Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 25 January 2015

ఈ దేవుడు నాకొద్దు...



ఈ దేవుడు నాకొద్దు...


కళ్ళు జిగేల్ మనిపించే కాంతి ...
ఎటుచూసినా దూదిపింజాల్లా తేలియాడుతున్న మబ్బులు...
పాదాలకింద నేల లేదు...
అవును నేను మేఘాల్లో తేలుతున్నాను...
నాలాగా అక్కడ చాలామందే ఉన్నారు...
పాలమీగడ లాంటి వస్త్రాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు...
అప్పుడు తెలుసుకున్నాను నేను మరణించానని...
ఎవరో నా లెక్కలు తీస్తున్నారు....
ఏవేవో చెబుతున్నారు...
కళ్ళు పెద్దవి చేసుకుని చూశాను
పుట్టిన నాటినుంచి ఇప్పటి దాకా
తప్పించుకుని దాక్కున్న దేవుడు కనిపిస్తాడేమోనని...
దేవుడు ఏ రూపంలో ఉంటాడు...
ముస్లింలు ప్రార్థించే అల్లా రూపంలోనా...
సతీసమేతుడైన శ్రీ రాముడి రూపంలోనా ...
శిలువధారి జీసస్ రూపమా...
మరే రూపంలోనైనా...
నా ఆసక్తికొద్దీ అటు ఇటూ చూసాను ...
చూస్తూనే ఉన్నాను...
భూమి మీద పాపులర్ అయిన ఏ రూపమూ లేదక్కడ...
అయినా ఎవరో ఉన్నారక్కడ...
నా తప్పులే లెక్కిస్తున్నారు...
కొద్ది సేపు ఆ కనిపించని రూపాన్నే దేవుడనుకున్నాను...
అంతే ...
దేవుడు ఎదురుగా ఉన్నాడనే భావన కలగగానే
నాలో గూడు కట్టుకున్న కసి లావాలా ఉబికి వచ్చింది...
నాలో రగులుతున్న ప్రశ్నలు బాణాల్లా దూసుకు వచ్చాయి...
ఓయీ దేవుడా ఏ రూపము నీది...
ఎందుకు పుట్టించావు మనుషుల్ని...
కసిగా ఆడుకుంటున్నావు జీవితాలతో శాడిస్ట్ వి కాదానువ్వు...
నువ్వున్నావనీ న్యాయం చేస్తావనీ నమ్ముకుంటే ఏమీ చేయలేక
జీవితాన్నే ముగించేస్తావు...
ఖురాన్ పారాయణంతో నిత్యం నమాజులో మునిగి తేలేది నా వాళ్ళే...
హైందవానికి ప్రతిరూపమై దుర్గను తల్లిలా కొలిచే ఓ మనసూ నా మనసే...
నమాజుకు తలవంచాను...
రాముడికి ప్రణమిల్లిన చేతులను ముద్దాడాను...
అందరు దేవుళ్ళను సమానమని నమ్మాను...
మానవతను మించింది లేనే లేదని అనుకున్నాను...
నమాజులో కుట్రలు
పూజలో ఆవేశాలు నా గుండెను ముక్కలు చేస్తోంటే
ఎందుకు చూస్తూ ఊరుకున్నావు...
కుట్రలు కుతంత్రాలతో నా జీవితాన్ని నాశనం చేసిన
బడాచోరులను వదిలేసి నన్నే ఎందుకు చంపేసావు...
ఎప్పుడో చచ్చినాక తప్పులు లెక్కించే నువ్వు
మరి బతికించటం ఎందుకు...
నీ ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదని అంటారు
మరి ఈ తప్పులన్నీ నువ్వే చేయిస్తున్నావా...
నీవి కావా ఈ తప్పులన్నీ...
నీ తప్పులే లెక్కిస్తే నిన్ను ఎలా శిక్షించాలి...
జీవించినంత కాలం నరకమే చూపి
ఇప్పుడు తప్పొప్పులు లెక్కిస్తావు
జీవితం కంటే పెద్ద నరకం ఉందా నీ దగ్గర...
మంచికీ చెడుకీ నువ్వే కారణమయితే
మాకెందుకు నీ లెక్కలు...
దుర్మార్గులకు జల్సాలు
మంచి మనసులకు కష్టాలు...
మంచి వాళ్లకు స్వర్గమంటారు
బతికినప్పుడు అనుభవించిన నరకయాతనను మరిపిస్తుందా నీ స్వర్గం...
అలాంటి స్వర్గం నా కెందుకు చెప్పు...
ఏ రూపమూ లేని నువ్వు
కనిపించే మా రూపాలతో ఆడుకుంటూ ఉంటే
మేము బొమ్మలుగానే మిగిలిపోవాలా...
ఇదే నీ న్యాయమయితే
ఇదే నీ చట్టమయితే
నీ లాంటి దేవుడు నాకయితే వద్దు...
రూపవిహీనమయిన దేవుడు
మౌనముద్రలోకి జారిపోక తప్పలేదు...
అంతలోనే ఎదో అలికిడి...
కళ్ళు తెరిచి చూశాను...
స్వప్నం చెదిరిపోయింది
మనస్వినీ...

No comments:

Post a Comment