Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 2 May 2021

బాల్యం వెక్కిరిస్తోంది

 

బాల్యం వెక్కిరిస్తోంది

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదు.. ఎందుకో నా బాల్యం కళ్ళ ముందు తిరుగుతోంది.. నా బాల్యాన్ని తలుచుకుంటే అప్పుడే నేను తృప్తిగా జీవించానేమో అని అనిపిస్తోంది. అలాగని నా బాల్యం అద్భుతంగా సాగలేదు, అన్నీ కష్టాలే.. అప్పుడు నేను మూడో తరగతిలో ఉన్నానేమో.. మా నాన్న చనిపోయారు. అప్పటిదాకా బాగానే సాగిన జీవితం రోడ్డుపాలయ్యింది. అప్పటికి మాకు సొంత ఇల్లు కూడా లేదు. తడికల గుడిసెలో తలదాచుకునే దుస్థితి. మేము ఐదుగురం పిల్లలం అమ్మ... బతుకు భారమంతా మా అన్నల మీద పడింది. అరకొర సంపాదన.. కష్టమైన జీవితం. కానీ నేను చదువు ఆపలేదు. పక్క ఊరిలో బడికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. కాళ్లకు ప్లాస్టిక్ చెప్పులు.. ఆ చెప్పులు చేసిన గాయాల బాధను దిగమింగుతూ కాలినడకన వెళ్ళేవాడిని. అయితే మా బతుకులు నన్ను నిత్యం వేదనకు గురి చేసేవి. వయస్సు పెరుగుతున్న కొద్ది నేను కూడా ఇంటికి అంతో ఇంతో తోడ్పాటు అందించాలని ఆరాటపడేవాడిని. ఈ క్రమంలోనే కాటేదాన్ లోని ఒక మోటార్ వైండింగ్ షాపులో కొన్నాళ్ళు పని చేసా వారానికి యాభై రూపాయలు వచ్చేవి. కొంతకాలం మాంసం నుంచి ప్రోటీన్ లు విడదీసే ఒక కంపెనిలో పని చేసా నైట్ డ్యూటీలో... జీతం నెలకు ఏడు వందలు.. తర్వాత బిస్కట్ కంపెనీలోనూ పని చేసా. జల్ పల్లి నుంచి కాటేదాన్ కు నడిచే వెళ్ళేవాడిని.ఇక టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడైతే ఆటో కూడా నడిపా.. పగలు స్కూలు రాత్రి ఆటో.. డబ్బులు బాగానే వచ్చేవి. ప్రతి పైసా అమ్మకు ఇచ్చేసేవాడిని.. తృప్రిగా ఉండేది నేనూ కొంత ఇంటి భారం మోస్తున్నానని.

అప్పుడు పెద్దన్నయ్య ఫక్రుద్దీన్ ఉదయం పత్రికలో చార్మినార్ ఏరియా రిపోర్టర్ గా పని చేస్తున్నారు. చిన్నన్న జహంగీర్ లారీ క్లీనర్ గా పనిచేసేవారు. వారిద్దరి సంపాదనే మాకు జీవనాధారం. అయితే నేనూ చిల్లర డబ్బులు సంపాదించి అమ్మకు ఇవ్వడం ద్వారా తృప్తి పడేవాడిని. అది పెద్ద సంపాదన కాకపోవచ్చు కానీ ప్రతి పైసా ఇంట్లో ఇచ్చేసేవాడిని. కడుపుకు ఆకలేస్తే ఒక డబల్ రొట్టె తిని నీళ్లు తాగి కాలం వెళ్ళదీసిన రోజులు ఎన్నో ఉన్నాయి. తప్పు చేయలేదు, ఎవరి పైసాపై ఆశపెట్టుకోలేదు, భారంగా గడిచే సమయాన్ని సవాలుగా స్వీకరించి స్వయం సమృద్ధికై ఆరాటపడ్డాను. తర్వాత చదువు పూర్తయ్యి ఉద్యోగ జీవితంలో బాగానే నిలదొక్కుకున్నా..కానీ సమయం మారడానికి ఎంతసేపు. నా జీవితంలోనూ మార్పు వచ్చింది. ఇప్పుడు జీవన సంధ్యాసమయం పలకరిస్తోంది.నాటి బాల్యంలో ఉన్న స్వయంప్రకాశం ఇప్పుడు లేదు. ఇప్పుడు చందమామనే సూర్యుడి వెలుతురు పడితే తప్ప ప్రకాశించలేను. అందుకే బాల్యం నన్ను వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడూ.. అయితే మరలా సూర్యుడినై వెలగాలని ఉంది. నాది ఉషోదయమా

అస్తమయమా అన్నది త్వరలో కాలమే చెప్పనున్నది.

No comments:

Post a Comment