నాకు కోపం రావట్లేదు
రోడ్డు మీద అడ్డం దిడ్డంగా
పరుగులు తీస్తున్న ఆటోలను చూసి నాకిప్పుడు కోపం రావటం లేదు నాకు తెలుసు ఆ ఆటోవాల జీవనోపాదికి
టైమ్ చాలా తక్కువని...
ఆటోలో ఒకరిపై ఒకరు కూర్చున్న
పదిమందిని చూసి కోపం రావటం లేదు
నాకు తెలుసు సోషల్ డిస్టెన్స్
కన్నా టైమ్ లోపల గమ్యం చేరడమే వారికి ముఖ్యమని...
బారులు తీరిన వాహనాల ట్రాఫిక్
జామ్ చూసి కోపం రావటం లేదు
నాకు తెలుసు అదంతా బతుకుపోరాటంలో
భాగమని...
షాపులవద్ద డిస్టెన్స్ పాటించని
జనాలను చూసి కోపం నాకు రావటం
లేదు
నాకు తెలుసు అదంతా తిండిగింజల
ఆరాటమని...
రోడ్డును ఆక్రమించి తోపుడు
బళ్ళను పెట్టిన పండ్లు కూరగాయల వ్యాపారులను చూసి నాకు కోపం రావటం లేదు
నాకు తెలుసు అవి అమ్ముడుపోతేనే
ఆ బడుగుల ఇంట్లో పొయ్యి వెలుగుతుందని...
రోడ్డు మీద గుంపులుగా నిలిచిన
అడ్డాకూలీలను
చూసి నాకు కోపం రావటం లేదు
నాకు తెలుసు ఎక్కడైనా పని
దొరకకపోదా అని వాళ్ళు ఆశతో ఎదురుచూస్తున్నారని...
సడలింపు టైమ్ లో జనసమూహలను
చూసి నాకు కోపం రావటం లేదు
నాకు తెలుసు అది నిరుపేద
భారతం ఆకలి పోరాటమని...
No comments:
Post a Comment