తోలుపక్షి
ఇదేంటీ నా అడుగుల సవ్వడికే
దుమ్ము లేస్తోంది...
ఆ ఎండుటాకులు ఎందుకు సుడిగాలిలో కలిసిపోతున్నాయి...
సగం విరిగిన ఆ కపాలం ఎందుకు
రెక్కలు విచ్చిన పక్షిలా ఎగిరిపోతోంది...
ఆ కంకాళం ఎందుకు గజగజ వణుకుతూ
ఎక్కడికో పారిపోతోంది...
నాకేం అర్ధం కాక అయోమయంగా
చూస్తున్నా ఇక్కడేం జరుగుతోందని...
కర్ణ కఠోర హాహాకారాలు
గుండెలదిరే ఆర్తనాదాలు
ఒక్కసారన్నా వినాలనీ
దేవుడెలాగూ కనిపించడు
దయ్యాలనైనా చూడాలని
నిశి నీడల మాటున
స్మశాన వీధుల్లో శోధిస్తున్నా...
దయ్యాలున్నాయేమో
ఎందుకో నన్ను చూసి పారిపోతున్నాయనిపించింది...
ఓ చెట్టు కొమ్మకు తలకింద
వేలాడుతూ బిక్కుబిక్కు మంటున్న తోలుపక్షిని అడిగా నీ నేస్తాలు దయ్యాలు ఎక్కడనీ...
నిన్ను చూడగానే అవి పారిపోయాయని
బదులిచ్చింది ఆ పక్షి...
ఇదేంటీ నేనేం చేశాను అంటూ
బిక్కమొహం వేసా...
నువ్వు మనిషివి కదా
ఆ దయ్యాలను మించిన వక్ర
బుద్ధులు మీకున్నాయి
అందుకే ఇప్పుడు నా నేస్తాలు
మనుషుల్ని చూసి దడుచుకుంటున్నాయని
కన్నీరు పెట్టుకుంది పాపం
ఆ తోలుపక్షి...
విజయగర్వంతో వెనక్కి తిరిగా
చిద్విలాసంగా నవ్వుకుంటూ....
No comments:
Post a Comment