మా అమ్మ
మా ఇంట్లో మల్బరీ చెట్టు
పండ్లు మా అమ్మకు చాలా ఇష్టం.. కింద పడిన పండ్లను ముట్టుకునేది కాదు.. స్వయంగా చెట్టు
కొమ్మలను వంచుతూ తాజా తాజా పండ్లను తెంపుకుని తినేది. బాగా పండి నల్లగా మెరిసే పండ్లంటే
అమ్మకు మరీ మరీ ఇష్టం.. చిన్న పిల్లలా కొమ్మల మధ్య తిరుగాడుతూ మల్బరీ పళ్ళను తినేది.
పళ్ళ రసం తో ఎర్రగా మారిన పెదాలతో బోసిగా నవ్వులు కురిపించే అమ్మను చూస్తే ఎంతో ముచ్చటేసేది...
అమ్మ ఎప్పుడో వెళ్ళిపోయింది
తిరిగిరాని లోకాలకు.. ఆ చెట్టు మాత్రం పూత
పూస్తూనే ఉంది. ఎప్పటిలాగే మధురమైన పండ్లు ఇస్తూనే ఉంది... కానీ అమ్మ మాత్రం లేదు.
చాలా వరకు మల్బరీ పండ్లు నేలపాలవుతున్నాయి... ఇప్పుడు ఆ చెట్టుపై వాలుతున్న పక్షుల్లోనే
అమ్మ కనిపిస్తోంది..ఓ కోయిల బాగా పండిన పండ్లను ఏరికోరి తింటుంటే అచ్చం మా అమ్మ కూడా
ఇలాగే చేసేది కదా అని అనిపిస్తోంది. పక్షులు,
ఉడుతలు పండ్లలో తీయని బాగాన్నే తింటూ మిగతా బాగాన్ని కింద పడేస్తున్నాయి. అమ్మ కూడా
ఎప్పుడూ ఇలా పండ్లను కొరికి పడేసేది. ఆ పక్షుల్లో ఒక పక్షిగా అమ్మ కూడా వచ్చిందా అనే
భ్రమ కలుగుతోంది... పండ్ల బరువుతో కిందికి వంగిన కొమ్మలతో భారంగా కనిపిస్తున్న మల్బరీ
చెట్టును చూస్తుంటే అమ్మ రూపమే మదిలో కదలాడుతోంది... నా మంచి చెడును నా కోణంలో అర్ధం
చేసుకునే నా మంచి నేస్తం అమ్మ ఎందుకో ఈరోజు బాగా గుర్తుకు వస్తోంది 😰
No comments:
Post a Comment