మారని మనిషి
ఎలా సముదాయించను
మనసును
కొత్తగా
ఆలోచించమని
ఎలా చెప్పను
నా అక్షరాలకు
వేరే ఏదైనా
రాయమని
ఏమని వివరించను
నా భావాలకు
మరో భావం
విరచించమని
ఎలా మారమని
కోరను అంతరంగాన్ని
అంతరం ఏదైనా
చూడమని
భావాల
సుమాహారం నా మానసం
అంతరంగాల
సుడిగుండం నా హృదయం
వికసించిన
మంచు పుష్పం నా అక్షరం
భావానికి
అక్షర రూపం
అంతరంగంలో
ఎగిసిపడే కెరటం
మనసులో విరిసే
పుష్పం
అన్నీ నీవే
అయితే
మరో భావం ఎలా
పుడుతుంది నాలో
కనులనుండి
జారిపడే కన్నీటి చుక్కలో
మనసులో రేగే
వేదనలో
మది పులకింతలో
పెదాలపై
నర్తించే చిరునవ్వులో
నా ఓటమిలో
నా విజయంలో
నీలినింగి తారకలో
ఎగిసిపడే
కెరటంలో
వింజామరలు
వీచే పిల్లగాలిలో
పుడమిని తాకే
చినుకులో
మనసును దోచే
మట్టివాసనలో
ప్రకృతి
సమస్తంలో
నాకు నువ్వే
కనిపిస్తే
నా అక్షరాలకు
నీవే ప్రాణం పోస్తే
నీ గురించి
కాకుండా
ఇంకేం రాయగలను
నేను మారని
మనిషిని
మనస్వినీ
No comments:
Post a Comment