగ్గు.

      Delete
  2. పోనీయండి. ఒక చెడు పరిణామం మరొక మంచికి దారితీసింది. అంతా మన మంచికే అని అనుకోవాలన్న మాట. సంతోషం.

    ReplyDelete
    Replies
    1. అంతే సార్
      అలాగే అనుకోవాలి కదా
      ఏదైనా మన మంచికే...

      Delete