మనసుమైదానం
ఏమిటీ ప్రకంపనలు
ఎక్కడా ఈ విస్ఫోటనాలు
ఏమూలనుంచి ఈ విధ్వంస తరంగాలు
ప్రశాంతమైన నా వదనం ఎందుకు
రంగులు మారుతోంది
వెన్నెల కురిసే కన్నులు
ఎందుకు తడి పూసుకుంటున్నాయి
దేహం ఎందుకు సత్తువ కోల్పోతోంది
ఏమయ్యిందో ఏమో అని
భయం భయంగా
నా మనసు మైదానంలోకి
తొంగి చూసాను
అంతటా క్రూరమైన నల్లని
చీకటి అలుముకుని ఉంది
ఎక్కడి నుంచో ఏవో తీక్షణమైన
మెరుపులు
ఒకదానినొకటి ఢీ కొట్టుకుంటూ
విధ్వసం సృష్టిస్తున్నాయి
అవి పరస్పర విరుద్ధ భావాజాలాలేమో
అలుపెరుగక కొట్టుకుంటున్నాయి
యుద్ధంలో జారిపడిన నిప్పుకణికలకు
కాలిందేమో మనసు మైదానం
అంతటా కమురు వాసన ఆవరించింది
భయంతో వణికిన నేను
నా మనసులోనుంచి
బయటికి పారిపోయి వచ్చేసాను
ఇంత అల్లకల్లోలమా
అనుకుంటూ మనసు తలుపులను
మూసివేసి
ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నా
యుద్ధంలో ఓడిన సేనానిలా...
No comments:
Post a Comment