యముని మహిషపు లోహగంటలు
అదిగో అక్కడ నట్టింట్లో
పీనుగులు విశ్రాంతి తీసుకుంటున్నాయి
జీవమున్న శవాలు
భయంతో పరుగులు తీస్తున్నాయి...
ఒకటేంటి
అంతటా శవాలు కచేరీ చేస్తున్నాయి
మృతదేహాల కరాళ నృత్యానికి
భూకంపం వచ్చిందేమో
కొంపలు కుప్పకూలుతున్నాయి...
అక్కడేమో
మనసున్న మారాజు
మనసులో మాటంటూ
మాయమాటలు చెబుతూ
ఇంద్రభవనానికి
నగిషీలు అద్దుతున్నాడు...
వందిమాగదులేమో
జయజయ కీర్తనలు పాడుతూ
అబ్బురపరిచే కొత్త శాస్త్రాలు
రాస్తూ
ఇంకా బతికున్న జీవుల నెత్తిమీద
రుద్దుతున్నారు...
పశువుల పేడతో చికిత్సకు
శ్రీకారం చుట్టి
గోమూత్రంతో వ్యాక్సిన్
పుట్టించి
పాత సైన్స్ ను గోవులకు
దాణాగా వేస్తున్నారు...
ఇక్కడ ఎవడి పాట వాడు పాడుతున్నాడు
ఎవడి లెక్కలు వాడు చెబుతున్నాడు...
పాపం
ఎందుకూ పనికి రాని
అభాగ్య జీవుల చెవుల్లో
నాటి చప్పట్లు తాళాలు
తపేళాల చప్పుళ్ళు
ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి
యముని మహిషపు
లోహగంటల్లా...
No comments:
Post a Comment